మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లా, బడఖేడి గ్రామంలోని ఒక విద్యాసంస్థలో జరిగిన ఆకస్మిక తనిఖీ తీవ్ర కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (SCPCR) నిర్వహించిన ఈ తనిఖీల్లో బాలికల భద్రత, రక్షణ, మరియు నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అధికారిక రికార్డులకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేకపోవడంతో అధికారులు తీవ్ర చర్యలకు ఉపక్రమించారు.
అనుమతి ఒకదానికి.. నిర్వహణ మరొకదానికి!
మధ్యప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ ఛైర్పర్సన్ డాక్టర్ నివేదిత శర్మ, సభ్యురాలు సోనమ్ నినామా మరియు జిల్లా విద్యాశాఖ అధికారిణి (DEO) తెరెసా మింజ్ కలిసి బదఖేడి గ్రామంలో ఒకే ప్రాంగణంలో నడుస్తున్న 'దారుల్ ఉలూమ్ అహ్లే సున్నత్ మోయనియా ఫైజాన్-ఎ-గరీబ్ నవాజ్ మదర్సా' మరియు 'మోనియా బాలికల పాఠశాల'ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ సంస్థకు కేవలం 6 నుండి 8 తరగతుల నిర్వహణకు మాత్రమే మధ్యప్రదేశ్ బోర్డు నుండి గుర్తింపు ఉంది. కానీ, తనిఖీ సమయంలో 3వ తరగతి నుండి 12వ తరగతి వరకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు, అధ్యయన సామగ్రి లభించాయి.
సాధారణ విద్యా బోర్డు గుర్తింపు ఉన్న ఈ పాఠశాల ఆవరణలో పెద్ద ఎత్తున “దీనీ తాలీమ్” (ఇస్లామిక్ మత విద్య)కు సంబంధించిన పుస్తకాలు లభించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.పాఠశాల కార్యాలయంలో, పై అంతస్తులో ఉన్న సుమారు 10 గదులను తెరవాలని అధికారులు పదేపదే కోరినప్పటికీ, యాజమాన్యం అందుకు నిరాకరించి తాళాలు తీయలేదు. ఇది సంస్థ లోపల జరుగుతున్న రహస్య కార్యకలాపాలపై అనుమానాలను మరింత బలపరిచింది.
మాయమైన విద్యార్థినులు: రికార్డుల్లో వంద మంది..
తనిఖీ బృందాన్ని అత్యంత ఆందోళనకు గురిచేసిన అంశం విద్యార్థినుల సంఖ్య మరియు వారి లభ్యత. ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్‌కు, పాఠశాల అంతర్గత రికార్డులకు మధ్య భారీ వ్యత్యాసాలు కనిపించాయి.ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్‌లో కేవలం 37 మంది విద్యార్థుల నమోదు మాత్రమే ఉండగా, పాఠశాల లోపలి “స్కాలర్ రిజిస్టర్”లో 71 మంది పేర్లు ఉన్నాయి.
క్యాంపస్ లోపల తనిఖీ చేయగా వేర్వేరు పేర్లతో ఉన్న సుమారు 100 స్కూల్ బ్యాగులు, లగేజీలు, ట్రంకులు, ఇతర వ్యక్తిగత వస్తువులు లభించాయి. దీన్ని బట్టి అక్కడ కనీసం 100 మంది బాలికలు నివసిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే, అధికారులు వెళ్లేసరికి అక్కడ ఒక్కరంటే ఒక్క బాలిక కూడా లేకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఆ విద్యార్థినులు ఎక్కడికి పోయారు? తనిఖీ సమాచారం తెలిసి వారిని ఎక్కడికైనా తరలించారా? అనే కోణంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గుర్తింపు లేని హాస్టల్.. వివరాలు దాచిన యాజమాన్యం
'మోయినియా ఎడ్యుకేషన్ సొసైటీ' పేరిట నడుస్తున్న ఈ సంస్థ, విద్యాశాఖకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా చట్టవిరుద్ధంగా, రహస్యంగా ఒక నివాస హాస్టల్‌ను కూడా నడుపుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణి తెరెసా మింజ్ ధృవీకరించారు.
అక్కడ నివసిస్తున్నట్లు భావిస్తున్న మహిళా విద్యార్థుల ఐడెంటిటీ కార్డులు, ప్రవేశ రికార్డులు, తల్లిదండ్రుల సంప్రదింపు వివరాలు లేదా కనీస గుర్తింపు పత్రాలను చూపించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైంది. ఈ సంస్థకు అసలు ప్రిన్సిపాల్ ఎవరు? పాలక మండలిలో ఎవరున్నారు? అనే వివరాలను కమిషన్‌కు అందించలేదు. అన్నిటికంటే ముఖ్యంగా, చిన్న బాలికలతో పనిచేసే ఇక్కడి సిబ్బంది, వార్డెన్ల "పోలీస్ వెరిఫికేషన్" రికార్డులు లేకపోవడం బాలికల భద్రతను తీవ్ర ప్రమాదంలో పడేసే అంశంగా అధికారులు గుర్తించారు.
ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రమైనదిగా పరిగణించిన బాలల హక్కుల కమిషన్ ఛైర్పర్సన్ డాక్టర్ నివేదిత శర్మ, సంస్థపై తక్షణమే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని విద్యా విభాగాన్ని ఆదేశించారు. కేవలం విద్యాపరమైన లోపాలే కాకుండా, బాలికల అదృశ్యం వెనుక మానవ అక్రమ వంటి ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా సమగ్ర దర్యాప్తు జరపాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బాలికల హక్కులు, భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని కమిషన్ హెచ్చరించింది.

