![]() |
| gurus |
మత స్వేచ్ఛ పేరుతో అక్రమ మత మార్పిళ్లు పెట్రేగిపోతున్నాయని, దేశం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోందని సాధు సంతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ వైవిధ్యత వున్న దేశమని, దేశం గొప్పతనం అంతా ఇందులోనే ఇమిడి వుందన్నారు. దీని కారణంగా దేశంలో వేల సంవత్సరాలుగా వివిధ విశ్వాసాలు, సంప్రదాయాలు వర్ధిల్లుతున్నాయని అన్నారు.
దేశంలో మత మార్పిళ్లు పెట్రేగిపోతున్న నేపథ్యంలో నిర్మోహి అఖాడ, అఖాడ పరిషత్, ఆలిందియా సంత్ సమితి సంయుక్తంగా ఢిల్లీలో ‘‘మత స్వేచ్ఛ, మత మార్పిడి’’ అనే అంశంపై విలేకరుల సమావేశం నిర్వహించాయి.
ఈ సందర్భంగా అఖారా పరిషత్ ప్రధాన కార్యదర్శి పూజ్య శ్రీ మహంత్ రాజేంద్ర దాస్ జీ మహారాజ్, ఆలిండియా సంత్ సమితి ప్రధాన కార్యదర్శి పూజ్య శ్రీ జితేంద్రానంద సరస్వతీ స్వామీజీ మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి వ్యక్తికి తన మతాన్ని ఆచరించే, ప్రచారం చేసే స్వేచ్ఛ వుందని ,కానీ.. ఈ స్వేచ్ఛ ఆరోగ్యకరంగా వుండాలన్నారు. మత ప్రచారం అంటే మత మార్పిళ్లు కాదని న్యాయ స్థానాలు కూడా వివిధ సందర్భాల్లో తీర్పునిచ్చాయని స్వామీజీలు ఉటంకించారు.
స్వాతంత్రం తర్వాత అక్రమ మత మార్పిళ్లను నిరోధించేందుకు చట్టాలు తేవాలని అనేక మంది సాధు సంతులు డిమాండ్లు చేశారని, ఈ విషయం రాజ్యాంగ సభలో కూడా చర్చించబడింది, కానీ అప్పటి పాలక పక్షం ఈ చట్టాన్ని రూపొందించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉందని పేర్కొన్నాయని గుర్తు చేశారు.అందుకే, భారతదేశంలోని అనేక రాష్ట్రాలు - మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ మొదలైనవి - మత మార్పిడి నిరోధక చట్టాలను తీసుకొచ్చాయన్నారు. అయితే వీటి ఉద్దేశం ఆయా మత విశ్వాసాలను అణచివేయడం మాత్రం కాదని, బలవంతం, ప్రలోభాల ద్వారా మత మార్పిళ్లను నిరోధించడమేనని సాధు సంతులు స్పష్టం చేశారు.
అక్రమ మత మార్పిళ్లు చేసేవారు, మద్దతుదారులు హైకోర్టుల్లో రాజ్యాంగ చట్టాలను సవాలు చేస్తూ కేసులు వేశారని, కానీ.. దురదృష్టవశాత్తు వారి వాదనలను కూడా వినాలని సుప్రీం ఆదేశించిందన్నారు.ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం కాబట్టి, మొదట హైకోర్టు వెలువరించిన అభిప్రాయాల తర్వాతే సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటే బాగుంటుందన్నదే తమ అభిప్రాయమన్నారు.
మరోవైపు ప్రభుత్వాల నియంత్రణ నుంచి హిందూ దేవాయాల విముక్తి అంశంపై కూడా సాధు సంతులు స్పందించారు. ఇదే విషయాలకు సంబంధించి, దయానంద సరస్వతి దాఖలు చేసిన పిటిషన్ లో, ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయమని సుప్రీం పేర్కొందని గుర్తు చేశారు.అందుకే ఈ కేసులన్నీ సుప్రీంలో వినిపించలేమన్నారు. అక్రమ మత మార్పిళ్ల కేసులు కూడా రాష్ట్ర పరిధిలోనివని, అలాంటప్పుడు సుప్రీం జోక్యం ఎందుకన్నదే తమ వాదన అని అన్నారు.
ప్రస్తుత పరిస్థితి తీవ్రత దృష్ట్యా, అక్రమ మతమార్పిడిని నిరోధించే చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సాధువులు అన్నారు. దీని ద్వారా జాతీయ భద్రత, సామాజిక సామరస్యం, తమ ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ హక్కులను మరింత పటిష్టం చేయవచ్చని అన్నారు. RSS - Rashtriya Swayamsevak Sangh

