అంతర్గత శక్తే భారత్ ప్రత్యేకత – సురేశ్ (భయ్యాజీ) జోషి - Suresh Bhaiah ji Joshi - RSS

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ సురేశ్ భయ్యాజీ జోషి
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ సురేశ్ భయ్యాజీ జోషి
రోనా సంక్షోభ సమయంలో భారతీయ సమాజపు అంతర్గత శక్తి ప్రపంచానికి వెల్లడైంది’అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ సురేశ్ భయ్యాజీ జోషి అన్నారు. లాక్ డౌన్ సమయంలో స్వయంసేవకులు చేపట్టిన సహాయ కార్యక్రమాలు, స్వదేశీ, ఆత్మనిర్భర భారత్ మొదలైన అనేక అంశాలపై ఆర్గనైజర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

ప్ర. కరోన మహమ్మారిపై పోరులో ఆర్ ఎస్ ఎస్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. భారతీయ సమాజం కూడా మహమ్మారిని ఎదుర్కోవడంలో అపూర్వమైన పద్దతిలో స్పందించింది. ఈ మొత్తం పరిస్థితులను మీరు ఎలా చూస్తారు?
జ. ప్రస్తుత తరం ఇలాంటి మహమ్మారిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. అయితే సమాజానికి ఏదైనా విపత్తు ఎదురైనప్పుడు సంఘ స్వయంసేవకులు సహాయకార్యక్రమాలు చేపట్టడమేకాక తమదైన పద్దతిలో పరిష్కారం కనుగొనడం చూస్తాం. కరోన మహమ్మారి సమయంలో కూడా వాళ్ళు అలాగే చేశారు.
   దేశమంతటా లాక్ డౌన్ ప్రకటించినప్పుడు రోజు కూలీ చేసుకుని జీవనం సాగించేవారికి చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అది వారికి జీవన్మరణ సమస్యగా మారింది.  ఇది గమనించిన స్వయంసేవకులు వెంటనే వారికి రేషన్, ఆహార పదార్ధాలు అందించే ఏర్పాటు చేశారు. అయితే పని లేకపోవడంతో ఈ కార్మికులకు సంపాదన లేక ఆహారపదార్ధాలు కొనుక్కోలేని పరిస్థితి కూడా ఏర్పడింది. దీనితో అలాంటివారికి నెలకు పైగా రేషన్ అందించే వ్యవస్థ చేశారు. దేశంలోని ప్రతి జిల్లాలో ఈ పని జరిగింది. ఇందులో 2 లక్షలకు పైగా స్వయంసేవకులు పాలుపంచుకున్నారు. కోటికి పైగా కుటుంబాలకు ఇలాంటి సహాయాన్ని వాళ్ళు అందించారు.
  అయితే రోజులు గడుస్తున్నకొద్ది కొత్త సమస్యలు వచ్చాయి. తమ సొంత ఊళ్ళకు వెళ్లిపోవాలనుకున్న వలస కార్మికులు పిల్లలు, వృద్ధులతో సహా కాలినడకన బయలుదేరారు. ఇలా వెళుతున్నవారికి కూడా దారి పొడవునా స్వయంసేవకులు ఆహార పదార్ధాలు అందించారు. ఇదే కాకుండా అనేక రకాలుగా సహాయపడ్డారు. చెప్పులు లేకుండా నడుస్తున్నవారికి చెప్పులు ఇచ్చారు, దారి మధ్యలో అనారోగ్యానికి గురైనవారికి వైద్య సహాయం అందించారు. ఈ సహాయ కార్యక్రమాలు 40రోజులపాటు సాగాయి. వలస కార్మికుల వివరాలను నమోదు చేసే కార్యక్రమంలో కూడా స్థానిక పాలనాధికారులకు స్వయంసేవకులు సహకరించారు.
   స్వచ్ఛంద కార్యకర్తలుగా తాము ఏం చేయాలన్నది కూడా స్వయంసేవకులు స్థానిక పాలనయంత్రాంగంతో చర్చించారు. తమ ఆరోగ్యానికి,  ప్రాణాలకు ముప్పు ఉన్న పరిస్థితులు, ప్రదేశాల్లో కూడా స్వయంసేవకులు వెనుకంజ వేయకుండా పనిచేశారు. కరోనా వైరస్ బాగా వ్యాపించిన ప్రదేశాల్లో కూడా వాళ్ళు ఆరోగ్యకార్యకర్తలకు సహకరించారు. అనేక నగరాల్లో స్వయంగా కరోనా పరీక్షలు నిర్వహించారు. అందుకు తగిన శిక్షణ కూడా పొందారు.
   ఢిల్లీలో అనేక రకాలైన హెల్ప్ లైన్ లు ఏర్పాటుచేశారు. వాటిలో ఒకటి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్ధుల సమస్యలు తెలుసుకుని, పరిష్కరించేందుకు ఉద్దేశించినది. మరొకటి ప్రజలకు రేషన్, ఆహార పదార్ధాలు అందించడానికి ఉపయోగపడింది. అనేక ధార్మిక సంస్థలు కూడా కరోనా బాధితులకు సహాయాన్ని అందించాయి. దేవాలయాలు, గురుద్వారాలు, జైన మందిరాలకు చెందిన నిర్వాహకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు సహాయం అందించారు. అలాగే లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ వంటి సంస్థలు కూడా ప్రజలను ఆదుకున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా అనేక సంస్థలు తమకు తోచిన విధంగా ప్రజలకు సేవ చేశాయి.

ప్ర. సంఘ స్వయంసేవకులు ఇలాంటి సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమవడానికి వారికి ప్రేరణ ఎక్కడ నుండి కలుగుతుంది?
జ. విపత్తు నిర్వహణలో మేమేమీ నిపుణులం కాదు. అలాగే కార్యకర్తలకు అలాంటి శిక్షణ ఏది ఇవ్వం కూడా. కానీ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆలోచన సంఘ స్వయంసేవకుల్లో సహజంగానే కలుగుతుంది. ఆ రకమైన సంస్కృతి ఇక్కడ ఉంది. దశాబ్దాలుగా స్వయంసేవకులు అనేక విపత్తుల సమయంలో సహాయకార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే చేశారు. అందుకు మేము ఎలాంటి శిక్షణా ఇవ్వలేదు. కనీసం ఆ సహాయకార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన సాధనసంపత్తి కూడా అందించలేదు. అయినా స్వయంసేవకులే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలు చేపట్టడమేకాక అందుకు అవసరమైన సాధనాలు కూడా సమకూర్చుకున్నారు.
   ఇలాంటి కార్యక్రమాలను రూపొందించి, నియంత్రించే కేంద్రీయ వ్యవస్థ ఏదీ ఇక్కడ లేదు. స్వయంసేవకులే సహజంగా అవసరాలను బట్టి స్పందించి పనిచేస్తారు. సమాజమంతా తమదేననే భావనే వారికి ప్రేరణనిస్తుంది.

ప్ర. ఆర్ధిక సమస్యల నుంచి బయటపడటానికి సంఘ ప్రేరణతో పనిచేస్తున్న వివిధ సంస్థలు అనేక సూచనలు, సలహాలు ఇస్తున్నాయి. కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రస్తుత ఆర్ధిక పరిస్థితుల విషయంలో ఆర్ ఎస్ ఎస్ అభిప్రాయం ఏమిటి?
జ. ఆర్ధిక సంక్షోభం అనేక రకాలు. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా దీర్ఘకాలిక ప్రణాళిక అమలు చేయాలి. ఇలాంటి వారికి వెంటనే ఉపాధి చూపే ఏర్పాటు చేయాలి. యజమానులు కూడా ఈ కార్మికుల అవసరాలను గుర్తించి వాటిని తీర్చడానికి ప్రయత్నించాలి. అయితే స్వస్థలాలకు వెళ్ళిపోయినవారిలో చాలామంది అక్కడే ఉపాధి చూసుకోవాలనుకుంటున్నారు. అలాంటివారికి తగిన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి.  ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అందుకు తగిన ప్రణాళికలు రూపొందించి అమలుచేస్తున్నాయి.
   ప్రజల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా దృష్టి సారించాలి.  స్థానిక అవసరాలకు తగిన వృత్తి నిపుణులను స్థానికంగానే తయారుచేసుకుంటే అప్పుడు ఇతర ప్రాంతాల నుంచి తరలించాల్సిన అగత్యం ఉండదు. కాబట్టి ఈ సంక్షోభ సమయంలో ఏర్పడిన పరిస్థితులను అవకాశంగా తీసుకుని అందుకు తగిన చర్యలు చేపట్టాలి.

ప్ర. `ఆత్మనిర్భర భారత్’ సాధించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు వివిధ సంస్థలు మద్దతునిచ్చాయి. నేటి వైశ్వీకరణ యుగంలో వివిధ దేశాలు ఒకదానిపై మరొకటి ఆధారపడుతున్నాయి. ఇలాంటప్పుడు `ఆత్మనిర్భరత’ ఎలా సాధించగలం?
జ. మన గ్రామాల్లో, పట్టణాల్లో ఇప్పటికే అనేక స్థానిక ఉత్పత్తులు తయారవుతున్నాయి. ప్రధాని `స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యతనివ్వండి’ (Be Vocal about Local)అంటూ ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఇలా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలి. ఒక ప్రాంతంలోని అవసరాలన్నీ అక్కడే తీరేవిధంగా ఎలాంటి చర్యలు చేపట్టవచ్చన్నది పరిశీలించాలి. పెద్ద పెద్ద పరిశ్రమలు తయారుచేసే వస్తువులన్నింటిని స్థానికంగా ఉత్పత్తి చేయడం సాధ్యం కాకపోవచ్చును. కానీ చిన్నతరహా వ్యాపారాలను తప్పక ప్రోత్సహించాలి.
   ప్రతి జిల్లాను కేంద్రంగా చేసుకుని అలాంటి వ్యాపారాలను అభివృద్ధి చేయాలి. పెద్ద వ్యాపారాలకు రాష్ట్రాన్ని కేంద్ర స్థానంగా పరిగణించవచ్చును. ఇలా జిల్లాలను కేంద్రంగా స్థానిక వ్యాపారాలను అభివృద్ధి చేస్తే స్వావలంబన, `ఆత్మనిర్భరత’ సాధించగలుగుతాం.
   చైనా, భారత్ సరిహద్దు వివాదం మూలంగా దేశంలో `స్వదేశీ’ భావన, ఆలోచన పెరిగాయి. కోట్లాది ప్రజానీకం స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యతనిస్తూ వాటినే కొనుగోలుచేయడం ప్రారంభిస్తే అప్పుడు `ఆత్మనిర్భరత’ సులభంగా సాధించగలుగుతాం. స్వావలంబన సాధించడానికి అనువైన పరిస్థితులు కల్పించగలిగితే `ఆత్మనిర్భరత’ కేవలం నినాదంగా మిగిలిపోకుండా ఆచరణలో సాధ్యపడుతుంది.

ప్ర. ప్రస్తుత పరిస్థితుల గురించి మీరు సకరాత్మక అంశాలనే వెల్లడించారు. కానీ ఇందులో కొన్ని నకారాత్మక అంశాలు కూడా ఉన్నాయి. సరిహద్దు పరిస్థితుల దృష్ట్యా చైనా వస్తువుల బహిష్కరణ గురించి చర్చ బాగా సాగుతోంది. కానీ ఇది ఎంతవరకు సాధ్యమని భావిస్తారు?
. ఇది సహజమైన ప్రతిస్పందన. ప్రపంచ దేశాలన్నీ చైనాను బహిష్కరించాలని అంటున్నాయి. అలాగే భారత్ లో కూడా అదే ధోరణి కనిపిస్తోంది. ఎవరు ఎలాంటి ఉద్యమాలు, ప్రచారం నిర్వహించకుండానే సాధారణ ప్రజానీకం చైనా వస్తువులను బహిష్కరిస్తామంటున్నారు. అయితే ఈ స్వదేశీ భావన కేవలం ఒక దేశం పట్ల వ్యతిరేకతగా మిగిలిపోకుండా `ఆత్మనిర్భరత’ సాధించడంలో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. మొదట్లో అది ఒక దేశానికి వ్యతిరేకమైన భావనగా కనిపించినా క్రమంగా స్వావలంబన సాధించడానికి, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడానికి దోహదపడుతుంది. ఇది భారత్ కే కాదు, అన్ని దేశాలకు తమ తమ అవసరాలను స్థానికంగానే తీర్చుకునే ఏర్పాటు చేసుకునేందుకు, స్వావలంబన సాధించేందుకు చక్కని అవకాశం.

ప్ర. చైనాతో వివాదాలు దశాబ్దాలుగా సాగుతున్నాయి. ఈసారి భారత్ ప్రతిస్పందనలో ఎలాంటి తేడా ఉందని మీరనుకుంటున్నారు? సరిహద్దులో మౌలిక సదుపాయాల కల్పనకు, భద్రతకు అనేక చర్యలు చేపట్టడం జరిగింది. ఈ మొత్తం సమస్యను ఆర్ ఎస్ ఎస్ ఎలా చూస్తుంది?
జ. ఏ దేశమైనా తన సరిహద్దులను రక్షించుకోవలసిందే. అలాగే ఏ దేశం పొరుగు దేశాలతో వివాదాలు కూడా కోరుకోదు. ప్రస్తుత పరిస్థితులను ఎలా అధిగమించాలో ప్రధాని, రక్షణ మంత్రి, భద్రతాదళాలు, రక్షణ నిపుణులు నిర్ణయించి అందుకు తగిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి ప్రభుత్వం, భద్రతాదళాలకు సంబంధించిన విషయాన్ని గురించి మనం మాట్లాడటం, వ్యాఖ్యానించడం సరికాదు. పరిస్థితిని చక్కదిద్దగల సామర్ధ్యం మన భద్రతాదళాలకు పూర్తిగా ఉందని సాధారణ ప్రజానీకానికి విశ్వాసం ఉంది.

ప్ర. డిజిటల్ విద్య గురించి బాగా చర్చ జరుగుతోంది. కానీ దానిని భరించే ఆర్ధిక స్థోమత అందరికీ ఉండదు. విద్య సమాజానికి తగినట్లుగా, సమాజ కేంద్రీతంగా ఉండాలని ఆర్ ఎస్ ఎస్ ఎప్పుడూ చెపుతూనే ఉంది. ఈ విషయంలో ఆర్ ఎస్ ఎస్, సంఘ్ ప్రేరణతో పనిచేస్తున్న ఇతర సంస్థలు ఏం చేయాలనుకుంటున్నాయి?
జ. ప్రస్తుతం మన ముందున్న సమస్య పూర్తిగా వేరు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలతోపాటు సమాజంపై ఆధారపడిన అనేక ప్రైవేటు సంస్థలు కూడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మనుగడ సాగించడం వాటికి కష్టంగా మారింది. ఆదాయం లేకపోవడంతో రాబోయే రోజుల్లో అవి మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
   మరోవైపు పేద, వెనుకబడిన వర్గాలకు విద్య అందించవలసి ఉంది. డిజిటల్ విద్యకు కొన్ని పరిమితులు ఉన్నాయి. దేశంలో గిరిజనులు నివసించే 8శాతం ప్రాంతాల్లో ఆధునిక సదుపాయాలు లేనేలేవు. అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారు కూడా డిజిటల్ విద్యను పొందలేరు.  అయితే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి.
   స్వయంసహాయ సంస్థలు విద్యార్ధులకు ఇంటి దగ్గరే శిక్షణనిచ్చే బాధ్యత తీసుకోవచ్చును. తక్కువ ఖర్చుతో కూడుకున్న నాణ్యమైన విద్యను అందించడమే మన లక్ష్యం. అందుకు తగిన మార్గాలు అన్వేషించాలి. మొదటగా ఈ విద్య సంవత్సరంలో ఒక్క విద్యార్ధి కూడా నష్టపోకుండా చూడటం ముఖ్యం. మన వనరులు, శక్తియుక్తులు సక్రమంగా వినియోగించుకుంటే ఈ సమస్య నుంచి బయటపడగలుగుతాము.

ప్ర. మేళాలు, యాత్రలు, ధార్మిక ఉత్సవాలు అనేవి ప్రాచీన భారతీయ సాంప్రదాయంలో భాగం. అయితే కరోన సంక్షోభం మూలంగా అలాంటి ఉత్సవాలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలా ఆలోచించాలి?
జ. ఈ విషయంలో మన సమాజపు తీరు చాలా గౌరవపూర్వకంగా ఉంది. ప్రాచీన కాలం నుంచి ఆచరిస్తున్న సంప్రదాయాలు, ఉత్సవాల విషయంలో ఉన్న ప్రగాఢమైన భావాత్మక సంబంధాన్ని కూడా కాస్త పక్కన పెట్టి పరిస్థితులకు తగినట్లుగా సర్దుబాటు చేసుకున్న తీరు ప్రశంసనీయమైనది. మన సమాజం మార్పును ఆహ్వానించడం, అవసరమైతే సర్దుబాటు చేసుకోవడంలో ఎంతటి పరిణతి సాధించిందో మరోసారి ఋజువయింది. నిరాడంబరంగా జరిగిన జగన్నాధ రధయాత్ర, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రానికి ఎక్కువమంది రాకపోవడం వంటివి ప్రజలు పరిస్థితిని బట్టి ఇంటి వద్దనే పూజాదికాలు పూర్తిచేసుకునే సర్దుబాటు ధోరణిని చూపుతున్నాయి. కొత్త సమస్యలు, సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన మార్పులు, సర్దుబాటు చేసుకోగలిగిన భారతీయ సమాజపు ప్రత్యేకత ఇక్కడ కనిపిస్తుంది. అలాగే భారతీయ విలువలు, ఆచారాల్లో సర్దుబాటుకు ఉన్న అవకాశం కూడా వెళ్లడయింది.

ప్ర. ఆర్ ఎస్ ఎస్ ఎప్పుడు సకారాత్మక ధోరణినే అవలంబించింది. అయితే కొన్ని శక్తులు మాత్రం సమస్యలను ఆసరాగా తీసుకుని సమాజాన్ని చీల్చేందుకు, విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. అలాంటి శక్తులతో సమాజం ఎలా వ్యవహరించాలి? ఈ విషయంలో ఆర్ ఎస్ ఎస్ ఏం చేస్తుంది?
జ. సమాజంలో కలతలు సృష్టించేందుకు కొన్ని శక్తులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాయని మాకు కూడా తెలుసు. అయితే ఆర్ ఎస్ ఎస్ కూడా నిరంతరం పెరగడంవల్ల ఈ శక్తులకు విరుగుడు వేయగలిగింది. మన సమాజపు అంతర్గత శక్తి, సాధుసంతుల తపస్సు, ఆర్ ఎస్ ఎస్ చేసిన కార్యం వల్ల ఇలాంటి శక్తులు నిర్వీర్యమైపోతాయనే నమ్మకం నాకు ఉంది.
   కొన్ని వర్గాలను రెచ్చగొట్టడానికి ఈ శక్తులు ప్రయత్నిస్తాయి. అయితే వెనుకబడిన, బలహీన వర్గాల ఆశలు, ఆకాంక్షలను తీర్చేందుకు మనం ప్రయత్నించాలి. విచ్ఛిన్నకర శక్తులు ఈ వర్గాలను ఆసరాగా చేసుకుని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడాలనుకుంటే అప్పుడు ఆర్ ఎస్ ఎస్ తప్పకుండా సమాజాన్ని జాగృతపరచి ఆ కుట్రను భగ్నం చేస్తుంది.

ప్ర. మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు భారతీయమైన పరిష్కారం ఉంటుందని సంఘ్ ఎప్పుడూ విశ్వసించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మరింత గట్టిగా ఋజువవుతున్నది. మీరేమంటారు?
జ. ప్రతి దేశానికి తనదైన ఆలోచనా ధోరణి, వ్యవస్థ ఉంటాయి. కాబట్టి మన సమస్యలకు విదేశీ పరిష్కారాలు పనికిరావు. మన సమస్యలను ఇతర దేశాల దృష్టితో చూస్తే లాభం లేదు. అందుకనే భారతీయ విధానాన్ని గుర్తించడానికి, అవలంబించడానికి ఆర్ ఎస్ ఎస్ ఎప్పుడూ ప్రయత్నిస్తుంది. మన సమాజపు విలువల మూలంగా ఎవరైనా ఒక స్థాయికి మించి ఇక్కడ ప్రజలను మోసపూరితమైన ప్రచారం ద్వారా నమ్మించడం కుదరదు. జాతీయశక్తులు సమాజంలో పెద్ద పాత్ర పోషించాల్సి ఉంది. అందుకు సంఘ పూర్తి మద్దతునిస్తుంది.

Source: Organiser
తెలుగు మూలము: విశ్వ సంవాద కేంద్రము (తెలంగాణ)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top