రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనేది ఏ వ్యక్తికి, ఏ సంస్థకో లేదా ఏ సిద్ధాంతానికో వ్యతిరేకం కాదని ఆరెస్సెస్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ పునరుద్ఘాటించారు. దేశ నిర్మాణం అన్నలక్ష్యంతో సంఘ్ నిరంతరంగా పనిచేస్తూనే వుందన్నారు. సంఘ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ముంబైలోని వర్లీలో ‘‘100 ఏళ్ల సంఘ యాత్ర - కొత్త ఆశయాలు’’ అన్న శీర్షికతో కార్యక్రమం జరిగింది. అందులో మోహన్ భాగవత్ పాల్గొన్నారు.
సంఘ్ అనేది పారామిలటరీ సంస్థేమీ కాదని, అలాగే సంఘ్కి అధికార రాజకీయాలు కూడా అవసరం లేదని, ప్రతిష్ఠ, ప్రజాదరణను కూడా ఆశించదని తేల్చి చెప్పారు. సంఘ్ తనంతట తానుగా ఓ ప్రత్యేక సంస్థ అని, దీనిని అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారన్నారు. ఐదు ఖండాల నుంచి అధ్యయనశీలురు సంఘ్ కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి వచ్చారని, సంఘ్ కార్య పద్ధతిపై ఆసక్తిని చూపిస్తారన్నారు.
సంఘ్ కార్యకలాపాలు పోటీల కోసమో, ఇతర సంస్థకు వ్యతిరేకంగానో ప్రారంభం కాలేదన్నారు. సంఘ్ ను కొందరు తరుచుగా ఇతర సంస్థలతో, రాజకీయ పార్టీలో పోలుస్తారని, దీంతో తరుచుగా గందరగోళానికి దారితీస్తుందన్నారు. స్వయంసేవకులకు శారీరిక శిక్షణలో భాగంగా దండ (కర్ర) నేర్పుతారని, అంత మాత్రాన ఇదేమీ సైనిక సంస్థ కాదని, కుస్తీ అఖాడా అంతకంటే కాదని స్పష్టతనిచ్చారు. అలాగే భారతీయ సంప్రదాయాలపై ఆధారపడిన పాటలు, సంగీతం కూడా నేర్పిస్తారని సంగీత శాల కూడా కాదన్నారు.
క్రమశిక్షణ, విలువల ద్వారా వ్యక్తిత్వ నిర్మాణం, అలాగే సామాజిక సమరతపై ప్రాధాన్యం వుంటుందన్నారు.
అలాగే తన ఉపన్యాసంలో భాగవత్ చరిత్ర అంశాన్ని కూడా స్పృశించారు. బ్రిటీష్ వారు కాంగ్రెస్ ను ‘‘ఓ సెఫ్టీ వాల్’’ గా స్థాపించినప్పటికీ భారతీయులు దానిని స్వాతంత్ర పోరాటంలో శక్తిమంతమైన సాధనగా మార్చారన్నారు. అదేవిధంగా సంఘ్ కూడా సమాజంలో సానుకూల, నిర్మాణాత్మక మార్పుల కోసం నిరంతరం కృషి చేస్తోందని వివరించారు.
దేశంలో నాలుగు రకాల హిందువులు వున్నారని, అందులో మొదటి వారు తమని తాము హిందువులమని గర్వంగా చెప్పుకొంటారని, రెండో వారు సహజంగానే తమ గుర్తింపును అంగీకరించేవారని, మూడో వారు సంకోచిస్తూ సంకోచిస్తూ తమ గుర్తింపును బయటపెట్టేవారని, ఇక చివరగా నాలుగో వర్గం వారు తమ గుర్తింపునే మరిచిపోయిన వారు. కొన్ని శక్తులు ఈ చివరి వర్గం వారని ప్రలోభాలు పెట్టడానికి, మరింత ఆత్మ విస్మృతిలోకి నెట్టేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

