ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న లులుమాల్ లో పనిచేసే మేనేజర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఓ మహిళా ఉద్యోగిని ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను హోటల్‌కి తీసుకెళ్లి.. మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఇస్లాం మతంలోకి మారాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఇక బాధితురాలు జరిగిన ఘోరాన్ని పోలీసులకు తెలియజేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే లక్నో ఉన్న లులుమాల్లో సుల్తాన్పూర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల మహిళా ఉద్యోగిగా అక్కడ పని చేస్తోంది. మాల్లో మేనేజర్‌గా ఉన్న 27 ఏళ్ల మహ్మద్ ఫర్హాజ్ ఆమెను లవ్ చేస్తున్నానంటూ ట్రాప్‌లో పడేశాడు. ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. రహస్యంగా వీడియో తీసి పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. అంతేకాక ఆమెను హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారాలంటూ ఒత్తిడి తెచ్చాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన డిమాండ్లకు అంగీకరించకపోతే వీడియోను ఆన్లైన్లో పెడతానంటూ బెదిరించాడని ఆమె పోలీసుల దగ్గర వాపోయింది. గతంలో ఫర్హాజ్ అతడి ఇంటికి కూడా తీసుకెళ్లాడని.. అక్కడ తనపై దాడి చేసి సిగరెట్‌తో కాల్చాడని బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది.
ఈ వివరాలన్నీ నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మహ్మద్ ఫర్హాజ్ ను అరెస్టు చేశారు. అతడి పై గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నంబర్ 608/25, BNS సెక్షన్లు 64, 123, 308, 115(2), 352, మరియు 351(3) కింద కేసు నమోదు చేశారు.. ప్రాథమిక ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ సౌత్ నిపున్ అగర్వాల్ తెలిపారు. కేసులో సమర్పించిన ఆధారాలు, వాదనలు, వస్తువులను ధృవీకరిస్తున్నట్లు చెప్పారు.
అయితే కేవలం ఇప్పుడు మాత్రమే కాదు గతలోంకూడా ఈ మాల్ విషయంలో పెద్ద వివాదం చెలరేగింది. గతంలో ఈ మాల్లో నమాజ్ చేసిన వీడియో దేశమంతటా వైరల్ అయింది. దీంతో మాల్‌ను మతపరమైన స్థలంగా మార్చారంటూ హిందూ సంఘాలు నిరసన తెలిపాయి. అనంతరం వారు మాల్ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాల్లో మత ప్రార్థనలు చేయడానికి వీలు లేదంటూ, అక్కడ ప్రార్థనలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.