హిందుత్వం అన్న భావానికి కేవలం భారత్ ను మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని శ్రేయస్సు, సామరస్యం వైపు నడిపించే సామర్ధ్యం వుందని ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు సురేష్ సోనీ అన్నారు. ఆరెస్సెస్ కార్యశతాబ్ది సందర్భంగా భువనేశ్వర్ మహా నగరంలో నిర్వహించిన ‘‘సంగోష్టి’’ లో సురేష్ సోనీ మాట్లాడారు.
ప్రపంచ వ్యాప్తంగా వున్న నాగరికతలకు సంబంధించిన చరిత్రలో వివిధ సమయాల్లో, విభిన్న సిద్ధాంతాలకు చెందిన బీజాలను నాటారని, కాలక్రమేణా అవి ఫలాలను ఇచ్చాయని అన్నారు. క్రైస్తవం, ఇస్లాం, కమ్యూనిజం వంటి సిద్ధాంతాలు అందులో వున్నాయన్నారు. ఈ సిద్ధాంతాల పర్యావసానం ఏమంటే మానవ సమాజానికి రక్తపాతాన్ని, బాధలను తెచ్చిపెట్టాయన్నారు.
భారత్ లో మాత్రం వేల సంవత్సరాలుగా ‘‘సనాతన తత్వం’’ అన్న బీజం నాటబడిందని, ఈ తత్వం ఎవ్వరికీ, ఎన్నడూ హాని తలపెట్టలేదని తేల్చి చెప్పారు. అలాగే ఎవరిని నాశనం కూడా చేయలేదన్నారు. ఈ సనాతన ధర్మం వ్యాపించిన ప్రతి చోటా, లోపాలను సరిదిద్దడం, పరిపూర్ణతను చేకూర్చడానికే ప్రయత్నించిందన్నారు.
భారత దేశానికి ఘనమైన గతం వుందని, ఈ సనాతన తత్వం కారణంగా ప్రాచీన భారతాన్ని విశ్వగురువుగా భావించేవారని, తరచూ ‘‘బంగారు బాతు’’ అని పిలిచేవారన్నారు. అయితే, వందలాది సంవత్సరాల విదేశీ దండయాత్రల కారణంగా, దురదృష్టవశాత్తు కొన్ని వక్రీకరణలు చోటుచేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సురేశ్ సోనీ విదేశీ దండయాత్రలను ప్రస్తావించారు. మొదటి సారిగా విదేశీ దండయాత్ర సింధ్ ప్రాంతంలో జరిగిందని, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో, అటువంటి దండయాత్రలు జరిగిన కొన్ని సంవత్సరాలలోనే మొత్తం దేశాలు ఇస్లాంలోకి మార్చబడ్డాయన్నారు. అయితే సింధ్ లో మాత్రం విదేశీయులను తరిమికొట్టడానికి దాదాపు మూడు వందల సంవత్సరాలు పట్టిందన్నారు.భారతీయ సమాజంలోకి చొరబడిన వైకల్యాలను ఎత్తిచూపుతూ, సింధ్ ప్రాంతం మాత్రమే ఈ ఆక్రమణదారులను ఎదుర్కొంటోందని, పంజాబ్ మరియు రాజస్థాన్ వంటి పొరుగు ప్రాంతాలు మాత్రం తమకు ముంచుకొస్తున్న ముప్పును గుర్తించలేకపోయాయని అన్నారు.
ఆంగ్లేయులను తరిమికొట్టడానికి, భారత్ కి స్వాతంత్ర సిద్ధి కోసం చాలా మంది వివిధ మార్గాలను అనుసరించారని గుర్తు చేశారు. సాయుధ విప్లవం ద్వారా వారిని తరిమి కొట్టవచ్చిన కొందరు, నూలు వడకడం, చరఖాను వినియోగించడం లాంటి కార్యకలాపాల ద్వారా ప్రయత్నించారన్నారు. ఇలాంటి వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలందర్నీ మమేకం చేశారన్నారు.
అలాగే బ్రిటిష్ వారిని నేరుగా ఎదుర్కోవడానికి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయవచ్చని విశ్వసించిన ఒక వర్గం కూడా భారతదేశంలో ఉండేదని, రాస్ బిహారీ బోస్, నేతాజీ లాంటి వారు ఈ కోవలోకి వస్తారని, అలాగే సామాజిక దురాచారాలను నిర్మూలించడమే ధ్యేయంగా మరి కొందరు పనిచేశారన్నారు. దేశమంతటా పర్యటించిన అనంతరం, భారతదేశంలో సామాజిక ఐక్యతను పెంపొందించడం అత్యంత ఆవశ్యకమని స్వామి వివేకానంద నిర్ధారించారు. వ్యక్తిగత స్థాయిలో శీల నిర్మాణ ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. 1897లో, రాబోయే యాభై సంవత్సరాల పాటు ప్రజలు ఇతర దేవతల ఆరాధనను పక్కన పెట్టి, కేవలం భారత మాతను మాత్రమే కొలవాలని కూడా సూచించారన్నారు.
ఇక.. ఆరెస్సెస్ స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ భారత్ పరాధీనతపై లోతుగానే ఆలోచించారని, కోల్కతాలో తన వైద్య విద్యను అభ్యసించే సమయంలో, ఆయన విప్లవకారులతో కలిసి పనిచేశారని గుర్తు చేశారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీలో కూడా చురుకుగా పాల్గొన్నారు. దేశంలో జరుగుతున్న వివిధ సామాజిక సంస్కరణ ఉద్యమాలను ఆయన నిశితంగా పరిశీలించారని అన్నారు. ఆ తర్వాత అన్ని ఆలోచించిన తర్వాత 1925 లో ఆరెస్సెస్ ను స్థాపించి, దైనందిన శాఖ అన్న దానిని తీసుకొచ్చారన్నారు. దీనికి ఇప్పుడు వంద ఏళ్లు అయ్యిందన్నారు.
ఆ తర్వాత భారతీయ తత్వ చింతనకు అనుగుణంగా పనిచేయడానికి గాను, ఆరెస్సెస్ స్వయంసేవకులు అనేక సంస్థలను స్థాపించారన్నారు. అందులో భాగంగా విద్యా రంగంలో విద్యా భారతి, కార్మిక రంగంలో బీఎంఎస్, స్వదేశీ జాగరణ మంచ్, సేవా భారతి, భారత్ వికాస్ పరిషత్, వనవాసీ కల్యాణాశ్రమం వంటి అనేక సంస్థలు ఏర్పడ్డాయని వివరించారు. ఈ సంస్థలు భారతీయ దృక్పథాలను పునఃస్థాపించే దిశగా నిరంతరం కృషి చేస్తున్నాయని తెలిపారు. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా సంఘ్ పంచ పరివర్తన్ అన్న దానిని ప్రజల ముందుకు తెచ్చిందని అందులో పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ, సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, పౌర విధులు వున్నాయని సురేశ్ సోనీ వివరించారు.

