![]() |
Dr. Mohan Bhagwat ji |
ఆర్ఎస్ఎస్ సర్ సంఘఛాలక్ డాక్టర్ మోహన్ జి భాగవత్ రాజకీయాల్లో రిటైర్మెంట్ వయసు గురించి అన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలలో ప్రచారం జరుగుతోంది. వారి వ్యాఖ్యలలో రాజకీయ ప్రకటన ఏదీ లేదు.
నాగ్‌పూర్‌లో జులై 9న జ్యేష్ట సంఘ్ ప్రచారక్ స్వర్గీయ మోరో పంత్ పింగ్లేపై ఒక పుస్తకం విడుదల సందర్భంగా గతంలో జరిగిన ఒక సంఘటనను మాత్రమే వారు గుర్తు చేయడం జరిగింది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కి చెందిన ప్రభావవంతమైన, నిరాడంబర వ్యక్తులలో ఒకరైన మోరోపంత్ పింగ్లే అసాధారణ జీవితానికి సంబంధించి “Moropant Pingle: The Architect of Hindu Resurgence” అనే పుస్తకాన్ని సీనియర్ సంఘ్ కార్యకర్తలు, స్వయంసేవకుల సమక్షంలో ఇక్కడి వనమతి ఆడిటోరియంలో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ఆవిష్కరించారు. సమయానుసారంగా ఆసక్తికరమైన అనేక విషయాలను వెల్లడిస్తూ మంచి జ్ఞాపకశక్తికి పేరుగాంచిన డాక్టర్ మోహన్ భాగవత్ ఈ సందర్భంగా పింగ్లే జీవితంలో పెద్దగా తెలియని ఘట్టాలను సభలో పంచుకున్నారు. ఇవి అలుపెరుగని నిర్వాహకుడిగా, లోతైన ఆత్మత్యాగశీలిగా, వినోదాన్ని పంచుతూ ప్రశంసలను దూరం పెట్టే పింగ్లే గారి ఉన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాయి.
ఒకసారి బృందావన్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశంలో చోటు చేసుకున్న సంఘటనను మోహన్ భాగవత్ జీ గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పారు... "మోరోపంత్ పింగ్లేజీకి 75 ఏళ్ళు నిండాయి. అప్పుడు మేము బృందావనంలో ఒక సమావేశంలో ఉన్నాము. అక్కడ అఖిల భారత కార్యకర్తలు కూడా ఉన్నారు. సమావేశం ముగింపునకు ముందు, హెచ్.వి.శేషాద్రి గారు మాట్లాడుతూ "నేడు మన మోరోపంత్ జీకి 75 ఏళ్ళు నిండాయి. అందుకు గాను ఆయనకు ఒక శాలువాను బహుకరిస్తున్నాం" అని చెప్పి శాలువా కప్పారు. ఆ తర్వాత పింగ్లే జీని మాట్లాడమని కోరారు. ఆయన మాట్లాడటానికి ముందు కార్యకర్తలు నవ్వు ముఖాలతో ఉన్నారు. ఆయన స్పందిస్తూ "నా సమస్య ఏమిటంటే, నేను నిలబడగానే అందరూ నవ్వడం మొదలుపెడతారు.
నేను నవ్వేలా ఏమీ చెప్పకపోయినా, నేను మాట్లాడితే నవ్వుతారు. బహుశా నన్ను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదనిపిస్తుంది" అన్నారు. ఆ తర్వాత ఆయన "నేను చనిపోయినప్పుడు, నేను నిజంగా చనిపోయానో లేదో తెలుసుకోవడానికి ప్రజలు మొదట రాళ్లు విసిరి చూస్తారు...నాకు 75 సంవత్సరాలు నిండినందుకు గాను మీరంతా నన్ను సత్కరించారు. కానీ దాని అర్థం నాకు తెలుసు. 75 సంవత్సరాల వయసులో శాలువా కప్పారంటే, 'ఇక నీకు వయసైపోయింది, కాస్త పక్కకు జరుగు, మమ్మల్ని చేయనివ్వు' అని దాని అర్థం అన్నారు పింగ్లే జీ. ఆయన పట్ల అందరూ మనసులో గౌరవ భావంతోనే అదంతా చేశారు, కానీ ఆ గౌరవానికి తాను అతుక్కోకుండా పింగ్లే జీ జాగ్రత్తపడేవారు" అని పింగ్లే జీ స్థితప్రజ్ఞత్వాన్ని వెల్లడిస్తూ మోహన్ భాగవత్ ఈ సంఘటనను జ్ఞాపకం చేసుకున్నారు.
స్వాతంత్య్రానంతర హిందూ సాంస్కృతిక భావాల పునరుజ్జీవనంలో మోరోపంత్ పింగ్లే పోషించిన కీలక పాత్రను ఆర్ఎస్ఎస్ పండితులు, పలువురు చరిత్రకారుల బృందం రచించిన ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. అగ్రశ్రేణి వ్యూహకర్తగా పేరుపొందిన పింగ్లే, సంస్థ దీర్ఘకాలిక దార్శనికతను, విస్తరణను రూపొందించడంలో ముఖ్య భూమిక పోషించారు. అయితే పింగ్లే ఎక్కువగా తెర వెనుకనే ఉన్నారు. పింగ్లే గారి గురించి డాక్టర్ భాగవత్ పంచుకున్న జ్ఞాపకాలను గమనిస్తే, తరతరాల ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు పింగ్లే గారు మార్గదర్శకుడిగా ఉన్నప్పటికీ, ప్రశంసల కంటే అజ్ఞాతాన్నే కోరుకున్న ఒక అరుదైన వ్యక్తిగత తత్వాన్ని అందిస్తాయి.
"పింగ్లే గారి జీవితం నిశ్శబ్ద నాయకత్వానికి ఒక పాఠం, ఆయన ఎప్పుడూ వెలుగులోకి రావాలని కోరుకోలేదు, అయినప్పటికీ ఆయన ప్రభావం ఇప్పటికీ సంఘ్ దిశను నిర్దేశిస్తుంది." అని డాక్టర్ భాగవత్ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో పింగ్లే సంస్థాగత దార్శనికతతో ముడిపడిన శాశ్వత ప్రాధాన్యత, వలస అనంతర భారతదేశంలో సైద్ధాంతిక, క్షేత్రస్థాయి కార్యాచరణ యత్నాలను ఏకం చేయడంలో ఆయన పాత్రపైనా చర్చలు కూడా జరిగాయి. ఈ జీవిత చరిత్ర ప్రస్తుతం ఆంగ్లంలో అందుబాటులో ఉంది, ఇంకా రాబోయే నెలల్లో పలు భారతీయ భాషల్లోకి అనువదించబడుతుందని భావిస్తున్నారు.
అయితే, ఈ సభలో డాక్టర్ మోహన్ భాగవత్ గారు, పింగ్లే జీ జీవితానికి సంబంధించి మాత్రమే మాట్లాడిన అంశాలలో కొన్నిటిని మాత్రం మీడియాలోని కొన్ని వర్గాలు ఉద్దేశ్యపూర్వకంగా ఎంపిక చేసుకున్నాయి. ఈ ఆంశాలను ఆ మీడియా వర్గాలు సమకాలీన రాజకీయాల కోణంలో చూస్తూ, ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నవారి వయస్సును లక్ష్యంగా చేసుకుని మోహన్ జీ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తప్పుడు అర్థంతో వక్రభాష్యం చెబుతున్నాయి.