శంకర విజయం - Shakara Vijayam

Telugu Bhaarath
0
ఆది శంకరాచార్యులు !
కప్పుడు ప్రపంచానికి దారి చూపిన భారతదేశంలో సైద్ధాంతిక గందరగోళం ఏర్పడిన కాలం అది. తత్వం, మతం విషయంలో ఎవరికి తోచినట్లు వాళ్ళు సిద్ధాంతాలు లేవదీస్తున్న పరిస్థితి. చార్వాక, లోకయాతిక, కపాలిక, శాక్తేయ, సాంఖ్యక, బౌద్ధ, మాధ్యమిక ఇలా అనేక సంప్రదాయాలు పుట్టుకువచ్చాయి. ఇలా కొత్తగా పుట్టుకువచ్చిన సంప్రదాయాల సంఖ్య 72కు పైగా ఉంటుంది. వీటన్నింటి మధ్య విభేదాలు, ఘర్షణలతో దేశం అల్లకల్లోలమయింది. సర్వత్రా మూఢనమ్మకాలు, మౌఢ్యం రాజ్యమేలుతున్నాయి. ఋషులు, మునులు, యోగులతో శాంతిమయంగా, ఆధ్యాత్మిక తేజస్సుతో వెలిగిన దేశం తమస్సులోకి జారిపోయింది. అలాంటి పరిస్థితిలో ఉన్న దేశధర్మాల్ని ఉద్ధరించడానికి అవతరించారు ఆది శంకరులు.

ఈ దేశంలో సనాతన వైదిక ధర్మం ఇప్పటికీ నిలిచి ఉందంటే అది ఆదిశంకరుల పుణ్యమే. ఆయన కాలంలో హిందూమతం, ధర్మం ఎన్నో దాడులకు గురైంది. ఈ ధర్మాన్ని నాశనం చేయాలని ప్రయత్నించిన శక్తులు కూడా ఇప్పటి కంటే బలంగా ఉండేవి. అయినా జీవించిన అతి తక్కువ కాలంలోనే ఆదిశంకరులు ఈ దాడుల్ని తప్పికొట్టడమేకాక ధర్మరక్షణకు ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. అపారమైన జ్ఞానం, ఆధ్యాత్మికతలనే ఆయుధంగా ఆయన ఈ విజయాన్ని సాధించారు. కలియుగంలో ధర్మానికి మేధోపరమైన హాని కలుగుతుంది. అధార్మిక అలోచనలు, ధోరణి జనజీవనంలో స్థిరపడింది. అందుకనే ఆదిశంకరులు జ్ఞాన, ఆధ్యాత్మికతలే ఆయుధంగా ధర్మ రక్షణకు పూనుకున్నారు.

ఆదిశంకరుడి నాటికి దేశంలో అధార్మిక శక్తులు పెచ్చుమీరిపోయాయి. ఆనాటి పరిస్థితుల్ని పరిశీలిస్తే కొన్ని ప్రధానమైన సంఘటనలు మనకు కనిపిస్తాయి –

1. గ్రీస్‌, ‌టర్కీ, ఇతర మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్‌ ‌దండయాత్రలు ఎదుర్కొంటోంది.
2. సనాతన ధర్మ పద్ధతుల్లో అనేక లోపాలు తలెత్తాయి. దీనికి గల అనేక కారణాల్లో కొన్ని ముఖ్యమైనవి –
  •  వేదార్థాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకోకుండానే కొందరు తమకు తోచిన విధంగా మత సంప్రదాయాలు, పద్ధతుల్ని సృష్టించి ప్రచారం చేశారు.
  •  సంక్లిష్టమైన వేదార్థాన్ని గ్రహించడం మేధావులకే సాధ్యంకాని పరిస్థితి ఏర్పడింది.
  •  సంస్కృత భాష తెలియని ప్రజానీకం ఎక్కువకావడంవల్ల వేదాధ్యయనం, వేదార్థ వివరణ కుంటుపడ్డాయి.
  • తాంత్రిక సంప్రదాయాల్లో  నరబలి వంటి వామాచారాలు వ్యాపించాయి.
3. సాధారణ ప్రజానీకానికి దగ్గరగా ఉన్నట్లు కనిపించిన జైన, బౌద్ధమతాల వ్యాప్తితో సనాతన ధర్మంపట్ల శ్రద్ధ, గౌరవం తగ్గాయి. వైదిక ధర్మ పద్ధతుల్లో వచ్చిన లోపాలను సరిచేసి, దానిని పునస్థాపించేవారు కరవయ్యారు.
4. సనాతన ధర్మానికి చెందిన సంప్రదాయాలను కాదని అశోకుడు, హర్షుడు మొదలైన గొప్ప రాజులు బౌద్ధాన్ని స్వీకరించారు.
ఇలాంటి పరిస్థితుల్లో సనాతన వైదిక ధర్మాన్ని, సంప్రదాయాల్ని సంస్కరించి, పునరుద్ధరించి, తరువాత తరాలకు అందించగలిగే వారి అవసరం ఏర్పడింది. అంతటి కఠినమైన, అద్భుతమైన కార్యాన్ని నిర్వహించడానికి భగవంతుడే మరోసారి అవతారం ఎత్తాలని సనాతన ధర్మాభిమానులు ఆశగా ఎదురుచూశారు. అప్పుడే ఆదిశంకరుడు అవతరించారు.

శంకరులు 
శంకర విజయ యాత్ర
   శంకరాచార్యులు సాగించిన తత్వశాస్త్ర సంవాదాలు, సాధించిన విజయాలు చాలా అద్భుతమైనవి, ప్రత్యేకమైనవి. దేశం నలుమూలలకు పర్యటించి వివిధ సంప్రదాయాలకు చెందిన పండితులతో వాదనలు జరిపి వారిని సనాతన ధర్మ మార్గంలోకి తెచ్చారు. వేదాంత సూత్రాలకు భాష్యం(వ్యాఖ్య) రాసిన భట్టభాస్కరుని మొదలు వామాచారులు, బౌద్ధుల వరకు అందరినీ తన వాదనా పటిమతో ఓడించి, ఒప్పించి ధర్మవియాన్ని సాధించారు. భట్టభాస్కరుని తరువాత దండి, మయూరులను కలిశారు. వారికి అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. ఖండన ఖండ కాద్య గ్రంధ రచయిత హర్షుడు, అభినవగుప్తుడు, మురారి మిశ్రుడు, ఉదయనాచార్యుడు, ధర్మగుప్తుడు, కుమారిలభట్టు, ప్రభాకరుడు మొదలైన ఎందరో పండితులతో శాస్త్ర చర్చ చేశారు.

రాజా మహిష్మతి ఆస్థాన పండితుడైన మండన మిశ్రుడు గొప్ప వేదవిదుడు. కర్మమీమాంసను అనుసరించే మండన మిశ్రుడు మొదట సన్యాసి అయిన శంకరుడితో వాదనకు అంగీకరించలేదు. ఆ తరువాత పండితులంతా చెప్పిన తరువాత శాస్త్ర చర్చకు ఒప్పుకున్నాడు. రెండు వైపులా వాదనలను విని తీర్పు చెప్పడానికి మండన మిశ్రుని భార్య ఉభయభారతి అంగీకరించింది. అలా 17రోజులపాటు నిరంతరాయంగా శాస్త్ర చర్చ సాగింది. మండన మిశ్రుడు చివరికి తన వాదన వీగిపోయినట్లు అంగీకరించడంతో శంకరులకు విజయం సిద్ధించింది.

మండనమిశ్రుడు ఓటమిని అంగీకరించిన తరువాత ఆయన భార్య ఉభయభారతి స్వయంగా వాదనకు సిద్ధపడింది. మండన మిశ్రునిలో సగభాగమైన తనను కూడా వాదనలో నెగ్గినప్పుడే శంకరుని విజయం పూర్తయినట్లని స్పష్టం చేసింది. దానితో ఆయన శాస్త్ర చర్చకు అంగీకరించకతప్పలేదు. చర్చ 17 రోజులపాటు సాగింది. చివరికి ఉభయభారతి సంధించిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పిన ఆదిశంకరుడు విజయం సాధించారు.  శంకరాచార్యుడిని గురువుగా అంగీకరించిన మండనమిశ్రుడు తన ఆస్తినంతటిని ఆయనకు స్వాధీనం చేశాడు. దానిని పేదలకు పంచాలని ఆదేశించారు శంకరాచార్యులు. సన్యాసదీక్ష తీసుకుని మండనమిశ్రుడు సురేశ్వరాచార్యుడుగా మారారు. శృంగేరీలో మఠాన్ని స్థాపించి సురేశ్వరుడిని మఠాధిపతిని చేశారు.

దేశంలోని ప్రముఖ వేద పండితులు, శాస్త్ర నిపుణులతో కూడిన సభల్లో వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ద్వారా శంకరాచార్యులు వారందరికీ గురువయ్యారు. 72 భిన్న సంప్రదాయాలు, మతాలపై విజయం సాధించి సనాతన వైదిక ధర్మపు ఆధిక్యతను నిరూపించారు.

శంకరాచార్యులు సాధించిన విజయం ఎంత గొప్పదంటే ఆ తరువాత ఏ భారతీయ మతమూ, సంప్రదాయం వైదిక ధర్మాన్ని ప్రశ్నించడంగానీ, ధిక్కరించడంగానీ జరగలేదు. ఆ విధంగా ఆయన వైదిక ధర్మానికి చెందిన సంప్రదాయాలు, మతాలను సంస్కరించి వాటిని తిరిగి మాతృవ్యవస్థతో జోడించారు. శంకరాచార్యులకు ముందు అనేకమంది ప్రముఖ గురువులు, తత్వవేత్తలు ఉన్నా వారెవరూ సాధించని సమన్వయాన్ని, సాధికారతను ఆయన సాధించారు.

దేశమంతా పర్యటించిన ఆదిశంకరులు అద్వైత సిద్ధాంతాన్ని సర్వత్రా ప్రచారం చేశారు. పూరీలో గోవర్ధన పీఠాన్ని స్థాపించారు. కాంచీపురంలో శాక్తేయులతో శాస్త్ర చర్చ జరిపి వారికి ఉన్న అపోహలు తొలగించారు. దేవాలయాలను ప్రక్షాళన చేశారు. చోళ, పాండ్య రాజుల గౌరవాన్ని పొందారు. ఉజ్జయిని వెళ్ళి అక్కడ భైరవుల వామాచారాలను అడ్డుకున్నారు. నరబలి పద్ధతిని పూర్తిగా వదిలిపెట్టేట్లు చేశారు. ద్వారకలో ఒక మఠాన్ని స్థాపించారు.  ఆ తరువాత గంగాతీరం వెంబడి ప్రయాణిస్తూ అనేక ప్రాంతాల్లో శాస్త్ర చర్చల ద్వారా పండితులు, ప్రజల్లోని అపోహలు, మూఢనమ్మకాల్ని తొలగించారు.

దశనామి సన్యాసులు
   సనాతన ధర్మ పరిరక్షణ ధ్యేయంగా పనిచేసే వ్యవస్థను ఆదిశంకరులు ఏర్పాటు చేశారు. దేశంలో నాలుగు దిశల్లో నాలుగు పీఠాలను స్థాపించడంతోపాటు దశనామి సన్యాసి వ్యవస్థను ఆయన ప్రారంభించారు. నాలుగు పీఠాలకు చెందిన సన్యాసులు తమ పేర్ల చివర ప్రత్యేక నామాలను పెట్టుకుంటారు. శృంగేరీ మఠానికి చెందినవారు సరస్వతి, భారతి, పూరి వంటి పేర్లను ఉంచుకుంటారు. అలాగే ద్వారకా పీఠంలో తీర్థ, ఆశ్రమ, జోషి పీఠంలో గిరి, పర్వత, సాగర, గోవర్థన పీఠానికి చెందిన వారు వన,అరణ్య నామాలను తమ పేర్లకు జోడించుకుంటారు.  ఈ నాలుగు పీఠాలకు చెందిన సన్యాసులు సనాతన ధర్మ ప్రచారంతోపాటు కాక్రమంలో ధర్మాచరణలో వచ్చే అనేక లోపాలను సవరించి, సంస్కరించాలని ఆదిశంకరుల ఉద్దేశ్యం. ఈ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది.

శంకరుల తత్వసిద్ధాంతం
   ఆదిశంకరులు కేవల అద్వైత తత్వాన్ని ప్రవచించారు. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఒక మార్గాన్ని, పద్ధతిని చూపారు. ఆయన సిద్ధాంతాన్ని క్లుప్తంగా కొన్ని మా•ల్లో చెప్పాలంటే – ‘ బ్రహ్మ సత్యం జగత్‌ ‌మిధ్య, జీవో బ్రహ్మైవ న అపర’ అంటే ఈ ప్రపంచం అనిత్యం, అశాశ్వతం. బ్రహ్మమే నిత్యం, శాశ్వతం. బ్రహ్మము యొక్క స్వరూపమే జీవుడు.

శంకరులు వివర్త వాదంలో తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. చీకటిలో తాడును చూసి పాము అని భ్రమపడతాం. కానీ నిజానికి అక్కడ ఉన్నది తాడు. అలాగే ఈ ప్రపంచం, శరీరమే సర్వమని భ్రమపడతాం. కానీ నిజానికి వీటి వెనుక ఉన్న అసలు తత్వం బ్రహ్మము, పరాతత్వమేనని శంకరులు ప్రతిపాదించారు. అజ్ఞానమనే చీకటిలో తాడు(బ్రహ్మము) పాముగా(ప్రపంచం, శరీరం) కనిపిస్తుంది. బ్రహ్మజ్ఞానం కలిగితే ప్రపంచం, శరీరంపై భ్రాంతి, వ్యామోహం తొలగిపోతాయి. అంటే ప్రపంచానికి, బ్రహ్మతత్వానికి మధ్య ఉన్న అసలైన సంబంధం అవగతమవుతాయి. ఆ జ్ఞానం కలిగిన తరువాత కూడా ఈ ప్రపంచం ఉంటుంది. కానీ ప్రపంచాన్ని మనం చూసే దృష్టి, ఇక్కడ మన వ్యవహార శైలి మారిపోతాయి. ప్రపంచం సమస్యల పుట్టగా కాకుండా ముక్తి సాధనంగా కనిపిస్తుంది. కష్టాలు, సమస్యలు ఇబ్బంది పెట్టవు. సర్వప్రాణికోటిపట్ల ఆదరం, ప్రేమ కలుగుతాయి.

ఆదిశంకరులు అత్యున్నత స్థాయికి చెందిన యదార్థ తత్వవాది. తన అద్భుతమైన తర్కనైపుణ్యంతో, సర్వతోముఖమైన వ్యక్తిత్వంతో, అపారమైన ఆధ్యాత్మిక శక్తితో జ్ఞానబోధ, ధర్మసంరక్షణ సాగించారు. ఆయన మార్గం నేటికీ అనుసరణీయమే.

__విశ్వ సంవాద కేంద్రము

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top