స్వాతంత్య్రయోధుడు, దేశభక్త "కొండా వెంకటప్పయ్య" - Freedom Fighter, Patriot "Konda Venkatapayya" -

Vishwa Bhaarath
0
Konda Venkatapayya
KONDA VENKATAPPAIAH
నం మనస్ఫూర్తిగా కోరుకున్న స్వరాజ్యం అనే ఒకే ఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం చేరుకోగానే ఈ స్వాతంత్య్రయోధులలో నీతినియమాలు అంతరించిపోయాయి. రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతున్నది. ప్రజలు కాంగ్రెస్ ‌ను దూషిస్తున్నారు. బ్రిటిష్‌ రాజ్యమే మేలంటున్నారు. ఇప్పుడు స్వతంత్ర దేశంలో కాంగ్రెస్‌ అవినీతికి ఆలవాలమైపోతున్నది. పైసా ఆదాయం లేనివారు ఇప్పుడు మహారాజులలాగా పెద్దపెద్ద కార్లలో తిరుగుతున్నారు. కాంగ్రెసు ఎమ్.ఎల్.ఏలూ, ఏమ్.ఎల్.సి లు తరచూ జోక్యం చేసుకోవడం వలన జిల్లా కలెక్టరులూ, రెవిన్యూ అధికారులూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. ఈ పైరవీకారుల ప్రభావంతో, భయంతో నిజాయితీగల వారు తమ పదవులలో ఉండే పరిస్థితి లేదు.”

1947 డిసెంబర్‌లో, ప్రపంచ చరిత్రలోనే ఒక మహోన్నత చారిత్రక ఘట్టంగా చెప్పే స్వేచ్ఛాభారతి ఆవిర్భావం తరువాత మూడు మాసాలకే గాంధీజీకి అందిన ఒక లేఖలోని వ్యథాభరిత వాక్యాలివి. గాంధీజీకి ఇలాంటి లేఖ ఒకటి అందిందని ‘మార్చ్‌’ అనే పత్రిక పెద్ద పెద్ద అక్షరాలతో వార్తా కథనం కూడా ప్రచురించింది. ఆ వార్తకు శీర్షిక ‘కాంగ్రెస్‌ వర్స్‌ దేన్‌ ది బ్రిటిష్‌’. కాంగ్రెస్‌ పతానావస్థ గురించి అలా లేఖ రాసిన వారు శ్రీ కొండా వెంకటప్పయ్య పంతులు. అట్లని ఆయన ఏ హిందూ మహాసభ సభ్యుడో, కమ్యూనిస్టో అనుకుంటే పొరపాటే. ఆయన గాంధీ మార్గాన్ని తు.చ తప్పకుండా అనుసరించిన నికరమైన గాంధేయవాది. ఉత్తర భారతంలో బాబూ రాజేంద్రప్రసాద్‌ వలె, దక్షిణాదిన రాజాజీ వలె, తెలుగు ప్రాంతాల నుంచి గాంధీజీకి విశ్వాసపాత్రులుగా ఖ్యాతి గాంచినవారు శ్రీ కొండా వెంకటప్పయ్య.

సేవాతత్పరుడు
కొండా వెంకటప్పయ్య 1866, ఫిబ్రవరి 22న పాత గుంటూరులో పుట్టారు. తల్లి బుచ్చమ్మ, తండ్రి కోటయ్య. వారి ప్రాథమిక విద్య గుంటూరులోనే సాగింది. తరువాత బీఏ, బీఎల్‌ మద్రాసులో చేశారు. చదువు పూర్తయ్యాక బందరులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. బాల్యం నుంచే దేశభక్తి, ప్రజాసేవాతత్పరత కలిగిన వెంకటప్పయ్య చదువుకునే రోజుల్లోనే పిల్లలకు పాఠాలు చెప్పగా వచ్చే ఏడురూపాయిలను తన తోటి విద్యార్థికి సహాయంగా ఇచ్చేవాడు.

డిగ్రీ చదువుకు కొంచెం ముందు వెంకటప్పయ్య  రాజమహేంద్రవరంలో కొద్దికాలం ఉన్నారు. అప్పుడే కందుకూరి వీరేశలింగంగారి ప్రభావంలో పడ్డారు. ఆ రోజులలో విధవా పునర్వివాహాల కోసం ఆ అభాగినులను రహస్యంగా కల్యాణవేదికల వద్దకు తీసుకురావడం ఎంత క్లిష్టంగా ఉండేదో వెంకటప్పయ్య తన స్వీయ చరిత్రలో వర్ణించారు. వీరేశలింగం ఉద్యమాన్ని ఆయన హృదయ పూర్వకంగా స్వాగతించారు. వెంకటప్పయ్యగారు మద్రాసు కైస్తవ కళాశాలలో బీఏ ‘జూనియర్‌’  చదువుతూ ఉండగానే, అంటే 1887లో భారత జాతీయ కాంగ్రెస్‌ మూడో మహాసభలు ఆ నగరంలో జరిగాయి. అప్పుడే తాను జాతీయ కాంగ్రెస్‌ పట్ల అభిమానం ఏర్పరుచుకున్నట్టు వెంకటప్పయ్య తన స్వీయ చరిత్రలో స్పష్టంగా వ్రాశారు.

కృష్ణా పత్రిక ఆవిర్భావం
ఇరవయ్యో శతాబ్ది ఆరంభంలో, జాతిని చైతన్యవంతం చేయడానికి అనేక రంగాలలో కృషి జరుగుతున్న రోజులవి. మచిలీపట్నంలో న్యాయవాద వృత్తిలో ఉన్న శ్రీ వెంకటప్పయ్య 1902లో శ్రీ దాసు నారాయణరావుతో కలిసి ’’కృష్ణా పత్రిక” ప్రచురణను ప్రారంభించారు. 1905 వరకు ఆయనే ఆ పత్రికను నడిపారు. కృష్ణా మండలం నుంచి గుంటూరు జిల్లాను వేరు చేసిన తరువాత ఆ జిల్లాకు వేరే న్యాయస్థానం రావడంతో, వెంకటప్పయ్య తన స్వస్థలం గుంటూరుకు వచ్చేశారు. తాను గుంటూరులో స్థిరపడ్డ తర్వాత కృష్ణా పత్రిక సంపాదకత్వ బాధ్యతలను శ్రీ ముట్నూరు కృష్ణారావుకు అప్పగించారు.

దాత
న్యాయవాద వృత్తిలో వెంకటప్పయ్య కేవలం ధనార్జనే ప్రధానంగా పెట్టుకోలేదు. దాన, ధర్మాల కోసం సొంత ఆస్తినే అమ్ముకొనవలసి వచ్చింది. ఉన్నవ దంపతులు స్థాపించిన శారదా నికేతన్‍కి వెంకటప్పయ్య తన ఆస్తి నుంచి కొంత భాగం అమ్మి పదివేల రూపాయల విరాళం ప్రకటించారు.1910లో బందరులో జాతీయ కళాశాల శ్రీ వెంకటప్పయ్య చేతులమీదుగా ప్రారంభమయ్యింది. తన శిష్యుడు స్వామి సీతారాం కావూరులో స్థాపించిన వినయాశ్రమానికి భారీగా విరాళం ఇచ్చారు. ఇలాంటి దానాలు ఇంకా ఎన్నో చేశారు.

ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు ప్రతిపాదన
1912 మే నెలలో కృష్ణా, గుంటూరు జిల్లాల రాజకీయ మహాసభ నిడదవోలులో జరిగింది. అప్పటికి పశ్చిమ గోదావరి జిల్లాలేదు. కొవ్వూరు నుంచి బెజవాడ వరకూ అంటే కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు కలిపి కృష్ణా జిల్లాయే అన్నమాట. ఆ సభలోనే కొండా వెంకటప్పయ్య సలహాపై ఉన్నవ లక్ష్మీనారాయణ మొదలగు గుంటూరు యువకులు పదకొండు తెలుగు జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలనే విషయంలో మంతనాలు జరిపారు.1913లో గుంటూరు జిల్లా రాజకీయ మహాసభ బాపట్లలో జరిగింది. అదే ప్రదేశంలో కొండా వెంకటప్పయ్య సలహా మేరకు మొదటి ఆంధ్ర మహాసభ బి.ఎస్.శర్మ అధ్యక్షతన జరిగింది. ఈ విషయమై దేశవ్యాప్త ప్రచారం కోసం ఏర్పడిన కార్యనిర్వాహక కమిటీలో కొండా వెంకటప్పయ్యదే ప్రధాన పాత్ర. నెల్లూరులో జరిగిన ఆంధ్ర మహాసభకు ఆయనే అధ్యక్షుడిగా ఎన్నికై ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి ఒక నిర్దిష్ట కార్యక్రమం రూపొందించారు. 1917లో రాజ్యాంగ సంస్కరణల విషయమై పరిశీలనలు జరపడానికి మాంటేగ్ – చమ్స్‍ఫర్డ్ ప్రతినిధి వర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ ప్రతినిధివర్గం మద్రాసుకు వచ్చినప్పుడు భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన అవసరాన్ని ఉగ్గడించిన ఆంధ్ర ప్రతినిధులలో కొండా వెంకటప్పయ్య ముఖ్యులు.

1918లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ ఏర్పడింది. రాష్ట్ర సాధనా ప్రక్రియలో ఇది తొలివిజయమని చెప్పాలి. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీకి తొలి కార్యదర్శి శ్రీ వెంకటప్పయ్యే. ఆ రోజుల్లో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలు కలసి ఒకే నియోజక వర్గంగా ఉండేది. ఓటర్లు అంతా కలిపితే 500 మంది మాత్రమే. ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేసి కొండా వెంకటప్పయ్య మద్రాసు కౌన్సిలుకు ఎన్నికయ్యారు. సహాయ నిరాకరణోద్యమం కొనసాగించడానికి వీలుగా కాంగ్రెసు పార్టీ తన సభ్యుల రాజీనామా కోరగానే రెండవ ఆలోచన లేకుండా తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నిస్వార్థ నాయకుడు శ్రీ కొండా వెంకటప్పయ్య. ఆ తరువాత ఆయన ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడై భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడయ్యారు.

1921 మార్చి 31, ఏప్రిల్ 1 తేదీలలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు బెజవాడలో జరిగాయి. మహాత్ముని ఆంధ్ర పర్యటన వెంకటప్పయ్య ఆధ్వర్యంలోనే జరిగింది. వేలాది రూపాయలు విరాళాలుగా స్వీకరించి స్వరాజ్యనిధికి సమర్పించారు శ్రీ వెంకటప్పయ్య. పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యంలో పాల్గొన్నందుకుగానూ ఆయన మొదటిసారి జైలు శిక్ష అనుభవించారు.

అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా…
1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు చారిత్రాత్మకమైనవి. సహాయనిరాకరణ, శాసనోల్లంఘనల అనంతరం శాసనసభా ప్రవేశ వాదులకు, బహిష్కరణ వాదులకు మధ్య తీవ్ర చర్చలు జురుగుతున్న రోజులవి. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన దేశబంధు చిత్తరంజన్ దాస్ ఈ విభేదాల మధ్య తన పదవికి రాజీనామా చేశారు. మధ్యే మార్గంగా వెంకటప్పయ్యని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆంధ్రరత్న శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి అయ్యారు. స్వల్పకాలమే అయినా అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయాన్ని బెజవాడకు తరలించారు. ఇది ఆంధ్ర రాజకీయ చరిత్రలో స్వర్ణ ఘట్టం. ఆ రోజుల్లో గాంధీజీ తలపెట్టిన ప్రతి ఉద్యమానికీ కొండా వెంకటప్పయ్యే నాయకత్వం వహించేవారు. ఆంధ్ర ఖద్దరుకి యావద్దేశ ప్రచారం లభించడానికి కొండా వెంకటప్పయ్య కృషి ప్రధానమైనది.

1933లో గాంధీజీ ఆంధ్రలో హరిజన యాత్ర సాగించారు. అనేక గ్రామాలలో హరిజనులచేత దేవాలయ ప్రవేశం చేయించారు. ఆంధ్రదేశంలో 65 వేల రూపాయలు హరిజన నిధి వసూలైంది. ఒక వంక భార్య పక్షవాతంతో బాధపడుతూ మృత్యుశయ్యపై ఉన్నప్పటికీ కొండా వెంకటప్పయ్య హరిజన సేవలో నిమగ్నుడై తిరుగుతున్నాడని మహాత్మాగాంధీ అన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడుగా…
1929లో సైమన్ కమిషన్ రాక సందర్భంలోనూ, 1930లో ఉప్పు సత్యాగ్రహంలోనూ, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నందుకు కొండా వెంకటప్పయ్యకు జైలు శిక్షలు విధించారు. 1937లో జరిగిన ఎన్నికల్లో ఆయన మద్రాసు శాసన సభకు ఎన్నికయ్యారు. భాషా ప్రాతిపదికన మద్రాసు రాష్ట్రాన్ని ఆంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలుగా విభిజించాలని కొండా వెంకటప్పయ్య శాసన సభలో ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా నెగ్గింది. ఆంధ్రరాష్ట్ర ఉద్యమం ఆరంభకుడిగా 1920 నుంచి 1949లో తాను కీర్తిశేషుడయ్యే వరకూ ఆంధ్రదేశమే తానుగా వ్యవహరించి ఆంధ్రుల అభిమానానికి పాత్రుడైన మహానాయకుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య. ఆంధ్ర రాజకీయాలలో ఆయన స్థానం దేశ రాజకీయలలో మదనమోహన మాలవ్యా స్థానం లాంటిది. కాంగ్రెస్ అగ్రనాయకులందరూ దేశ భక్త కొండా వెంకటప్పయ్యను గౌరవించేవారు.

ఏమైనా “దేశభక్త ” కొండా వెంకటప్పయ్య అఖిల భారత రాజకీయలలో తన ప్రతిభకు, త్యాగానికి తగిన స్థానం పొందలేకపోయారు. 1938లో మద్రాసు రాష్ట్రంలో రాజాజీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్ర శాసన సభా కాంగ్రెస్ పక్షంలో ముగ్గురు కార్యదర్శులలో ఒకరుగా ఆయనను నియమించి ఆయన త్యాగాలకు ఆ విధంగా విలువకట్టారు. ఆయన ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సభకు కూడా అధ్యక్షునిగా పనిచేశారు. అఖిల భారత చరఖా సంఘానికి జీవిత కాల సభ్యునిగా ఉన్నారు. గ్రంథాలయోద్యమానికె కూడా తోడ్పడ్డారు. ఆయన స్వరాజ్య పోరాటంలో ఉండగా ఆయన సతీమణి మరణించారు.

రచనలు
శ్రీ కొండా వెంకటప్పయ్య కడలూరు జైలులో ఉన్నప్పుడు “డచ్ రిపబ్లిక్” అనే గ్రంథాన్ని రచించారు. తన స్వీయ చరిత్రను రెండు భాగాలుగా వ్రాశారు. “శ్రీ వేంకటేశ్వర సేవానంద లహరి” అన్న భక్తి రసభరిత శతకాన్ని, ఆధునిక ‘రాజ్యాంగ సంస్థలు’ అనే పుస్తకాన్ని రచించాడు. ఆంగ్లంలోనూ, తెలుగులోనూ అనర్గళంగా ప్రసంగించగలిగిన అద్భుతమైన వక్త, కవి శ్రీ కొండా వెంకటప్పయ్య. ఆయనకు మొదటి నుంచీ నాటకాలంటే చాలా మక్కువ. అనేక నాటకాలలో స్త్రీ పాత్రను పోషించి ప్రేక్షకుల మన్ననలను పొందారు.

మరణం
‘ఏ వ్యక్తి జీవితమూ పూర్తిగా ఆనందంతోనూ ఉండదు. అలా అని పూర్తిగా విషాదంతోనే సాగదు’ అంటూ వెంకటప్పయ్య గారి స్వీయ చరిత్ర ఆరంభమవుతుంది. ఆయన కళ్లెదుటే ఆయన కుమారులు ఇద్దరు కన్నుమూశారు.

1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. 1949లో  దేశమంతా ఆగస్టు 15 వేడుకలలో మునిగి ఉండగా, అదే రోజు కళాదృష్టితో, కళాతృష్ణతో, మానవతవాదిగా, దేశభక్తుడుగా జీవితాంతం కృషి చేసిన నిరాడంబరమూర్తి శ్రీ కొండా వెంకటప్పయ్య ప్రాణం అనంత స్వేచ్ఛావాయువులలో కలసిపోయింది. తెలుగువారందరూ సదా స్మరించుకోవాల్సిన నిరాడంబర సేవామూర్తి శ్రీ కొండా వెంకటప్పయ్య. భారత్ మాతాకీ జయ్.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి - VSK (ap)

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top