మనుషుల్లో మాణిక్యం - Dr. Boddupallu Manikyachari - డా. బొడ్డుపల్లి మాణిక్యాచారి - VHP Presidents

Telugu Bhaarath
0
మనుషుల్లో మాణిక్యం - Dr. Boddupallu Manikyachari - డా. బొడ్డుపల్లి మాణిక్యాచారి - VHP Presidents
Dr. Boddupallu Manikyachari 

  ఆయన దయ నిండిన కళ్లతో మాట్లాడుతుంటే, స్వరం నుంచి స్వాంతన ప్రవహించి, ఆప్యాయతతో మిళితమై బాధలో ఉన్న రోగులకు ధైర్యమనే తీర్థం దొరికేది. శివుడే తానై శివుని కొలిచినట్లు వృత్తిని దైవకార్యంగా భావించిన వైద్యమణి. ఆయన ఒక చేతిలో స్టైతస్కోప్ మోస్తూనే  మరోవైపు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేసిన సవ్యసాచి మృదుస్వభావి, ప్రేమ స్వరూపుడు, నిగర్వి, సౌమ్యమూర్తి శాంతస్వభావి. ఆయనే డాక్టర్ బొడ్డుపల్లి మాణిక్యాచారి.

బాల్యం :
 భాగ్యనగరం లోని చాంద్రయణగుట్ట (కేశవగిరి)లో కీ శే బొడ్డుపల్లి చెన్నమ్మ, బ్రహ్మయ్యాచార్య పుణ్య దంపతులకు మాణిక్యాచారి జన్మించారు. నాన్న బంగారు నగల శిల్పి అమ్మ గృహిణి. మొత్తం 12 నుంది సంతానంలో మాణిక్యాచారి ఒకరు. ఆయనకు ఒక అన్నయ్య, ఐదుగురు తమ్ముళ్లు, ఐదుగురు చెల్లెళ్లు ఉన్నారు. 'మా అమ్మానాన్నలు సనాతన సంప్రదాయ నిష్ఠ గల వారు కావడంతో, వారి నిత్య పూజా సాత్వికత, ఋజుత్వము, భగవద్భక్తి ప్రభావంతో నా సోదరులు, సోదరీమణులంతా ఆధ్యాత్మిక ధర్మ పరాయణులయ్యారు' అని మాణిక్యాచారి గారు గర్వంగా చెబుతుండే వారు. చిన్నతనంలో వారి ఇంటిలో నిత్యం ఆధ్యాత్మిక వాతావరణం ఉండేది. ప్రతి గురువారం, శుక్రవారం, శనివారం వారి చిన్నాన్న కేశవాచారితో కలిసి నాన్న సత్సంగం నిర్వహిస్తుండేవారు. ఎంతో మంది ప్రముఖులు ఈ సత్సంగానికి వస్తుండేవారు. అలా చిన్నతనంలోనే సత్సంగం ప్రభావం మాణిక్యాచారిపై తీవ్రంగా పడింది. 'నేను సత్సంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి స్ఫూర్తి మానాన్న' అని మాణిక్యాచారి అనేకసార్లు చెప్పారు.

విద్యాభ్యాసం :
   గ్రామ దేవాలయంలో రంగయ్య పంతులు గారి వద్ద మాణిక్యాచారి తెలుగులో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1945 - 46లో నిజాం నవాబు ప్రభుత్వ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతిలో చేరారు. ఐదో తరగతి నుంచి 9వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో మఫీదుల్ అనాం హైస్కూల్లో చదివి ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. 1955 సంవత్సరంలో హెచ్ఎస్సీలో మెట్రిక్యులేషన్ పదో తరగతి పూర్తి చేశారు. అనంతరం నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1959 నుంచి 1964 వరకు ఎంబీబీఎస్'ను పూర్తి చేశారు. 1966లో మెదక్ జిల్లా కౌడిపల్లిలో ప్రభుత్వ వైద్యుడిగా చేరారు.

శివదర్శనం :
  అది 1967 సంవత్సరం. నేను మెదక్ జిల్లా కౌడిపల్లి అనే ఒక కుగ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొత్తగా వైద్యుడిగా చేరాను. ఓ రోజు ఒక బీదవాడు మాసిన పంచెతో తలపై ఒక గంపను ఎత్తుకొని నా ముందు నిలుచున్నాడు. ఆ గంపను నా ముందు దించాడు. అందులో శిథిలమైన శరీరంతో, కొన ఊపిరితో ఉన్న అతడి భార్య ఉంది. అతడు ఆ గంపను నా ముందుంచి.. 'అయ్యా..ఈమె నా భార్య. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మీరే ఎలాగైనా కాపాడాలి' అని ప్రాధేయ పడ్డాడు. ఆ దృశ్యం చూసిన నాకు సాక్షాత్తూ పరమశివుడే గంగమ్మను తలపై ఎత్తుకొని వచ్చి నాముందు నిలుచున్నాడు అనే భావన కలిగింది. అది నాకు శివదర్శనంగా భావించాను. వారికి రెండు చేతులూ జోడించి నమస్కరించాను ఆమెను పరీక్షించి ఊపిరితిత్తులలో నీరు నిండినట్టుగా గుర్తించాను. రోడ్డు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేని ఆ గ్రామంలో ఎక్స్రే గురించి ఊహించడం కూడా లేని ఆ గ్రామంలో ఎక్స్రే గురించి ఊహించడం కూడా అసంభవమే. పెద్దాసుపత్రికి తీసుకువెళ్లమని అతడికి సలహా ఇచ్చాను. కానీ అతడు ఇంతవరకు ఆ గ్రామం దాటి ఎక్కడికీ... వెళ్లలేదు. బయటి ప్రపంచం ఏమాత్రం తెలియదు. 'మాకు మీరే దిక్కు నా భార్యను ఎలాగైనా కాపాడాలి సారూ' అని కన్నీటి పర్యంతమయ్యాడు. నా వంతు వైద్యం చేస్తానని దిగులుపడొద్దని అతడికి ధైర్యం చెప్పా. ఆ సమయంలో నా వద్ద ఉన్నది కేవలం స్టైతస్కోప్ మాత్రమే. అది క్షయ అని నిర్ధారించి చికిత్స ప్రారంభించాను. భగవంతుడి దయ వల్ల కొంతకాలానికి ఆమె వ్యాధి నుంచి బయటపడింది.. ఈ ఘటన నాలో ఎంతో ప్రేరణ కలిగించింది' అని మాణిక్యాచారి గారు తన ఆత్మకథలో రాసుకున్నారు. (ఆత్మకథ రచన పూర్తి కాలేదు) ఈ ఘటన ప్రేరణతో ఆ ఊరిలో తనకు మంచి పేరు వచ్చిందని తెలిపారు. ఆ గ్రామంలో ఉదయం వైద్యం చేస్తూ సాయంత్రం సత్సంగం నిర్వహించే వారు. ఇందులో ఆ గ్రామంలోని ప్రముఖులు, విద్యావంతులు పాల్గొనేవారు. ప్రభుత్వ ఉద్యోగంలో భాగంగా వెళ్లిన ప్రతి చోటా ఇలా సత్సంగం నిర్వహించడం ఆయనకు అలవాటుగా మారింది.

వైద్యం - సత్సంగం :
1970లో మాణిక్యాచారి వికారాబాద్ అనంతగిరి. కొండలపై ఉన్న క్షయవ్యాధి శానిటోరియంలో పని చేస్తున్నప్పుడు శ్రీ చిన్మయానంద గారి శిష్యుడు కేసరి హనుమాన్ గారి బృందంతో ఆయనకు పరిచయం ఏర్పడింది. 'వారి సహకారంతో పది రోజుల పాటు హాస్పిటల్లో విశేష సత్సంగం నిర్వహించాము. అది అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో పాటు మాకు కూడా గొప్ప అనుభూతిని పంచింది. అనంతరం అక్కడి గ్రామాల్లోనూ సత్సంగాలు పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. అనంతరం చిన్మయమిషన్ తో జీవితాంతం అనుబంధం కొనసాగింది అంటారు డా.మాణిక్యాచారి.
   1977 - 79 సంవత్సరలో డా.మాణిక్యాచారి చెవి, గొంతు, ముక్కు స్పెషలిస్టు కోర్సు (ఎమ్ఎస్, ఈన్టీ) ను హైదరాబాద్ లోని కోరి ఈఎన్టీ ఆసుపత్రిలో పూర్తి చేశారు. తర్వాత ఈఎన్టీ స్పెషలిస్టుగా గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రి, వరంగల్ జిల్లాలోని మహాత్మాగాంధీ ఆస్పత్రిలో  1982వరకు పని చేశారు. తర్వాత నైజీరియాలోని (పశ్చిమ ఆఫ్రికా) ప్రభుత్వ ఆస్పత్రిలో కేంద్ర ప్రభుత్వం ద్వారా వెళ్లి పని చేశారు. దాదాపు అక్కడ రెండేళ్ల పాటు (1982-84) పని చేశారు. అక్కడ కూడా సత్సంగం నిర్వహించే పనిని డా.మాణిక్యాచారి విస్మరించలేదు. అక్కడి జూస్ అనే పట్టణంలో విద్యావంతులతో కలిసి ప్రతి ఆదివారం రెండు గంటల పాటు సత్సంగం నిర్వహించేవారు. 25 మంది హిందువులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు సత్సంగంలో పాల్గొనేవారు. ఇందులో భగవద్గీత, భజన ధార్మిక ప్రసంగాలు ఆంగ్ల మాధ్యమంలో జరిగేవి. భజన ధ్యానం సంకీర్తన సామూహికంగా జరిగేవి. అక్కడ 'ఇండియన్ జర్నల్ ప్లాటో స్టేట్' పేరుతో ఒక త్రైమాసిక పత్రిక వెలువడేది. దీనిని భారతీయులే నిర్వహించేవారు. దీనిలో హిందూ ధర్మంపై డా.మాణిక్యాచారి రాసిన వ్యాసాలు ప్రచురణ అయ్యేవి.
   1985 - 89 మధ్యకాలంలో హైదరాబాద్ లోని ఈఎన్టీ ఆస్పత్రిలో సైతం ఆయన పనిచేశారు. 1989లో సౌదీ అరేబియా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే అవకాశం లభించింది. సకాకా అనే పట్టణంలో ఏడు సంవత్సరాల పాటు ఈఎన్టీ వైద్యుడిగా పని చేశారు. ఆ పట్టణంలో భారతదేశం నుంచి వచ్చిన వైద్యులు, ఇంజినీర్లు ఇతరులను పరిచయం చేసుకొని వారానికి ఒకరోజు సత్సంగం నిర్వహించేవారు. ఆ దేశంలో వేరే మతం సత్సంగం నిర్వహించడం తీవ్రనేరం. అయినా రహస్యంగా అక్కడ ఉన్న హిందువులతో సమావేశమై సత్సంగం నిర్వహించే వారు.

విశ్వహిందూ పరిషత్'లోకి  :
'ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పని చేస్తున్నప్పుడు ప్రతి ఆదివారం మా ఇంటిలో వైదిక యజ్ఞం, సత్సంగం, భగవద్గీత ప్రవచనాలు నిర్వహించేవాళ్లం. ఆ సమయంలోనే కీ. శే కళ్లూరి భోగేశ్వర సోమయాజులు (విశ్వ హిందూ పరిషత్, ప్రాంత సంఘటనా మంత్రి) నన్ను కలిసి ఖమ్మం జిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడిగా నియమించారు. అప్పటి నుంచి ఐదేళ్ల పాటు కొత్తగూడెం పట్టణంలో ప్రతి ఆదివారం రెండు గంటలపాటు విశేష సత్సంగం, వైదిక యజ్ఞం భగవద్గీత ప్రవచనాలు నిరాఘాటంగా కొనసాగించాము. అని డా.మాణిక్యాచారి ఒక సందర్భంలో చెప్పారు.

వెయ్యి మందిని స్వధర్మంలోకి..
   1970నుంచి , 76 వరకు డా.మాణిక్యాచారి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం వ్యాప్తంగా పెద్దఎత్తున ధర్మప్రచారం నిర్వహించారు. 1974 నుంచి 76 మధ్యలో సుమారు వెయ్యి మందిని మతం మారిన హిందువులను స్వధర్మంలోకి తీసుకొచ్చారు.

'మానస పుత్రిక 'కారుణ్య సింధు' :
  1973-74 మధ్య కాలంలో కొత్తగూడెంలో పని చేస్తున్నప్పుడు ఒక కుంటివాడు తన కుమారుడితో సహా భిక్షమెత్తుకుంటూ డా.మాణిక్యాచారి వద్దకు తరచుగా వచ్చేవాడు. ఆయన ఆ బాలుడిని చూసి చదివించాలని భిక్షగాడైన తండ్రితో చెప్పి ఒప్పించి కర్నూలులోని అనాథ శరణాలయం (జి.పుల్లారెడ్డి గారి అనాథ శరణాలయం)లో చేర్పించారు. అదే విధంగా మరొక ఏడేళ్ల వయసున్న అనాథనూ అదే ఆశ్రమంలో చేర్పించారు. వారిద్దరూ డిగ్రీలో పట్టభద్రులయ్యారు. ఇందులో ఒక అబ్బాయి కేంద్ర మంత్రికి పీఏగా పని చేయడం మాణిక్యాచారిలో స్ఫూర్తిని నింపింది. ఈ సంఘటనతో ప్రభావితుడైన ఆయన హైదరాబాద్లో 1999లో కారుణ్య సింధు పేరుతో ఒక బాలుర అనాథ ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన విశ్వహిందూ పరిషత్ పశ్చిమాంధ్ర కార్యాధ్యక్షుడిగా యూరు కారుణ సింధు బాలుర అనాథ శరణాలయానికి ఆయనే అధ్యక్షుడిగా పని చేశారు. 2005 నాటికి కారుణ్యసింధుకు దాతల సాయంతో శాశ్వత ప్రాతిపదికన భవనం నిర్మించారు. ఆశ్రమ ప్రారంభోత్సవం శ్రీ జి.పుల్లారెడ్డి, మాననీయ అశోక్ సింఘాల్, శ్రీశ్రీశ్రీ సత్యపదానంద ప్రభుజీ వంటి మహనీయులతో జరిగింది. ఆశ్రమ అధ్యక్షుడిగా డా.మాణిక్యాచారి 2017 వరకు  బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికి సుమారు 500 మందికి పైగా బాలురు ఆశ్రమంలో సేవలు పొందారు. అందులో ఒక అబ్బాయి ఎమ్ సెట్లో 76వ ర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎమ్బీబీఎస్ ను పూర్తి చేశాడు. ఎంతోమంది ఇంజినీరింగ్, ఇతర డిగ్రీలలో పట్టభద్రులయ్యారు.

ధన్వంతరి హెల్త్ లైన్ తో విశేష సేవలు :
   అసలే నిరుపేదలు. వారు వ్యాధుల బారిన పడితే ఇక వారు పడే కష్టం ఆ భగవంతునికే తెలియాలి. ఆ కష్టం డా.మాణిక్యాచారికి తెలుసు. అందుకే ఆయన పేద రోగులకు వైద్యం అందించాలనే సత్సంకల్పంతో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధన్వంతరి హెల్త్ లైన్ ను ప్రారంభించడంలో క్రియాశీల పాత్ర పోషించారు. హైదరాబాద్ నగరంలోని దాదాపు 150 మంది వైద్యులను ఈ ధన్వంతరి హెల్త్లైన్ లో చేర్పించారు. వారితో స్వయంగా మాట్లాడుతూ ఎంతో మందిని వారివద్దకు పంపి ఉచితంగా చికిత్సను అందించే ప్రయత్నం చేశారు. రోగులు పూర్తిగా కోలుకునేదాకా వారితో మాణిక్యాచారి టచ్ లో ఉండేవారు.

విశ్వహిందూ పరిషత్కు పూర్తి సమయం :
   1996నుంచి 2001 వరకు విశ్వహిందూ పరిషత్ భాగ్యనగర అధ్యక్షుడిగా డా.మాణిక్యాచారి ఆరేళ్లపాటు పని చేశారు. అనంతరం 2001 నుంచి 2007 వరకు విశ్వహిందూ పరిషత్ పశ్చిమాంధ్ర కార్యాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం గౌరవాధ్యక్షుడిగా సేవలందించారు. 2019 నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఇంటికే పరిమితమయ్యారు. 2021 మార్చి 6 చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

__E. రమేశ్ ..✍

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top