మాతృభూమి సేవ కోసం ఉద్భవించిన సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్. 1925లో పరమ పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ గారిచే స్థాపించబడిన ఈ సంస్థ పురుడుబోసుకున్న అనతి కాలంలోనే ఎంతో మంది సుశిక్షితులైన కార్యకర్తలను తయారుచేసి అటు సమాజంలో సామాజిక రుగ్మతలను నిర్మూలించి, అసమానతలను తొలగించే ప్రయత్నం చేస్తోంది. వంద సంవత్సరాల ఈ ప్రయాణంలో, రోజువారీ శాఖలో నిక్షిప్తమైన విలువలతో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సమాజపు అచంచలమైన విశ్వాసం, ఆప్యాయతలను సంపాదించింది.
ధర్మంపై ఆధారపడిన, ఆత్మవిశ్వాసంతో నిండిన వ్యవస్థీకృత, సామూహిక జీవితం ఆధారంగా మాత్రమే హిందూ సమాజం తన ప్రపంచ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చగలదని ఆర్.ఎస్.ఎస్. విశ్వసిస్తోంది. అందువల్ల, దేశమాత సేవలో నూరు వసంతాలను పూర్తి చేసుకుంటున్న తరుణంలో అన్ని రకాల వివక్షతలను తిరస్కరించి, పర్యావరణ అనుకూల జీవనశైలిని అనుసరించే కుటుంబాలను ప్రోత్సహించి, స్వయంగా, పౌర విధులకు కట్టుబడి ఉన్న ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించాలని సంకల్పించింది.
ఇది భౌతికంగా సంపన్నమైన, ఆధ్యాత్మికతతో నిండిన, సవాళ్లను తగ్గించే, సమాజంలోని అన్ని సమస్యలను పరిష్కరించే బలమైన జాతీయ జీవితాన్ని నిర్మించడానికి మనకు వీలు కల్పిస్తుంది. అయితే ఆర్.ఎస్.ఎస్. అంటే గిట్టని కొందరు నకిలీ సంకల్ప పత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ నకిలీ పోస్టుపై రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ బయ్యా వాసు స్పందించారు. ఓ కులాన్ని ప్రస్తావిస్తూ అఖిల భారతీయ ప్రతినిధి సభలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రపంచశాంతి, సమృద్ధుల కోసం సమరసతతో కూడినటువంటి సంఘటిత హిందూ సమాజ నిర్మాణం కోసం సంకల్పించినట్లు వివరించారు.