హైదరాబాద్: గాజుల రామారంలోని కైసర్ నగర్లో బుధవారం మధ్యాహ్నం శివాలయంలోని నంది, వినాయక విగ్రహాలను దుండుగులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా నంది విగ్రహంపై వున్న వస్త్రాన్ని కాల్చి, హుండీలో అగ్గిపుల్లలు వేసి, గుడి గంటలను విరగ్గొట్టారు. దీంతో స్థానిక భక్తులు, హిందువులు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. దేవాలయంపై దాడి చేసిన నిందితులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా తమ ప్రాంతలో ఇలాంటి చర్యలు పునరావృత్తం కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని, హిందూ మనోభావాలను కాపాడాలని కోరారు. దేవాలయంపై దాడిని నిరసిస్తూ కైసర్ నగర్ హనుమాన్ దేవాలయం నుంచి శివాలయం వరకు హిందూ వాహిని ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హిందువులు, భక్తులు,హిందూ సంఘాల నాయయకులు పాల్గొన్నారు. దీని తర్వాత సూరారం పోలీసులు స్పందించారు. తాము అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.