జాతీయవాద తెలుగు వారపత్రిక జాగృతి తొలి సంపాదకులు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో చాలా చురుకైన పాత్ర పోషించిన బుద్ధవరపు వెంకటరత్నం (100) ఆదివారం కన్నుమూశారు. హైదరాబాద్ అల్కాపురిలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రిందటే శతవసంతాల వేడుకలను కూడా ఘనంగా చేసుకున్నారు.
బుద్ధవరపు వేంకటరత్నం స్వస్థలం కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని ఎర్రమిల్లి గ్రామం. కాకినాడలోని పిఠాపురం మహారాజా కళాశాలలో విద్య అభ్యసించారు.అంతేకాకుండా రఘుపతి వేంకటరత్నం నాయుడు బోధనలను ప్రత్యక్షంగా విన్న అనుభవం కూడా వీరికుంది.
వెంకటరత్నం 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రెండో సరసంఘచాలక్ గురూజీ ప్రేరణతో 1940 వ దశకంలో సంఘ్ వైపు ఆకర్షితులై, చేరారు. అయితే రచనా వ్యాసాంగం పట్ల అపరిమితమైన ఇష్టం వుండేది. దీంతో ఆయన అనేక పత్రికల్లో కూడా పనిచేశారు. పాత్రికేయునిగా, రచయితగా తెలుగు సాహితీ రంగంలో తనదైన ముద్ర వేశారు.
“స్వరాజ్యం కొరకు జరుగుతున్న సంగ్రామంలో ఆహుతి అయినచో భరతమాత చరణాల వద్ద ఒక పుష్పంగా రాలిపోతాం లేదా స్వాతంత్య్రం రావడం ఖాయం అయితే స్వతంత్ర భారతదేశంలో స్వేచ్ఛ అనుభవిద్దాం. అంతే తప్ప ఈ సంగ్రామంలో పాల్గొన్న ధన్యులుగా ఒక్క రూపాయి కూడా ప్రతి ఫలం కోరం” అనే భావం వచ్చే హిందీ భాషలో ఉన్న ప్రతిజ్ఞ చేసిన మహామహులలో బుద్ధవరపు వెంకట రత్నం ఒకరు. పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్ పేయి వంటి మహా మహులెందరో చిత్తశుద్ధితో ఈ ప్రతిజ్ఞ చేసేరు. అంతటి మహనీయులలో ఒకరైన ఈ మహానుభావుడు మన మధ్యనే మౌనంగా జీవన పోరాటం సాగించారు. అంతటి నిబద్ధత కలిగిన సమర యోధుడు కాబట్టే వృత్తి పనులు ముగించుకుని తిరిగి వస్తూండగా జరిగిన ప్రమాదంలో ఒక కాలు తీసి వేయవలసి వచ్చినా, ఆ ప్రమాదంలో నాలుక చీలి ముక్కలైనా, మాట ముచ్చట అంతంత మాత్రమే అయినా (అనర్గళంగా ఉపన్యాలు ఇవ్వడమే కాకుండా పండిట్ దీన దయాళ్ ఉపాధ్యాయ, వాజ్ పేయి వంటి పెద్దలు ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో ఆ నేతల హిందీ ప్రసంగాలను తెలుగులోకి అనువదించిన గంభీర గళం వారిది) తుది శ్వాస వరకూ ఆలోచనలలో యువకునిగానే మొక్కవోని ధైర్యంతో ఎంతో పరువుగా బతికారు.
ఆర్ఎస్ఎస్ ప్రచారకుడిగా ‘గురూజీ’ ఆజ్ఞానుసారం సంఘ్ కార్యకలాపాల నిర్వహణలో నిమగ్నమై భారత మాత సేవలో తరించిన సేవకుడు బుద్ధవరపు. ఆనాటి సరసంఘచాలక్ ‘గురూజీ (M.S.Golwalkar) ఆదేశానుసారం పరాయి పాలనలో ఉన్న భారత మాత విముక్తి కోసం నిస్వార్థంగా పోరాటం చేయడమే కాకుండా వారిచ్చిన ఆదేశానుసారం దేశవ్యాప్తంగా స్వయం సేవకులు చేసిన ఆ ప్రతిజ్ఞలో చేసిన అక్షరాక్షరానికి కట్టుబడి నిబద్ధతతో స్వాతంత్రం పొందిన తర్వాత సమర యోధులకు ప్రభుత్వం ఇచ్చినా ఏ ప్రతిఫలం ఆశించకుండా అతి సాధారణ జీవితం గడిపిన అసమాన సామాన్యుడు ఆయన.
అలాగే ‘పండిట్’ దీనదయాళ్ ఉపాధ్యాయ సంపాదకత్వంలో ‘రాష్ట్ర ధర్మ’ మాస పత్రికకు తోడుగా 36 భారతీయ భాషల్లో ఏక కాలంలో హిందుత్వ తత్వాన్ని ప్రజలకు వివరించడానికి పత్రికలు తీసుకురావాలన్న సందర్భంలో తెలుగులో ‘జాగృతి’ పత్రిక ఫౌండర్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించిన భారతమాత సేవకుడు. మాకిరాజు హనుమంతరావు పబ్లిషర్ గా ‘జాగృతి’ పత్రిక ఆనాటి కృష్ణా జిల్లా కలెక్టర్ పి. క్రోంబి (European P. Crombie) ముందు పత్రిక డిక్లరేషన్ ను వారు స్వయంగా రిజిష్టరు చేయించారు. ‘పాంచజన్య’ మాస పత్రిక ఎడిటర్ గా వాజ్ పేయి వీరికి సంఘ్ పత్రికల సమకాలీన సంపాదకులు. జాగృతి ఫౌండర్ ఎడిటర్‌గా... అప్పట్లోనే శతావధాని చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, ‘దేశభక్త’ కొండా వెంకటప్పయ్య పంతులు , ఉన్నవ లక్ష్మీనారాయణ , విశ్వనాథ సత్యనారాయణ , అడివి బాపిరాజు , మధురాంతకం రాజారాం , టంగుటూరి ప్రకాశం పంతులు , భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి ఆనాటి ప్రముఖుల చేత ప్రత్యేకంగా ఆర్టికల్స్ రాయించి ప్రచురించిన సంపాదక ఉద్దండులు వారు.
వెంకటరత్నం పూర్వీకులు 18 వ శతాబ్ద ప్రాంతంలో తూర్పు గోదావరి జిల్లా అప్పటి రామచంద్రాపురం తాలూకా (ప్రస్తుత అనపర్తి మండలం) కుతుకులూరు నుంచి పెద్దాపురం తాలూకా లోని నాయకం పల్లిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వంశ పారంపర్యంగా వచ్చిన ఎల్లమిల్లి కరణం (ప్రస్తుతం గండేపల్లి మండలం)గా వ్యవహరిస్తూనే నాలుగు దశాబ్దాల పాటు కరణాల హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు.
1940 వ దశకంలో ఆర్ ఎస్ ఎస్ లో చేరి 1942లో క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో సహచర సమర యోధులతో కలసి ఉత్సాహంగా పాల్గొన్నారు.
అప్పట్లో రాజమండ్రిలో .. సర్వశ్రీ సత్తిరాజు విశ్వనాధం, ఇందుకూరి విశ్వనాథ రాజు, ఊలపల్లి రామచంద్రమూర్తి, దినవహి వీర్రాజు, తాకిరాజు బాల వెంకట శేషగిరి రావు, సత్యవోలు వెంకట భాస్కర ఉమామహేశ్వర వర ప్రసాద మూర్తి, ప్రయాగ సుబ్రహ్మణ్యం... ఆర్ఎస్ఎస్లో వీరి సహచరులు. 1944 నుంచి సంఘ్ ప్రచారక్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సంఘ్ శిక్షకులకు శిక్షణా శిబిరాలు నిర్వహించి పాఠాలు చెప్పేరు ( విశాఖలో అప్పట్లో వెంకటరత్నం గారి నేతృత్వంలో జరిగిన శిక్షణా శిబిరంలో వారి నుంచి సంఘ్ మూల సిద్దాంతాలు, నియమాలను నేర్చుకున్నానని విశాఖ నగర బిజెపి ప్రముఖులు, విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటి చైర్మన్ గా వ్యవహరించిన వెంపరాల రామకృష్ణా రావు గుర్తు చేసుకున్నారు.
1948లో ఆర్ఎస్ఎస్పై నిషేధం ఉన్న సమయంలో విజయవాడ, కైకలూరు జైళ్లలో నిర్బంధానికి గురయ్యారు. అయితే బందరు కోర్టులో న్యాయ పోరాటం చేసి జైలు నుంచి బయటకు వచ్చేరు. ఎమర్జన్సీలో కాకినాడ జైలులో నిర్భంధంలో ఉన్నారు. ఏడు-ఎనిమిది రోజుల తరువాత అధికారులే వారిని విడుదల చేసేరు. సమర యోధుడిగా, స్వయం సేవకుడిగా, పాత్రికేయుడిగా, కథలు, నవలల రచయితగా, వివిధ పత్రికలలో సీరియల్స్ రాసిన రచయితగా, ప్రముఖ వార పత్రిక స్వాతి ప్రారంభ సంచిన నుంచి కాలమిస్ట్ గా వారం వారం .. ‘మీ తెలుగు తెలుసుకోండి’, ‘ప్రకృతి-వికృతి’ ... శీర్షికలు నిర్వహించిన నిగర్వి బుద్ధవరపు వెంకటరత్నం గారు ఈ తరం వారికి ఆట్టే తెలిసి ఉండక పోవచ్చు.
తూర్పు గోదావరి జిల్లా నాయకం పల్లిలో బుద్ధవరపు సుబ్రమణ్యం-బాపనమ్మ దంపతులకు 1925లో నవంబరు 17వ తేదీన జన్మించిన వెంకటరత్నం గారు సామర్లకోట బోర్డు హైస్కూల్ లో, రాజమండ్రి గవర్నమెంటు ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నారు. చిన్ననాటి నుంచే దేశ భక్తి, భారత మాత పట్ల వీరాభిమనం పెంచుకున్నారు. 1957వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన సూర్యము గారితో (తటవర్తి వారి ఆడపడుచు) వారి వివాహం జరిగింది.
వెంకటరత్నం గారి తండ్రి సుబ్రహ్మణ్యం 1917 మొదటి ప్రపంచ యుద్ధంలో మిలల్ట్రీలో సైనికుడిగా ఉన్నారు. యుద్ధంలో కూడా పాల్గొన్నారు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా మిలట్రీ సర్వీసులో ఉన్నారు (అప్పటికి రైల్వేలో పనిచేస్తున్నారు). సుబ్రమణ్యం ప్రభుత్వ కొలువులో చేరేవరకు వంశ పారంపర్యంగా వచ్చిన ఎర్రమిల్లి కరణీకం పదేళ్లపాటు చేశారు.
తరువాత ఆ కరణీకం వెంకటరత్నం గారి పినతండ్రి బుద్ధవరపు సుబ్బరాజు 20 ఏళ్లపాటు చేశారు. వెంకటరత్నం బిఏ పూర్తి చేసిన తరువాత 1946లో అప్పటి పెద్దాపురం ఆర్.డి.ఓ. ‘రావు సాహెబ్’ బుద్ధవరపు పాపరాజు పంతులు ఎర్రమిల్లి కరణీకం బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి 1985 లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వచ్చి వంశపారంపర్య కరణం, మునసబు, పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసేవరకు వెంకటరత్నం గారు కరణీకం చేసేరు. 5 రూపాయల పావలా జీతానికి చేరిన వెంకటరత్నం గారు కరణీకం పోయేంతవరకు అంతే జీతానికి పని చేసేరు. ఆంధ్ర రాష్ట్ర గ్రామోద్యుగుల సంఘం కార్యదర్శిగా 1956-57 నుంచి 30 ఏళ్లపాటు సేవలు అందించారు. వంశ పారంపర్య కరణాల వ్యవస్థ రద్దు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వద్దకు రాష్ట్ర గ్రామోద్యోగుల సంఘం కార్యదర్శిగా తాను, ఆనాటి జాయింట్ సెక్రటరీ ద్రోణంరాజు సత్యనారాయణ చర్చలకు వెళ్లి గ్రామాలలో ఆ వ్యవస్థ అవసరం గురించి వాదించేరు. కనీసం ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు వరకు కరణం, మునసబులను కొనసాగించాలని చేసిన విజ్ఞప్తి ఫలించలేదు. తరువాత తీసేసిన కరణాలలో అర్హులైన వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా విఏఓలుగా తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా వెంకటరత్నం గారు మళ్లీ ఆ వ్యవస్థ జోలికి పోలేదు. హైదరాబాద్ వచ్చి పూర్తి స్థాయి పాత్రికేయ వృత్తిని కొనసాగించారు.
అప్పటి వరకు స్వయంసేవకుడిగా సేవలు అందిస్తూ, కరణీకం చేస్తూ పాత్రికేయ వృత్తినే ప్రవృత్తిగా ఎంచుకున్న వెంకటరత్నం ఫుల్ టైం పాత్రికేయుడిగా జీవనయాత్ర కొనసాగించారు. ఆంధ్రప్రభ దిన పత్రికలో కూడా కొంతకాలం వారు హైదరాబాద్ లో విలేకరిగా పనిచేశారు. వృత్తిగత జీవితంలో భాగంగా హైదరాబాద్ లో ఒకప్పుడు స్థానిక పత్రికలకు వార్తలు అందించే న్యూస్ ఏజన్సీలలో బాగా పేరున్న Associate News Service (ANS) లో, రెహనుమా- ఏ- దక్కన్, సియాసత్, సాగే దక్కన్, హమారా ఆవామ్ ఉర్దూ దిన పత్రికలలో రిపోర్టర్ గా చాలా యాక్టివ్ గా పని చేసేరు. 1942 నుంచి 1969 వరకు వారి కథలు, సీరియల్స్, వ్యాసాలు భారతి, సారంగి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలలో పబ్లిష్ అయ్యాయి. 50 నుంచి 60 వరకు కథలు రాసేరు. భారతి మాస పత్రికలో గ్రంథ సమీక్షలు చేసేవారు. ‘శండిల’ కలం పేరిటా రచనలు చేసేవారు.
విశేషమేమంటే.. ఆంధ్రపత్రిక సచిత్ర వార వత్రిక 18-3-1953 నాటి సంచికలో వారు రాసిన ‘కరిణీకం’ పెద్ద కథలో కరణాల లౌక్యం గురించి చెప్పకనే చెప్పేరు. 1949-50లో ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి)లో ప్రోగ్రాం అసిస్టెంట్ గా వ్యవహరించిన ఆచంట సూర్యనారాయణ మూర్తి గారు.. వెంకట రత్నం గారి కథలను రేడియోలో చదివి శ్రోతలకు వినిపించిన సందర్భాలు ఉన్నాయి.

