![]() |
| Mohan Bhagwat |
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ ముజఫర్‌పూర్‌లోని మధుకర్ నికేతన్‌లో సంస్కృతి ఉత్థాన్ సమితి నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ మన పూర్వీకులు ఎన్నో త్యాగాలు చేసి, మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారని, దేశాన్ని గణతంత్ర రాజ్యంగా వుంచేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
మన త్రివర్ణ పతాకంలో పైన త్యాగం, కృషిని సూచించే అలాగే దేశ శాశ్వతమైన సంస్కృతిని తెలిపే కాషాయ రంగు వుందని, మధ్యలో స్వచ్ఛతను సూచించే తెలుపు వుందని వివరించారు. అందరూ కష్టపడి పనిచేయాలని, పురోగతి, శ్రేయస్సు సిద్ధిస్తుందని, లక్ష్మీదేవి వస్తుందని వివరించారు. ఇక చివరగా ఆకుపచ్చ రంగు అనేది ధర్మం ఆధారంగా నడవాలని సూచిస్తుందన్నారు.
మన రాజ్యాంగం మనకు మత ధర్మం ఏమిటో బోధిస్తుందని, రాజ్యాంగ ప్రవేశిక చదవడం వల్ల మన పౌర విధులను అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అలాగే చట్టాన్ని పాటించడం అనేది పౌరుల విధి అని ఉద్బోధించారు. మన దేశంలో కొన్ని పరంపరాగతంగా వస్తున్న చట్టాలు కూడా వున్నాయని, అయితే భారతీయ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మానవత్వాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి సంప్రదాయాలు చాలా ప్రబలంగా వున్నాయన్నారు. మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చడానికి మనమందరమూ కలిసి పనిచేయాలని మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు.

