హిందూ సంఘటన ద్వారా దేశ పరమవైభవ స్థితిని సాధించే లక్ష్యంతో ప్రారంభమైంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.
అయితే ఇందులో కేవలం పురుషులు మాత్రమే చేరడానికి వీలుంది. మహిళలు కూడా ఆ లక్ష్య సాధనలో భాగస్వాములను చేయడం కోసం స్థాపించబడినదే రాష్ట్ర సేవికా సమితి. 1936వ సంవత్సరంలో శక్తి విజయానికి గుర్తుగా విజయదశమి రోజున కేవలం ఐదుమందితో ప్రారంభించిన ఈ సంస్థ నేడు దేశవిదేశాల్లో శాఖోపశాఖలుగా విస్తరించింది. దీన్ని ప్రారంభించినవారు వందనీయ మౌసీజీగా పిలువబడే లక్ష్మీబాయి కేల్కర్.1905 జూలై 6 ఆషాఢ శుద్ధ దశమిన పుణె లోని యశోదాబాయి, భాస్కరరావు దాలే దంపతులకు జన్మించింది మౌసీజీ. వారి బాల్య నామం కమల. చిన్నప్పటి నుంచే ఇంట్లో ఉండే జాతీయభావన, సంస్కారయుతమైన వాతావరణంలో పెరిగిన ఈమె, పురుషోత్తమ రావు కేల్కర్ ను వివాహమాడింది. అప్పటి నుంచి ఆమె పేరు లక్ష్మీబాయిగా మారింది.
తన పుట్టింటి అలవాట్లకు, వాతావరణానికి పూర్తి వ్యతిరేకమైన అలవాట్లు, పద్ధతులున్న కుటుంబం మెట్టినింటి వారిది. ఆ పరిస్థితుల్లో తనదైన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూనే ప్రతి పనిలో వారికి అనుగుణంగా నడుచుకునేది. జాతీయ భావం, వాసన ఏ మాత్రం లేని ఆ వాతావరణంలో తన స్నేహంతో పాటు , తన ఆలోచనలు నలుగురిలోకి పంపించింది. ఆమె అంతరంగంలో తన దేశ, ధర్మాలకు ఏదైనా చేయాలనే మధన సాగుతూనే ఉంది. ఇలా గడిచి పోతున్న జీవితంలో పెద్ద కుదుపు పురుషోత్తమ రావు మరణం.
కుటుంబ బాధ్యతలు పూర్తిగా తోటికోడలు ఉమాభాయి, లక్ష్మిబాయిల మీద పడినాయి .సమర్థవంతంగా బాధ్యతలు మోస్తూనే సమాజ చింతనా చేసేవారు వందనీయ లక్ష్మీబాయి. తన ఇల్లు, సమాజమూ ఒకేలా ఉన్నాయనిపించేది ఆవిడకి. సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు అర్థం లేనివిగా అనిపించేవి.
ఇలా మధన సాగుతున్న సమయం లోనే సీతాదేవి వ్యక్తిత్వం నుండే రాముడు రూపుదిద్దుకుంటాడు అని నమ్మిన ఆమె, ప్రతి భారతీయ స్త్రీలలో సీతాదేవిని నిర్మించి,, తద్వారా జాతి పునర్వైభవాన్ని ఏర్పరచాలని నిర్ణయించుకుంది. ఆ సమయంలో ఆవిడకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ (ఆర్.ఎస్.ఎస్) పరిచయం జరిగింది. ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపకులు పరమ పూజ్యనీయ డాక్టర్ జీ ని వారు కలిసారు.
“గరుడ పక్షి రెండు రెక్కలూ సమానంతో ఎగిరినపుడే లక్ష్యాన్ని ఛేదించగలదు” అని చెబుతూ కేవలం పురుషుల కోసం మాత్రమే సంస్థ పనిచేస్తే… మీరనుకున్న లక్ష్యాన్ని సాధించగలరా? సమాజంలో సగభాగమైన స్త్రీలు దుర్బలులైతే ఎలా? అంటూ తన ఆలోచనలు, సందేహాలను వారిముందుంచింది. అలా వారిని పలుమార్లు కలిసి చర్చించిన తర్వాత ఆమె మనసులో రాష్ట్ర సేవికా సమితి గురించిన రూపకల్పన జరిగింది. అదే విషయం పూజ్య డాక్టర్ జీ ముందు ఉంచారు. అప్పుడు మీరు ప్రారంభించబోయే సమితి, సంఘానికి సమాంతరంగా పనిచేయాలి కానీ సంఘ అనుబంధంగా కాదు అని డాక్టర్జీ వారితో స్పష్టంగా చెప్పారు.అందుకోసం శారీరక శిక్షణ, కార్య పద్ధతుల విషయంలో సంఘ స్వయం సేవకుల మార్గదర్శనం ఉంటుందనీ. కానీ మీరు త్వరలోనే స్వయం సమృద్ధమవాలి అని వారు పేర్కొన్నారు. ఆయన ఆలోచనా మౌసీ జీకి సంపూర్ణంగా అర్థమయింది. ఆ తరువాత 1936, విజయదశమి రోజున వార్థాలో ఒక 5 మంది సేవికలతో రాష్ట్ర సవికాసమితి ఆవిర్భావం జరిగింది .
మహిళలలో శారీరక, మానసిక, బౌద్ధిక వికాసాన్ని శిక్షణ ఇవ్వటంలో వారిలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింప చేయవచ్చని మౌసీ జీ భావించారు. స్వీయరక్షణ కోసం నియుద్ధ, దండ, చురికలాంటి శస్త్ర విద్యలతో పాటుగా, బుద్దిబలం కోసం వివిధ విషయాల చింతన, విశ్లేషణ చేయడం. వాటికి పరిష్కారం అన్నీ సేవికా సమితి శాఖలో రూపొందాయి.నమో అష్టభుజదేవి..అంటూ సాగే ప్రార్థనతో సేవికాసమితిలోని ప్రతి సేవికా అష్టభుజాదేవి అని చెబుతూ తను శక్తిరూపిణిని అని వారిలోని ఆత్మశక్తిని మేల్కొల్పే ప్రయత్నం చేశారు వారు.
ఇలా ఆనాడు వారు నాటిన బీజం నేడు దినదిన ప్రవర్తనమానంగా మహావఈరక్షమై కేవలం శాఖకే పరిమితం కాకుండా అనేక సేవాకార్యక్రమాలను సైతం చేస్తూ ఈనాటికీ మహిళలలో ఆత్మశక్తిని నెలకొల్పుతూనే ఉంది.