![]() |
| Huge statue of Swami Vivekananda unveiled in Seattle |
అమెరికాలోని సియాటిల్ ప్రాంతంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. సియాటెల్ నగరంలోని వెస్ట్ లేక్ స్క్వేర్ లో స్వామి వివేకానంద కాంస్య విగ్రహ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అమెరికా నగరంలో ప్రభుత్వమే ఏర్పాటు చేసిన మొట్ట మొదటి విగ్రహం ఇదే.వివేకానంద విగ్రహాన్ని భారతీయ కళాకారుడు నరేష్ కుమార్ కుమావత్ రూపొందించారు.
సియాటెల్ మేయర్ కేటీ విల్సన్, సియాటెల్‌లోని భారత కాన్సుల్ జనరల్ ప్రకాష్ గుప్తా సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సియాటెల్ లోని భారత కాన్సులేట్ జనరల్ ఇలా రాసుకొచ్చింది ‘‘“చికాగో 1893 నుండి సియాటెల్ 2026 వరకు! సియాటెల్ ఆకాశహర్మ్యాలకు ఒక కొత్త భారతీయ చిహ్నం వచ్చి చేరింది. అదే స్వామి వివేకానంద. సియాటెల్ నగర కేంద్రంలో స్వామి వివేకానంద స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి నగరంగా సియాటెల్ ఆవిర్భవించింది. స్వామి వివేకానంద విగ్రహాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) సియాటెల్ నగరానికి బహుమతిగా ఇచ్చింది.’’ అని పేర్కొంది.
![]() |
| Huge statue of Swami Vivekananda unveiled in Seattle |
ఈ సందర్భంగా సియాటిల్ మేయర్ కేటీ విల్సన్ మాట్లాడుతూ ఈ స్వామి వివేకానంద విగ్రహం గొప్ప బహుళ సాంస్కృతిక స్వరూపానికి, సమ్మిళిత స్ఫూర్తికి ప్రతీక అని అభివర్ణించారు. ఈ విగ్రహం భారత దేశానికి, విదేశీ నగరాలకు మధ్య సాంస్కృతిక, దౌత్య సంబంధాలను బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరో వైపు వెస్ట్‌లేక్ అత్యంత రద్దీగా వుండే ప్రాంతం. రోజుకు 4,00,000 మంది సందర్శకులు వస్తుంటారు. అమెజాన్ ప్రధాన కార్యాలయం, సియాటిల్ కన్వెన్షన్ సెంటర్ మొదలైనవి ఉన్న ఒక ప్రధాన ప్రదేశంలో వివేకానంద విగ్రహావిష్కరణ జరిగింది. దీని ద్వారా హైందవ ధర్మం, భారత దేశ వైభం అందరికీ మరింతగా పరిచయం అవుతుంది.


