మొన్న విజయనగరం.. నిన్న అన్నమయ్య జిల్లా రాయచోటి, ఇవాళ బెంగళూరు.. కరుడుగట్టిన ఉగ్రవాదులు కళ్ల ముందే తిరుగుతున్నారు. మనలో ఒకరిగా కలిసిపోయి దేశంలో కల్లోలం సృష్టించేందుకు ప్లాన్ చేశారు ముష్కరులు. తాజాగా బెంగళూరులో భారీ ఉగ్ర కుట్ర భగ్నమయ్యింది. ముగ్గురు ఉగ్రవాదులను NIA అదుపు లోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. బెంగళూరు పరప్నన అగ్రహార జైలులో పనిచేస్తున్న డాక్డర్ నాగరాజు, ASI చాంద్‌పాషా , ఫాతిమా అనే మహిళను అరెస్ట్ చేశారు.
ఈ ముగ్గురు చాలా రోజుల నుంచి ఉగ్రవాదులకు సహకరిస్తునట్టు గుర్తించారు. కోలార్‌లో మరో వ్యక్తిని కూడా అదుపు లోకి తీసుకున్నారు. డాక్డర్ నాగరాజు, ASI చాంద్‌పాషా , ఫాతిమా NIA అధికారులు సీజ్ చేశారు. నిందితుల బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు. గత నాలుగేళ్ల నుంచి జరిగిన ఆర్ధిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం దాడి తర్వాత, స్లీపర్ సెల్స్‌పై మన బలగాలు మరింత ఫోకస్ పెంచాయి. పెహల్గామ్ దాడిలో లష్కర్-ఎ-తోయిబాతో సంబంధం ఉన్న ఆరుగురు స్లీపర్ సెల్ సభ్యులే కారణం. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశంలో ఉగ్రవాదుల స్లీపర్ సెల్స్ తిరిగి క్రియాశీలమయ్యే అవకాశాలు ఉండడంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు సమాచారం. గతంలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో అరెస్టైన వారు, వారికి సహకరించిన వ్యక్తులను గమనిస్తుండాలని కేంద్ర నిఘా విభాగాల నుంచి రాష్ట్రాలకు సూచనలు అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలు చోట్ల ఉగ్రవాదులు పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
టెర్రర్ స్లీపర్ సెల్స్ అనేవి, జనం మధ్య గుట్టుచప్పుడు కాకుండా పనిచేసే ఉగ్రవాద గ్రూపులు లేదా ఉగ్రవాద సానుభూతి పరులు. వీళ్లు చాప కింద నీరులా పనిచేస్తారు. టెర్రర్ గ్రూపు కమాండర్లు ఆదేశించిన వెంటనే, ఈ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి. వీళ్లు గోప్యంగా పనిచేస్తూ, నిఘా వ్యవస్థల కంట పడకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. అయితే ముందుగానే వాళ్ల ఖేల్ ఖతమ్ చేసేందుకు పోలీస్ యాక్షన్ స్టార్ట్ అయింది.