‘కాస్ట్’ వ్యవస్థ – పాశ్చాత్య క్రైస్తవ పునాదులు - The ‘caste’ system - the foundations of Western Christianity

0
‘కాస్ట్’ వ్యవస్థ – పాశ్చాత్య క్రైస్తవ పునాదులు - The ‘caste’ system - the foundations of Western Christianity
The ‘caste’ system 

​ఈ వ్యాసం నాలుగు భాగాలుగా రానున్నది. మొదటి భాగం ఈ వారం ప్రచురిస్తున్నాం. వరుసగా వారానికి ఒక భాగం ప్రచురింపబడుతుంది. గమనించ ప్రార్థన.

మన సామాజిక వ్యవస్థకు పాశ్చాత్య క్రైస్తవ మేథావులు, మిషనరీలు పెట్టిన పేరు ‘కాస్ట్’. ఎంతో విస్తృతంగా గతనాలుగు శతాబ్దాల నుండి పరిశోధనలు చేసి కూడా దాని మూలాల గురించి వారు ఒక నిశ్చితాభిప్రాయానికి రాలేకపోయారు. ‘కాస్ట్’ వ్యవస్థ క్రూరమయిందనీ, అమానుషమయిందనీ, యదేచ్ఛగా మానవహక్కుల ఉల్లంఘనకు కారణభూతమయిందని వారు ఆరోపిస్తుంటారు. హిందూ సమాజం ఒక నిచ్చెన మెట్లవ్యవస్థ అని, హెచ్చు తగ్గు భేదాలతో కునారిల్లుతున్నదని, వివిధ కాస్ట్స్ మధ్య మంచంపొత్తు, కంచంపొత్తు లేని కారణంగా సామాజిక ఐకమత్యం లేదని, కుల వైషమ్యాలు సర్వ సామాన్యమని, అంటరానితనం, రక్త స్వచ్ఛత (Purity), మైల (Pollution) వంటి భావాలకు హిందువులు దాసులని విశ్లేషిస్తుంటారు.

అనైతిక, అమానుష వ్యవస్థ

కాస్ట్ వ్యవస్థ ఒక అనైతిక సామాజిక వ్యవస్థ అని, వివక్ష అన్ని నైతిక సూత్రాలకు విరుద్ధమని, అటువంటి వివక్షను సర్వసామాన్యం చేసిన సామాజిక వ్యవస్థ అనైతికతను విధిగా పాటించవలసిన కర్తవ్యంగా చేస్తున్నదని, అనైతికతను, వివక్షను విధిగా, ఉత్తరదాయిత్వంగా చేసిన సామాజికవ్యవస్థ ప్రపంచంలో మరొకటిలేదని కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉంటారు.
   ఆ వ్యవస్థను తిరస్కరించకుండా, అందులోనే కొనసాగే వ్యక్తులు అలాంటి దురన్యాయాలను తమ విధిగా భావించి నడచుకోవటంలో వింతేమీ లేదని వారి అభిప్రాయం. భారతీయులు హేతుబద్ధంగా ప్రవర్తిస్తుంటారనిన్నీ, చట్టాలను అనుసరించి నడుస్తుంటారనిన్నీ కూడా పేరు పడ్డారు. కానీ సామాజిక స్థాయిలో వారి ప్రవర్తన తద్భిన్నంగా ఉండటం, అనైతిక, సహేతుకంకాని సామాజిక వ్యవస్థను అంగీకరించి, తదనుగుణంగా నడుచుకోవటం అనేక మంది పాశ్చాత్యమేథావులను తికమక పెడ్తున్న అంశం.

పాఠ్యగ్రంథాలలో భారతీయ సామాజిక వ్యవస్థ గురించి బహుళ ప్రచారం పొందిన ఈ కథనాలే ఉన్నాయి. తరతరాలుగా అనైతిక, అమానుష నియమనిబంధనలను గౌరవిస్తూ, పాటిస్తూ, వాటినే తమ పిల్లలకు బోధిస్తూ హిందువులు జీవిస్తున్నారని, దానితో వివక్షకు వ్యతిరేకంగా ఎన్ని చట్టాలు చేసినా, సగటు భారతీయుడి దృక్పథంలో, తీరులో ఎటువంటి మార్పు రావటంలేదని వారు సిద్ధాంతీకరిస్తున్నారు. కాస్ట్ సంఘర్షణలు, వైషమ్యాలు సమకాలీన భారతదేశంలో ఇంకా సజీవంగానే ఉన్నాయని, సామాజికవ్యవస్థ యొక్క అనైతికత, అమానుషత్వానికి సంబంధించి బలమైన సాక్ష్యాధారాలు వారి కళ్ళ ఎదుట కనిపించినా, వారికి స్వానుభవంలోకి వచ్చినా హిందువులు ఆ వ్యవస్థనే పట్టుకొని వేళ్ళాడుతూ, దాని నియమనిబంధనలను, విధి నిషేథాలను పాటించటం ఆశ్చర్యం కల్గించే అంశమని పాశ్చాత్య మేథావులు వ్రాశారు.

పాశ్చాత్యుల కథనాలు వాస్తవమే అయితే, కాస్ట్ వ్యవస్థకు గల శక్తి సామర్ధ్యాలు అపారమని అనుకోవలసి వస్తుంది. ఎందుకంటే పరిశోధకులు గుర్తించిన అనైతికతను, అమానుషత్వాన్ని ఇన్ని యుగాలుగా, ఇన్ని తరాలుగా భారతీయులు గుర్తించలేకపోయారా? నిజంగా అంత అమానుషమైనది, అసౌకర్యమైనది అయితే భారతీయ సమాజంలో ఏనాడో అంతర్యుద్ధం రావాలి కదా? ఎందుకు రాలేదు? అంటే భారతీయ కుల వ్యవస్థపై ఈ పాశ్చాత్య మేథావులు చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలో, అర్థ సత్యాలో అయ్యుండాలి కదా? ఆ వ్యవస్థలో సభ్యులు కాని వారికి ఆ వ్యవస్థ యొక్క అమానుషత్వం తెలుస్తున్నది. అనైతికత ఇట్టే కన్పడుతున్నది. అంటే లోపలి వారు ఆ వ్యవస్థయొక్క ‘నిజస్వరూపాన్ని’ పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారంటే, తెలుసుకొన్నా దాన్ని సమూలంగా నిర్మూలించటానికి గాని, సంస్కరించటానికి గాని గట్టి ప్రయత్నం చెయ్యటంలేదంటే, అది బయటి వారి పరిశీలనా, పరిశోధనా ఫలితంగా ఏర్పడిన అభిప్రాయమే తప్ప వాస్తవం కాదేమో అన్న అభిప్రాయం కలుగకమానదు.

‘విగ్రహారాధకుల హీనమతం’ యూదుమతమే

పాశ్చాత్యులు యూదులను, పాగాన్లను విగ్రహారాధకులుగా పేర్కొంటారు. 17వ శతాబ్దంలో మనదేశానికి వచ్చిన విదేశీ యాత్రికుల రచనలు, మిషనరీల నివేదికల ఆధారంగా, నాలుగు తెగలుగా, అనేక ఉపతెగలుగా విభజించబడిన సామాజిక వ్యవస్థగల విగ్రహారధకుల దేశంగా పాశ్చాత్య మేథావులు మనదేశాన్ని గుర్తించారు. సామాజిక విభజనకు పుట్టుక, రక్త స్వచ్ఛత ఆధారమని, వాటి కారణంగానే వివిధ ‘కాస్ట్స్’ యొక్క సామాజిక స్థాయి నిర్ణయింపబడేదని వారు అనుకొన్నారు. కానీ అందుకై వారు ఎట్టి సర్వేక్షణలు చేయలేదు. అట్టి అభిప్రాయాన్ని వారు పెద్దగా విచారించకుండానే ఏర్పరచుకున్నారు.

జాతి ఆధారంగా ఏర్పడిన దేశాల నుంచి వచ్చిన పాశ్చాత్యులకు ఎక్కువ జనాభా గలిగి, వివిధ సంప్రదాయాలతో, సామరస్యంగా పరిఢవిల్లుతున్న హిందువులను ఒకే జాతిగా, ఒకే దేశానికి చెందినవారిగా గుర్తించటం ఇష్టం లేకపోయింది. ఎంతో వైవిధ్యం, భిన్న సంప్రదాయాలు, వాటితోపాటుగా హెచ్చుతగ్గుల సామాజికవ్యవస్థ ఉన్న దేశ ప్రజలందరూ ఒకేజాతికి ఎలా చెందుతారన్న ప్రశ్నను లేవదేశారు. వలసపాలనా కాలంలో జనాభాలెక్కల సేకరణ మొదలయింది. వివిధ ‘కాస్ట్స్’కు చెందిన హిందువుల సామాజికస్థాయిని నిర్ణయించి, వర్గీకరించే పనికి వారు పూనుకొన్నారు. కానీ అది అంత తేలికైన విషయంకాదని వారికి అర్ధమయింది. అయితే అందుకు వారు ఒక తేలికైన మార్గాన్ని ఎంచుకున్నారు. సామాజిక స్థాయిని నిర్ణయించటానికి బ్రాహ్మణులనే కొలమానంగా తీసుకొని, బ్రాహ్మణులకు, ఇతరులకు మధ్య ఉన్న దూరాన్ని బట్టి ఒక ‘కాస్ట్’ యొక్క సామాజిక స్థాయిని నిర్ణయించే దుస్సాహసం, దుష్ట ప్రయత్నం వారు చేశారు. వారు అనుసరించిన పద్ధతి శాస్త్రీయం కాకపోయినప్పటికీ విభజించి, పాలించు అనే వారి లక్ష్యానికి అనుగుణంగా ఉన్న కారణంగా ఆ పద్ధ్హతినే అనుసరించి హిందూ సమాజాన్ని వర్గీకరించారు. వారి సమాజాలలో ప్రాచుర్యంలో ఉన్న జాతి, తెగ, హీనమతం (Heathen Religion) అనే భావనలను (Concepts), వాటి చుట్టూ అల్లిన సిద్ధాంతాలను మన సమాజానికి కూడా వర్తింపజేశారు.

పాతనిబంధన యూదులతో సారూప్యం

రోజిరిస్ (Rogerius) 1651లో వ్రాసిన తన పుస్తకం The Open Door to Hiden Heathendom లో నాలుగు ప్రధాన తెగలుగా విభజించబడ్డ విగ్రహారాధకుల జాతికి చెందినవారిగా భారతీయులను అభివర్ణించాడు. వేదం, వారి ప్రధాన న్యాయగ్రంధం (Lawbook) అని పేర్కొన్నాడు. అంతేకాక బ్రాహ్మణులకు, పాతనిబంధన (Old Testament) యూదులకు మధ్య సారూపత్య ఉందని, పాతనిబంధనలోని అనేక కథలను, ఆరాధనా పద్ధతులను బ్రాహ్మణులు కాపీ కొట్టారని ఘంటాపదంగా చెప్పాడు. రోజరస్, మరియు అతని వంటి అనేకమంది ఇతర రచయితల చేత కనుగొనబడిన పాతనిబంధన యూదులకు మరియు బ్రాహ్మణులకు మధ్యనున్న సారూప్యత పాశ్చాత్యమేథావులకు భారతదేశంలోని మత, సామాజిక వ్యవస్థలను అర్ధం చేసుకోవటానికి తేలికమార్గం అయింది. దానితో పురాతన ఇజ్రాయిల్ జాతికి చెందిన ఒకశాఖగా భారతజాతిని వారు భావించటం మొదలెట్టారు. పాత నిబంధన ప్రకారం, యూదుతెగలు దేవునితో చేసుకొన్న ఒడంబడిక (Covenant) ప్రకారం ఒకజాతిగా ఏర్పడ్డారు. అందులో లెవి తెగకు చెందిన వారు పూజారులుగా నియమించబడ్డారు. ఈ ‘లెవియట్లు’ పురోహితులుగా, వంశపారంపర్యంగా ఒకతరం తర్వాత మరొకతరంలో పనిచేస్తూ వచ్చారు. ఈ పురోహితవర్గం యూదుమతంలో ప్రధాన పాత్ర పోషించింది. పాపం, మాలిన్యం (Impurity) లను నిర్వచించి, నిర్ధారించి, అందుకు తగిన పరిహారాన్ని, శిక్షలను విధించే క్రమంలో వారిదే ప్రముఖపాత్ర. అనేకసార్లు నిర్ణ యాత్మక పాత్ర కూడా.

పాశ్చాత్యులు. క్రైస్తవ మేధావులు యూదుమతాన్ని విమర్శించేందుకు ఉపయోగించిన మేథోసాధనాలు భావనావనరుల (Conceptual Resources)తో మనదేశపు సాంస్కృతిక మర్యాదల యోగ్యతాయోగ్యతలను, సామాజిక కట్టుబాట్ల హేతుబద్ధతను, ధార్మిక విశ్వాసాల తాత్విక పునాదులను విశ్లేషించటం మొదలెట్టారు. భవిష్యత్తు పరిశోధకులకు సైతం ఇవే మార్గదర్శకం అయ్యేటట్లు చేశారు.

మోజస్ & మనువు

ఒక రచయిత తర్వాత మరొక రచయిత, ఒక పరిశోధకుడి తర్వాత మరొక పరిశోధకుడు హిందువులమతం యూదు మతం యొక్క రూపాంతరం తప్ప మరేది కాదని గోబల్స్ ప్రచారం చేశారు. ఉదాహరణకు 1776లో Code of Gentoo Law కు ఉపోద్ఘాతం వ్రాస్తూ Nathaniel Halhed యూదుల మతానికి, హిందూమతానికి మధ్య ఉన్న పోలికలను, సారూప్యతను గురించి వ్రాశాడు. ఆ గ్రంథం సందర్భ రహితంగా క్రోడీకరించబడ్డ కొన్ని ధర్మశాస్త్రాల భాగాలకు ఆంగ్లతర్జుమా మాత్రమే.

యూదులకు మోజెస్ చాలా కీలకమైన ప్రవక్త. బానిసత్వం నుండి యూదులను విముక్తి చేసిన ప్రవక్త ఆయన. సీనాయ పర్వతం వద్ద దేవుని ఆదేశాలను, ఆజ్ఞలను యూదులకు చెప్పిన వాడు మోజెస్. 17వ శతాబ్దపు ప్రొటెస్టెంటు క్రైస్తవ రాజకీయ తత్త్వవేత్తల ఆలోచనా ధోరణిని పాతనిబంధన, మోజెస్ న్యాయసూత్రాలు అత్యంత ప్రభావితం చేశాయి.

పాశ్చాత్య క్రైస్తవ మేధావులు 17వ శతాబ్ది చివరి నుండి ఒక నిర్ధిష్ట అభిప్రాయానికి వచ్చారు. ప్రతి నాగరిక జాతికి మోజెస్ వంటి ఒక ప్రవక్త లేక తొలి ధర్మాచార్యుడు ఉండి ఉంటాడని, ఆ జాతి యొక్క మౌలిక న్యాయసూత్రాలను ఆయనే ఇచ్చివుంటాడని వారు ప్రగాఢంగా నమ్మేవారు. వివిధ తెగలను ఏకీకృతం చేసి, ఒక జాతిగా వారిని రూపొందించే క్రమంలో అందుకు చొరవచూపిన వ్యక్తులు దేవుని పేరుతో ఆపని చేస్తున్నట్లుగా చెప్పుకొని, దేవుని ఆజ్ఞలుగా కొన్ని ప్రాథమిక సూత్రాలను ఆ తెగల ప్రజలకు యిచ్చారు. మోజెస్ కూడా అలాంటివాడే. ప్రతిజాతికీ ఒక మోజెన్ ఉండే ఉంటాడని పాశ్చాత్య మేధావులు గాఢంగా నమ్మేవారు. మనదేశానికి సంబంధించి కూడా అటువంటి మొట్టమొదటి న్యాయసూత్రాలను యిచ్చిన వ్యక్తికోసం 18వ శతాబ్దిలో ఆంగ్ల మేధావులు అన్వేషించారు. మనుధర్మస్మృతి వారికంట పడినపుడు మనువును హిందువుల మోజెస్ గా వారు ప్రకటించారు. దేవుని చే ప్రేరేపింపబడి, మనువు హిందువుల ఆచార వ్యవహారాలను వారి మతంలో అంతర్భాగం చేసి న్యాయసూత్రాలను రూపొందించాడని నిర్ధారించి, హిందూజాతికి ఆద్యుడు, సంస్థాపకుడు మనువే అని వారు ప్రకటించారు. ఆవిధంగా రూపురేఖలలోనూ, లక్షణాలలోనూ భారతదేశపు, ఇజ్రాయిల్ దేశపు సామాజిక వ్యవస్థల మధ్య సారూప్యత కనుగొన్న తర్వాత, యూదుమతానికి సంబంధించిన ఇతర అంశాలు సైతం మనకు అన్వయించారు.

(సశేషం) – డాక్టర్ బి. సారంగపాణి - విశ్వసంవాద కేంద్రము (AP) (full-width)

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top