కర్ణాటకలో మరో కొత్త వివాదం రాజుకుంది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో కొందరు నమాజ్ చేయడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే హై సెక్యూరిటీ జోన్లో ఇలాంటి వాటికి ఎలా అనుమతి ఇచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పష్టతనివ్వాలని డిమాండ్ చేసింది.
ఈ ఘటన కెంపెగౌడ విమానాశ్రయంలోని టెర్మినల్ 2లో జరిగినట్లు బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోను ఆదివారం రాత్రి ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "హై సెక్యూరిటీ జోన్లో నమాజ్ చేయడానికి వీరు ముందస్తు అనుమతి పొందారా? ఇది అత్యంత సున్నితమైన ప్రాంతంలో తీవ్రమైన భద్రతా సమస్య కాదా?" అని ఆయన ప్రశ్నించారు. "ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం అనుమతి తీసుకుని పథ సంచలన్ నిర్వహిస్తే అభ్యంతరం చెప్పే ప్రభుత్వం, ఇలాంటి కార్యకలాపాలను ఎందుకు చూసీచూడనట్లు వదిలేస్తోంది?" అని ఆయన విమర్శించారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని తప్పుబట్టారు. "టెర్మినల్ 2లో భారీ భద్రత ఉంటుంది. కానీ పోలీసులు గానీ, ఇతర సిబ్బంది గానీ వారిని ఆపడానికి ప్రయత్నించలేదు. ఇది ఒక వర్గాన్ని సంతృప్తిపరిచే కాంగ్రెస్ ప్రభుత్వ తీరును స్పష్టం చేస్తోంది. ఈ చర్యను సీఎం, ఐటీ మంత్రి సమర్థిస్తారా?" అని విజయ్ ప్రసాద్ ప్రశ్నించారు.

