ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా శంకరాచార్యుల వారి ‘వివేక చూడామణి’లో కొన్ని ఆణిముత్యాలు - Shankaracharya, Viveka Chudamani

0
ఆది శంకరాచార్య జయంతి శంకరాచార్యుల వారి ‘వివేక చూడామణి’లో కొన్ని ఆణిముత్యాలు - Shankaracharya, Viveka Chudamani
ఆది శంకరాచార్య జయంతి శంకరాచార్యుల వారి ‘వివేక చూడామణి’లో కొన్ని ఆణిముత్యాలు - Shankaracharya, Viveka Chudamani 

అందరికీ ఆది శంకరాచార్య జయంతి సందర్భంగా ఆయన కృప కలగాలి అని మనఃస్ఫూర్తిగా కోరుకుంటూ......

శంకరాచార్యుల వారి ‘వివేక చూడామణి’ నిజంగా సాధకులకు ఒక మణి. అనుష్టానానికి సంబంధిచిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దీనిలో సంభాషణల రూపంలో లభిస్తాయి.

శంకరాచార్యులు బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి చిత్తశుద్ధి ఉండాలి అని చెప్తూ, దీనికి ఎవరు అర్హులు అన్నది ఇలా తేల్చేసారు.
 • 1. “వివేకి, విరక్తుడు, శమం మొదలైన గుణాలు కలవాడు, మోక్షాన్ని కోరుకునేవాడు మాత్రమే బ్రహ్మజిజ్ఞాసకు అర్హుడు”.
 • 2. సనాతనధర్మంలో పదే పదే చెప్పే విషయం, గురుశుశ్రూష. కృష్ణపరమాత్ముడు కూడా ఆయన గురువు దగ్గర కొంత కాలంఉండి విద్యాభ్యాసం చేశారు. శంకరాచార్యులు కూడా “ఆత్మ గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినవాడు మొదట బ్రహ్మవిద్యలో నిపుణుడై, దయ కలిగిన ఒక గురువును సమీపించాలి” అని తెలిపారు.
3, ఒక వ్యక్తి బ్రహ్మాన్ని అర్థం చేసుకోవడానికి నాలుగు సాధనాలు చేయాలన్నారు:
 • 3.1 నిత్యం, అనిత్యం - నిత్యం, అనిత్యం మధ్యన భేదం సులభంగా తోచుతుంది. కానీ, దాన్ని అనుసరించడం చాలా కష్టం. ఉదాహరణకు మనం ఒక కొత్త వస్తువు కొనగానే పగిలిపోతే మనకు చాలా బాధ కలుగుతుంది.మనకీ తెలుసును, ఆ వస్తువు ఎప్పటికీ ఉండిపోయేది కాదు, ఎప్పుడో ఒకప్పుడు పోయేదేనని. కాకపోతే, తెలియడం వేఱు, దాన్ని జీర్ణించుకోవడం వేఱు. శంకరాచార్యులు చెప్తున్నది అది బుద్ధిలో పూర్తిగా జీర్ణించుకుపోవడం గురించి.
 • 3.2. ఇహంలో, పరంలో భోగాలపై విరక్తి
 • ➣ ఈ లోకమే కాదు, ఉన్నతలోకాలు కూడా శాశ్వతమైనవి కావు. మోక్షం మాత్రమే శాశ్వతమైన స్థితి. అందుకే పాపపుణ్యాలు రెండూ ముముక్షువుకు ప్రతిబంధకాలని శాస్త్రాలు చెప్తున్నది. అన్నమయ్య అన్నట్టు "భారపు పగ్గాలు, పాపపుణ్యములు". ఒక రూపాయి దానం చేసిన వెంటనే మనసులో ఒక తృప్తి పుడుతుంది, "ఈ రోజు ఒక మంచి పని చేశాను", అని. అంటే ఆ దానానికి ప్రతిఫలం అప్పుడే అనుభవిస్తున్నాము. "నా డబ్బు నేను ఇంకొకడికి దానం చేసాను" అనుకుంటూ చేసిన దానం పుణ్యం అవుతుంది, మఱో జన్మలో మనకు వెనక్కొస్తుంది. ఇది మంచి విషయంలా అనిపిస్తున్నా, ఆ పుణ్యం వెనక్కి రావాలి అంటే మనకు మఱో జన్మ ఉండాలి కదా? అందుకే దానం చేసేటప్పుడు, "ఇది నా ధర్మం. ఈ డబ్బు నాది కాదు.", అనే భావం ఉండాలని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినది.
 • "ఇది ఇవ్వడం నా ధర్మం" అని అనుకుని మనకు ఏ ఉపకారమూ చెయ్యని వాడికి, సరైన సమయంలో, సందర్భంలో ఇచ్చే దానమే సాత్త్వికమైన దానం.
 • ➣ దానం చేసాను అనే సంతృప్తి కలగడం ఇహంలో భోగం, ఈ డబ్బు నాది అని మనసులో ఉండటం పుణ్యలోకాలలో భోగాన్ని ఆశించడం - ఈ రెండూ మనను దానం చేసినప్పుడల్లా వేధిస్తూ ఉంటాయి. ఇప్పుడు తెలుస్తోందిగా ఆ రెండవ సాధనం పొందటం ఎంత కష్టమో? ఇది సాధన చేస్తూ ఉంటే కానీ రాదు.
 • 3.3 వైరాగ్యo - దేహం మొదలుకొని బ్రహ్మం వరకు అనిత్యమైన వస్తువులందు "నాకు వద్దు" అనే భావం కలగడం వైరాగ్యం.
 •  మనిషికి అన్నిటికంటే సులువుగా లభించే ఆనందాలు ఇంద్రియాలనుండి వస్తున్నాయి. చూడటం, వినడం, మాట్లాడటం, తినడం, వాసన, స్పర్శ -- ఇవే కదా వస్తువుల ద్వారా వస్తున్న ఆనందం. ఇవి కేవలం శరీరాన్ని సంతృప్తిపరచవచ్చును (తినడం), మనసుని సంతృప్తి కలిగించవచ్చును (ఇష్టమైనవారిని చూడటం), బుద్ధికి సంతృప్తిని కలిగించవచ్చును (కష్టమైన సమస్యను పరిష్కరించడంలో ఉన్న సంతృప్తి). ఇవేవీ శాశ్వతం కావు. అందుకే ఇది వద్దు, ఇది వద్దు అనే వదులుకుంటూ కేవలం శాశ్వతమైన (బ్రహ్మపదం) వాటిని కోరుకోవడమే వైరాగ్యం.
4. శమాది లక్షణాలు (శమం, దమం, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం)
 • 4.1. శమం - మనసుకు (లౌకిక) విషయాలను చిన్నచూపుతో (ఇవి పనికిరావు అనే భావంతో) చూపిస్తూ ఎప్పుడూ లక్ష్యం (బ్రహ్మపదం) మీదనే మనసును ఉంచడాన్ని శమ అంటారు. (మనసుని అధీనంలో ఉంచుకోవడం).
 • 4.2. దమం - రెండు రకాల ఇంద్రియాలు ఉంటాయి. కొన్ని విషయాలను తెలిపేవి (చెవులు, కళ్ళు మొ.), కొన్ని పనులు చేసేవి (చేతులు, కాళ్ళు మొ.). ఈ రెండింటినీ కూడా విషయాలనుండి దూరంగా తీసుకొచ్చి వాటి కేంద్రబిందువులలో (అంటే చలించకుండా ఉండే స్థితికి) ఉంచడం దమం అంటారు.
 • 4.3. ఉపరతి - బయటి విషయాలకు బుద్ధిని ప్రతిస్పందించకుండా ఉంచగలగడం ఉపరతి అంటారు.
 • 4.4. తితీక్ష - అన్ని దుఃఖాలనూ అస్సలు బాధాపడకుండా, వాటి గురించి ఆలోచించకుండా సహనంతో ఓర్చుకోవడడం.
 • 4.5. శ్రద్ధ - ఆత్మస్వరూపం తెలిపే శాస్త్రాలపై, గురువు మాటలపై సంపూర్ణమైన విశ్వాసంతో అవగాహన చేసుకోవడాన్ని శ్రద్ధ అని పెద్దలంటారు.
 • 4.6. సమాధానం - ఎల్లప్పుడూ బుద్ధిని శుద్ధబ్రహ్మం పై ఉంచడాన్ని సమాధానం అంటారు. అంతే కానీ మనసుని లాలించుకోవడం (ఆలోచనలు లేకుండా ఉంచడం) సమాధానం కాదు.
5. ముముక్షుత్వం - అహంకారం మొదలుకొని ఈ దేహం వరకు అన్నిటిపైనా అజ్ఞానం వలన మనం కల్పించుకున్న బంధాలను, వీటి స్వరూపాలను అర్థం చేసుకుని, తెంచుకోవాలనే కోరికే ముముక్షుత అంటారు.

ముముక్షుత్వం అంటే "మోక్షం కావాలి" అనే బలమైన కోరిక. ఇది అన్నిటికీ మూలమైనది. మోక్షం కావాలనుకోబట్టే మనకు వివేకం, వైరాగ్యం, శమాది గుణాలు సాధనాలు అవుతున్నాయి.

"బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి మోక్షానికీ తేడా ఉందా?" అని అడగవచ్చును గాక. బ్రహ్మాన్ని తెలుసుకోవడం ఎంత కష్టమైన పని అంటే మోక్షం గురించి బలమైన కోరిక లేకపోతే మధ్యలో ఆగిపోతారు. ఒక సారి బ్రహ్మైక భావాన్ని అనుభవిస్తే ఇంక ఈ లోకం పైన మక్కువ ఉండదు. అందుచేత బ్రహ్మజ్ఞానం, మోక్షం పక్కపక్కనే ఉంటాయి అని గ్రహించాలి. స్వస్తి. (సేకరణ)

జై గురుదేవా
సంకలనం: రేణుక పరశురామ్

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top