రుణ ముక్తికై మూలాలులోకి వెళ్లాలి !

0
రుణ ముక్తికై మూలాలులోకి వెళ్లాలి - Go to the roots of debt relief

రుణ ముక్తికై రూట్స్‌లోకి వెళ్లాలి!

– సురేష్‌జీ సోని – ఆర్‌ఎస్‌ఎస్‌-అఖిల భారత కార్యకారిణి సదస్యులు
సలు ఈ పంచ యజ్ఞాలేమిటి అని ప్రశ్నించినప్పుడు, బ్రహ్మ యజ్ఞం, దేవ యజ్ఞం, పితృ యజ్ఞం, నర యజ్ఞం, భూత యజ్ఞం అనే జవాబు వస్తుంది. ప్రతి గృహస్థుడు తప్పనిసరిగా ఈ పంచ యజ్ఞాలు చేయవలసిందే. ఇవి మహా యజ్ఞాలు గదా! వీటికి మరో విశిష్టత ఉంది, ఇంతకూ మునుపు నేను పేర్కొన్న రాజసూయ, అశ్వమేధ, వాజసనేయ, పుత్రకామేష్ఠి లాంటి యజ్ఞాలున్నాయి కదా… దశరథ మహారాజు పుత్ర కామేష్ఠి యాగం చేశాడు. అపార సంపద ప్రాప్తి కోసం, ఈశ్వర సాక్షాత్కారం కోసం, సత్‌సంబంధాలు కలిగి ఉండటం కోసం చేసేందుకు ఇలా రకరకాలయిన యజ్ఞాలున్నాయి. కానీ యజ్ఞాలన్నిటిలోను ఏమున్నాయి? వీటిలో కొన్ని కోరికలు లేకుండా ఉంటే మరికొన్ని ఏవేని కోరికలు తీరేందుకు పనికొచ్చే యజ్ఞాలు. అయితే పంచ మహాయజ్ఞాలు తన స్వార్థంకోసం కాకుండా లోకహితం కోసం చేస్తారు. అందుకే ఇక్కడ రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ఒకటి అధికారం అయితే, మరొకటి కర్తవ్యం. అధికారమనే పదం స్వార్థానికి కేంద్ర బిందువు. నా అధికారం, నా హక్కులు అనే ధోరణి ఇందులో కానవస్తుంది. కర్తవ్యమనే పదం నిస్వార్థాన్ని సూచిస్తుంది. అన్యుల సేవ తమ కర్తవ్యమని, అన్యుల కోసం తామేమి చేయగలమని భావించటం నిస్వార్ధతే అవుతుంది. తండ్రి కర్తవ్యం, పుత్రుడి కర్తవ్యం, సమాజం పట్ల కర్తవ్యం ఇవన్నీ మనల్ని నిస్వార్థం వైపుకి తీసుకెళతాయి. అందుకే యజ్ఞ కర్మను కర్తవ్య కర్మగా చెబుతారు. పంచ మహాయజ్ఞాల దృష్టితోనే ఈ విషయాన్ని చెప్పుకొస్తారు. మన పెద్దలు దీనికి మరికొన్ని అంశాలని చేర్చారు. ఉపకార – కర్తవ్య ధోరణితో యజ్ఞమాచరించినప్పుడు మనలో అహంకారం పెరిగే అవకాశం ఉండొచ్చు. అయితే ఆ అహంకారాన్ని పంచమహా యజ్ఞాలు రూపుమాపుతాయి. కృతజ్ఞతా భావంతో వ్యవహరించేలా చేస్తాయి.

జీవితంలో ప్రతి ఒక్కరూ రుణముక్తులు కావాలని, తగిన రీతిలో కర్తవ్యాన్ని నిర్వహించాలని మన పెద్దలు అంటారు. ఆ మాటకొస్తే మూడు రకాల రుణాలు పురాణకాలం నుండి ఉన్నాయి. పాతకాలం నాటి శాస్త్ర గ్రంథాలలో వీటి ప్రస్తావన కనిపిస్తుంది. ఒకడు మనిషి జన్మ ఎత్తినప్పుడు మూడు రుణాలు ఆ వ్యక్తితో ముడిపడి ఉంటాయి. ఒకటి దేవ రుణం, ఇంకొకటి పితృ రుణమయితే, మరొకటి రుషి రుణం. ఆధునిక సమయానికి అనుగుణంగా మరో రెండు ఋణాలను నేను ఈ మూడు రుణాలకు అదనంగా చేర్చాను.

మనం ఒంటరిగా ఉండం కదా, మన కుటుంబాలు కూడా ఒంటరిగా ఉండవు. మనం, మన కుటుంబాలు ఒక సమూహంలో ఉంటాం, సమాజంలో ఉంటాం. అందుకే సమాజ రుణాన్ని తీర్చుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. రెండవ దేమంటే నీరు, ఫలాలు, కంద మూలాలు మొదలయిన వస్తువుల ద్వారా మన అస్తిత్వం ఉంది, దీన్నే మనం సృష్టి అంటున్నాం. ఆ సృష్టి రుణం తీర్చుకోవాల్సిన కర్తవ్యం కూడా మన మీద ఉంది. అందుకే దేవ, పితృ, రుషి, సమాజ, సృష్టి రుణాల నుండి ముక్తిని పొందే ప్రయత్నం మనం చేయాలి. ఈ పంచ రుణాల నుండి ముక్తిని పొందటానికి పంచ మహాయజ్ఞాలు చేయాలి.

మరో విషయం – వర్తమాన సమయంలో ముఖ్యంగా యోచించవలసినది మన సంస్కృతి గూర్చి. దాన్ని మనం సనాతనమని పిలుస్తున్నాం. అయితే సనాతన మంటే ఏమిటన్నది ప్రశ్న. ‘చిర పురాతనం – నిత్య నూతనం’ అని సనాతనాన్ని గూర్చి వ్యాఖ్యానిస్తారు. ప్రాచీనం కన్నా అతిపురాతన సంబంధమైన ఆలోచనలు చేసినా, నూతనం కన్నా అత్యాధునిక ఆలోచనలు చేసినా వర్తమానం కూడా సందర్భోచితంగానే ఉంటుంది. అందుకే సనాతన ధర్మం, సనాతన సంస్కృతి, సనాతన పరంపర అని మన వాళ్లంటారు. సనాతనమైతే ఏమిటి? సంజ్ఞలైతే పాతవే ఉంటాయి, ఇంటర్ప్రిటేషన్‌ ‌మాత్రం కొత్తగా ఉంటుంది. యజ్ఞమనే పదం పాతదే అయినప్పటికీ, యజ్ఞాన్ని నిర్వహించే విషయంలో కొత్త అంశాలు చేరుతూపోతాయి. ఇందులో కొన్ని అంశాలు శాశ్వతంగా ఉండిపోతాయి, ఇంకొన్ని మారిపోతాయి. భారతీయ తత్త్వశాస్త్రం, సంస్కృతి, పరంపర మొదలయిన అంశాలపై సాధికారతతో వ్యాఖ్యా నించటంలో దిట్ట రామకృష్ణ మిషన్‌కు చెందిన ప్రముఖ సన్యాసి స్వామి రంగనాథానందజీ మహారాజ్‌. ‌వీరి ప్రసంగాల సంకలనం వెలువడి నప్పుడు అందులో కొన్ని అంశాలు శాశ్వతత్త్వాన్ని కలిగి ఉన్నాయి. ఉపనిషత్తులు నాటి నుండి నేటి దాకా సమస్త ప్రపంచానికి ప్రేరణనిస్తున్నాయి అనే విషయం శాశ్వతత్త్వాన్ని కలిగి ఉంది. కాని దీనిలో కూడా పరిస్థితులు మారుతున్నాయి. ఆచార వ్యవహారాలూ, వేషభాషలు, అన్నపానాదులు, నియమాలు పరిస్థితులకు అనుగుణంగా పరివర్తన చెందుతూ ఉంటాయని ‘ఎటర్నల్‌ ‌వాల్యూస్‌ ఇన్‌ ఎ ‌ఛేంజింగ్‌ ‌సొసైటీ’ అనే పుస్తకంలో రంగనాథానంద  మహారాజ్‌ ‌వ్యాఖ్యానించారు.

సమాజం పరివర్తన చెందుతూ ఉంటుంది, సాంకేతికత మారుతూ ఉంటుంది, జీవన క్షేత్రాలు మారుతుంటాయి, పరిస్థితులు కూడా పరివర్తన చెందుతుంటాయి. మారుతున్న సామాజిక హద్దుల లోపల శాశ్వత జీవన విలువలు ఉన్నాయి. శాశ్వ తమైన పరంపరలున్నాయి. వాటి గూర్చి వ్యాఖ్యానించి వ్యవహారంలోకి తేవాలి. ఈ దృష్టితో సంస్కారం – పంచ మహాయజ్ఞాల ప్రాచీన శాశ్వత పరంపరని వర్తమానకాలంలో ప్రచార, ప్రసారాల ద్వారా కొనసాగిస్తూ, జీవన వ్యవహారంలోకి తెచ్చే దృష్టితో యోచించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ఈ కోణంలో నేటి పరిస్థితుల నేపథ్యానికి అనుగుణంగా ప్రతి యజ్ఞం గూర్చి యోచించాలి.

కుటుంబ ప్రబోధన్‌ ‌కార్యకర్తలమైన మనమంతా వీటి విషయంలో చర్చించి, యోచించి రానున్న తరాలకి అందజేయాల్సిన అవసరముంది. పంచ మహాయజ్ఞాలు పంచ రుణాలు ప్రతి ఒక్కరూ తమ తమ స్థావరాల్లో చేసుకున్నప్పుడు ఇది ప్రతీకాత్మకంగా మారుతుంది. ఈ కోణంలో మనమెప్పుడయితే ఆలోచిస్తామో పెక్కు విషయాలు మనముందుకొస్తాయి.

రుషి రుణం

ప్రతీకాత్మక రూపానికి సంబంధించి కొన్ని విషయాలను మీ సమక్షంలో ఉంచదలిచాను. బ్రహ్మ యజ్ఞాన్ని ప్రాచీనకాలంలో బహుశా కేవలం ధ్యానంతో లేక నేను దేహాన్ని కాను, నేను చైతన్యాన్ని, నేను ఆత్మ తత్త్వాన్ని అనే భావనతో చేసేవారు. ఈ కారణంగానే ఇది బ్రహ్మ యజ్ఞ పద్ధతిగా మారింది. నేటి సమయానికి అనుగుణంగా దీన్ని కొంత మేర విస్తృత పరచవచ్చు. ఎందువల్లనంటే ఒకరి గూర్చి చర్చించే సమయాన ఇంట్లో కూడా చర్చించాలి. సమాజంలో ప్రచారం చేయాలి. అంటే మనం కుటుంబ దృష్టితో నిర్వహణ చేస్తూనే, సామాజిక దృష్టితో కూడా దాన్ని విస్తరింప చేయాలి. ఈ రెండిటి దృష్టి కోణంలో దీని గూర్చి చర్చించాలి. బ్రహ్మ యజ్ఞం ద్వారా రుషి రుణం నుంచి ముక్తి పొందవచ్చు. జీవితంలో మనిషి పరుగులు తీస్తుంటాడు, వర్తమాన సమయంలో కొంతసేపు మనిషి ప్రశాంతంగా విశ్రమించాలని చెబుతారు. కొద్దిసేపటి దాకా తనకు తానుగా మమేకం కావాలని కూడా సూచిస్తారు. తనలో తాను అంతర్ముఖుడై ఆత్మావలోకనం చేసుకునే ప్రయత్నం చేయాలంటారు. ఇవన్ని రుషి రుణంకు సంబంధించిన మన భావనలు, మన ఆలోచనలు. వీటిని రానున్న తరాల మదిలో చొప్పించాలి. ఇంట్లో మన పిల్లలుంటారు, వారితో మన సంస్కృతికి సంబంధించి ఆధార భూతమైన గ్రంథాలను చదివించే ప్రయత్నం చేయాలి. అందుకు అనుగుణంగా పుస్తకాలు సేకరించి మన ఇళ్లలో పెట్టాలి. ఒకే విధమైనవి కాకుండా ఉపనిషత్తులు, రామాయణ మహాభారతాలు, ఒకవేళ మీరు జైనులయితే మీ పరంపరకు సంబంధించిన మూల గ్రంథాలు తత్వార్థ సూత్రం, పక్తాంబర్‌ ‌మొదలయినవి సేకరించి ఇళ్లలో పెట్టండి. మీరు బౌద్ధులయి ఉంటే ధమ్మపదం, సిక్కులయి ఉంటే గురుగ్రంథ్‌ ‌సాహిబ్‌ని తప్పనిసరిగా ఇంట్లో ఉంచండి. ఇటీవలి కాలంలో ఒడిశాలో ఇంటింటి సర్వే జరిగినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వెయ్యి ఇళ్లని చూసినప్పుడు సుమారు 250 పైచిలుకు ఇళ్లల్లో ఒక్కటంటే ఒక్క ఆధ్యాత్మిక గ్రంథం లేదని తేలింది. అందుకే మనం ప్రతి ఒక్కరికీ నొక్కి చెప్పాల్సిన విషయమేమంటే సనాతన కాలం నుండి ప్రేరణ ఇస్తూ వచ్చిన ధార్మికగ్రంథాలు ప్రతి ఇంట్లో ఉండాలని.

రానున్న కొత్తతరం మన సనాతన పరంపర గూర్చి మెలమెల్లగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. నాగపూర్‌లో ప్రజ్ఞాభారతికి చెందిన డాక్టర్‌ ‌వర్ణేకర్‌ ‌మనుమడు నాలుగేళ్ల వయసున్న వేద సింగపూర్‌లో ఉంటాడు. అతడు ప్రతిరోజూ నాయనమ్మ వద్ద ఒక శ్లోకం చదువుకొని దాన్ని కంఠస్థం చేస్తాడు. దానితో పాటే రామాయణ, మహాభారతాల కథలు వింటాడు, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ‌శౌర్యగాథలను కూడా వింటాడు. ఆధునిక టెక్నాలజీ సహకారం ద్వారా ఈ సంస్కారాలు దొరుకుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ అబ్బాయికి భగవద్గీతలోని 12వ అధ్యాయం పూర్తిగా కంఠస్థ మయింది. బ్రహ్మ యజ్ఞానికి సంబంధించినంత వరకు ఇది యుగానుకూల ఉదాహరణ మాత్రమే. ఇటీవలే మన సహ సర్‌కార్యవాహ మన్మోహన్‌ ‌వైద్య తండ్రి బాబూరావ్‌ ‌వైద్య కాలధర్మం చెందారు. ప్రతి చాతుర్మాస్య కాలం సాధు సంతులకు సంబంధించి నదని మనమంతా అనుకుంటూ ఉంటాం. అయితే ఈ చాతుర్మాస కాలంలో బాబూరావ్‌ ‌వైద్య తన కుటుంబ సభ్యులనే కాకుండా చుట్టూ ప్రక్కల ఉన్న వారిని కూడా ఇంటిలోకి పిలిపించి తన వద్దనున్న శాశ్వత ధార్మిక గ్రంథాన్ని చదువుతూ వ్యాఖ్యానం చేసేవారు. మనం కూడా ఈ దృక్కోణంలోనే ఆలోచించాలి. మరో కోణంలో కూడా యుగాను కూలంగా మనం యోచించాల్సిన అవసరముంది, పిల్లల్లో, యువకుల్లో రాయగలిగిన సత్తా ఉంటే వారితో మన ధార్మిక గ్రంథాలలోని విషయాలు రాయించాలి, చక్కగా మాట్లాడే ప్రతిభ ఉంటే వారి ప్రసంగాలు ఏర్పాటు చేసి ప్రోత్సహించాలి, ఈ కార్యాన్ని విస్తరింపచేయాలి. పరమాత్ముడు ప్రతి మనిషిలోనూ ఉన్నాడు, అయితే బేధభావాలతో మనిషి వ్యవహరిస్తున్నాడు. ఒకానొక సమయంలో కులాల మధ్య అస్పృశ్యత ఉండేది, అయితే ఇప్పుడు మెల్లమెల్లగా వృత్తులలో కూడా ఉచ్చ – నీచ భావనలు వ్యాపిస్తున్నాయి. నా తండ్రి మంగలి వృత్తిలో ఉండేవాడు, నేను ఎం.ఏ., ఎమ్మెస్సీ చేశాక నా తండ్రి చేస్తూ వచ్చిన మంగలి వృత్తి నా కళ్లకి అల్పంగా కనబడటం మొదలయింది. వ్యాపారాలు కూడా చిన్నా-పెద్దగా కనబడటం మొదలయినాయి. కానీ మనందరం ఒకటే అని మాత్రం మాట్లాడుకుంటాం. ఈ విధంగా వ్యవహరిస్తుంటే బ్రహ్మవైపు మన ప్రయాణం సాగదు కదా. అందువల్ల దోషాలను పరిహరించే సంస్కారమొకటుంది. కనుక ఆ సంస్కార మార్గాన్ని అనుసరించాలి. దోషం మన లోపలే ఉంది కనుక ఆ దోషాన్ని తొలగించాలి. అందుకు మంచి గుణాలు రావాలి. అందుకు చిన్న చిన్న ప్రయత్నాలు చేయాలి. ఒకవేళ మనం కొద్దీగా యోచిస్తే వర్తమాన యుగం లోపల ఉన్న బ్రహ్మయజ్ఞం ద్వారా చూస్తే ఒక విధమయిన పరివర్తన రానున్న సమయంలో కనిపించవచ్చు.

పితృ రుణం

పితృ రుణం కోసం పితృ యజ్ఞం చేయాలని పెద్దలు చెప్పారు. ఇక్కడ పరంపరాత్మక రూపంలో పితృ అంటే ఏమిటి? దివంగతులైన వారికి మన సామాజిక జీవనంలో భాగంగా శ్రాద్ధం పెట్టే పరంపర ఉంది. ఇక్కడ సాధారణంగా మన సంకల్పం ఏమిటి? ఈ సందర్భంలో మనం మన పూర్వజులను స్మరించుకుంటాం. ఇది మన పరం పరలో ఒక భాగం. అయితే నేను ప్రస్తావించిన యుగానుకూల పరివర్తన అంటే, అప్పుడు పితృ అంటాం, కాని విస్తృతార్థంలో అనగా వర్తమాన సమయంలో మనపూర్వీకులు అని చెప్పుకుంటాం. పితృ అంటే మాతా పితరులు. పితృ రుణం అని చెప్పినప్పుడు పితృ శబ్ద ప్రయోగం జరుగుతుంది. దీనర్థం పితృ రుణం నుండి అమ్మను వేరుచేసి చూడలేం, అమ్మ కూడా ఇందులో భాగమే. అమ్మా-నాన్న, నాయనమ్మ – తాతయ్య మొదలయిన వారంతా మన పూర్వీకులయి ఇందులో భాగమయిపోయారు. మనం ఈ పక్రియని మరింతగా విస్తరింపజేసి మన పూర్వీకులతో పాటు సమాజంలో శ్రేష్ఠ మహా పురుషులుగా భావించబడుతున్న వారిని సైతం మన పూర్వీకులుగా భావించాలి. పితృ రుణ ముక్తికోసం పితృ యజ్ఞం చేయాలి. దీన్ని కూడా మనం కాస్త విస్తృతం చేయవచ్చు. ప్రాచీన పరంపర మేరకు చూస్తే మన కుటుంబాలలో ఏడేడు తరాల చర్చలు కొనసాగుతుండేవి. వర్తమాన సమయంలో చూస్తే పరివారం చాలా చిన్నదైపోయింది. అంటే న్యూక్లియర్‌ ‌ఫ్యామిలీగా మారిపోయింది. తండ్రిని తప్పిస్తే ఇంకెవరూ కనబడరక్కడ. అతి కష్టమ్మీద తాతయ్య అనేవాడు కనిపిస్తే కనిపించవచ్చు. ముత్తాత అనేవాడి ప్రస్తావన అసలే ఉండదు. మనవద్ద ఏడేడు తరాలు అనటమే కాదు, ప్రతి తరం ఏడు తరాల వారిని, వారి పేర్లను గుర్తు చేసుకునేవారు. అందుకే మనం మన కొత్త తరానికి ఏడు తరాల వారి పేర్లని గుర్తు చేసుకొనేలా తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

నేను గుజరాత్‌లో జన్మించాను. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక పరంపర ఉండేది. నేను చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు మా వాళ్లు నాకేమయితే నేర్పారో అవన్నీ నాకు గుర్తున్నాయి. చిన్ని చిన్ని పేర్లతో అల్లిన కవితని పదే పదే జ్ఞప్తికి తెచ్చేవారు. ఉదాహరణకు చెప్పాల్సి వస్తే నా పేరు సురేష్‌ ‌కదా.. మావాళ్లు మా ఏడుతరాల వారి పేర్లు గుర్తు చేసేందుకు… సురేష్‌ ‌చంద్ర, జయంతీ లాల్‌, ‌జయంతీ లాల్‌ ‌రణ్‌ ‌ఛోడ్‌, ‌రణ్‌ ‌ఛోడ్‌ ‌మారుష్‌ ‌చంద్ర, మారుష్‌ ‌చంద్ర మోతీ, మోతీ మావోజీ, మావోజీ జెఠా అనే వారు. జెఠా అనే పేరుతో ఏడవతరం అయిపోయేది. ఈ జెఠా ఎక్కడినుంచి వచ్చాడు అని చెప్పేందుకు ఓ చిన్నపాటి జోక్‌ని చేర్చి గుజరాతీ భాషలో చెప్పేవారు. ‘జెఠా బాదల్‌ ‌మాకి పీఢా ఐఠా’ అంటే ‘మేఘాల్లోంచి జారి కింద పడ్డాడు’ అని అర్థం. దీంతో మాకు ఏడుతరాల పేర్లూ గుర్తుండిపోయేవి.

అమెరికా నుండి ‘రూట్స్’ అనే ప్రసిద్ధ నవల వెలువడింది. ఎలెక్స్ ‌హేలీ అనే రచయిత పూర్వీకులు ఆఫ్రికా దేశాల నుండి ఏదో సమయాన ఈ ప్రాంతాలకు వచ్చి ఉండొచ్చు. అతడు అమెరికన్‌ ‌నల్ల జాతీయుడు, కానీ తామెక్కడి నుండి వచ్చామో, తమ మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలన్న జిజ్ఞాస అతడిలో మొదలయింది. ఆధునిక అమెరికాలో ఎలెక్స్ ‌పుట్టాడు.

తమ పూర్వీకులు ఆఫ్రికాలోని ఏ దేశం నుండి వచ్చారో తెలుసుకునేందుకు అన్వేషణ కొనసాగిస్తూ, కొనసాగిస్తూ, తమ మూలాలను పట్టుకునేందుకు యాత్ర చేశాడు. తన సంపూర్ణ యాత్రని వివరిస్తూ ఆ సమాజం కోసం ‘రూట్స్’ ‌నవలని రాశాడు ఎలెక్స్. ‌రూట్స్ అం‌టే చెట్టు వేర్లు, మూలాలు. ఆ నవల బాగా ప్రసిద్ధిచెందింది. దాని ఆధారంగా ఒక సినిమాని నిర్మించారు. అది పలువురి ప్రశంసలు పొందింది. దాని ప్రభావం ఎలా ఉండిందో చెప్పేందుకు ఓ సంఘటనని ఇక్కడ ప్రస్తావిస్తాను. గుజరాత్‌కు చెందిన ఒక యువకుడు ఆ సినిమా చూశాడు. తన పూర్వీకులెవరో, వారెక్కడి నుంచి వచ్చారో అతడికి తెలియదు. అమెరికా నుండి ఆ యువకుడు గుజరాత్‌కు తిరిగి రాగానే తన పూర్వీకుల మూలాల గూర్చి ఎలా తెలుసుకోవాలి అనే విషయమై ఆలోచించాడు.

ప్రస్తుత తరుణంలో మనం పండాల విషయాన్ని మరచిపోయాం. కొన్ని చోట్ల పండాలు అని పిలిస్తే, గుజరాత్‌ ‌ప్రాంతంలో వారిని ‘బారూట్‌’అని చెబుతారు. ప్రతి ఇంట్లో, ప్రతి వాడలో, ప్రతి ప్రాంతంలో జన్మించిన పిల్లవాడి పేరుని, గోత్రాన్ని, తల్లిదండ్రుల పేర్లని, వారికి సంబంధించిన రుషుల పేర్లని పండాలు / బారూట్లు తమ తమ పుస్తకాల్లో రాసి పెడతారు. ఆ యువకుడు బారూట్‌ని వెదికి తన ఇంటికి తీసికొచ్చాడు. బారూట్‌ ‌కేవలం గంట వ్యవధిలోనే ఆ యువకుడికి అతగాడి 30 తరాల వారి వివరాలు తీసి ఇచ్చాడు.

అనువాదం : విద్యారణ్య కామ్లేకర్‌

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top