జాతీయవాది - విచ్చిన్నకరవాదికి గల వ్యత్యాసం | Difference between nationalist and separatist

Vishwa Bhaarath
0
జాతీయవాదికి - విచ్చిన్నకరవాదికి గల వ్యత్యాసం | Difference between nationalist and separatist
జాతీయవాది - విచ్చిన్నకరవాది

56 అం‌గుళాల ఛాతీ అంటూ చూపినా, ఆ గుండె నిండా జాతీయవాదం. మాట నిండా మట్టివాసన. పురాణ పురుషులంటే మైమరచిపోతారు. చరిత్రపురుషులంటే పరవశిస్తారు. నరేంద్ర మోదీకి కుటుంబం లేదు అని ఓ విపక్ష నేత అంటే, కొన్ని గంటలలోనే ఇటలీ ప్రధాని మెలోనీ నుంచి సహా మేమంతా మోదీ కుటుంబీకులమే అంటూ లక్షలలో ట్వీట్లు వచ్చాయి. 
    గోడల మీద పోస్టర్లు వెలిశాయి. మోదీ అంటే భారతీయులకు ఉన్న గురి అలాంటిది. నామినేషన్‌ ‌సమర్పణకు కొన్ని గంటలు మాత్రమే గడువు మిగిలిన ఉన్న తరుణంలో మొత్తానికి కాంగ్రెస్‌ ‌నాయకుడు రాహుల్‌ ‌గాంధీ ధైర్యం చేసి రాయ బరేలీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. రాహుల్‌ ‌తాతగారు ఫిరోజ్‌ ‌గాంధీ అక్కడి నుంచే 1952, 1962 ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు. తరువాత వరసగా ఆ కుటుంబీకులే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్‌. ఆ ‌విధంగా కుటుంబం పేరు చెబితే తప్ప మనుగడ లేదన్న సంగతిని ఆయనే ప్రకటించినట్టయింది. పక్కనే అమేఠీ. ఇదీ కాంగ్రెస్‌ ‌కంచుకోటే. కానీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతీ ఇరానీ 2019 ఎన్నికలలో కంచుకోటలో రాహుల్‌ని ఖంగు తినిపించారు. కేరళలోని వయనాడ్‌ ‌నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు కాబట్టి రాహుల్‌ ‌లోక్‌సభలో అడుగుపెట్టారు. ఇప్పుడు వయనాడ్‌లో పరాజయ ఘంటికలు కర్ణభేరీలు పగిలే స్థాయిలో వినిపిస్తూ ఉండడంతో మళ్లీ అమేఠీని ఆశ్రయిస్తున్నారు.

అంటే ఇది వయనాడ్‌ ‌పోలింగ్‌ ‌సరళిని చూశాక జరిగిన నిర్ణయమే. రాహుల్‌ ‌నిర్ణయా లను, ప్రకటనలను భరించలేక ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతుంటే జరిగిన మరొక వింత నిర్ణయం నామినేషన్‌ ‌గడువు గంటలలో ముగుస్తుండగా నిర్ణయం ప్రకటించడం. భారత రాజకీయాలలో ఏ నాయకుడు ఈ రీతిలో ప్రవర్తించి ఉండడు. కానీ రాహుల్‌ ‌భారత రాజకీయాలలో నరేంద్ర మోదీకి ప్రత్యర్థి అన్న ఒక కల్పన  చేయడానికి  పదేళ్లుగా ప్రయత్నం సాగుతోంది. ఆ ప్రయత్నం ప్రతి అడుగు లోను విఫలమవుతూనే ఉంది. అయినా మోదీ పక్కన రాహుల్‌ను నిలబెట్టే పని కొందరు పత్రికా రచయి తలు, కాంగ్రెస్‌ ‌తైనాతీలు, విపక్షాలు చేస్తున్నాయి.

‘గడచిన 23 సంవత్సరాలలో ఒక్క సెలవు కూడా తీసుకోకుండా దేశం కోసం పనిచేసిన వారు నరేంద్ర మోదీ. రాహుల్‌ ‌గాంధీ ప్రతి వేసవికి విశ్రాంతి కోసం వెళతారు. ఆ ఇద్దరికి మధ్య అసలు పోలిక ఏమిటి?’ ఈ ఏప్రిల్‌ ‌మాసంలోనే బెంగళూరులో జరిగిన కర్ణాటక శక్తికేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా అన్నమాటలివి. 18వ లోక్‌సభ ఎన్నికలు మోదీ, రాహుల్‌ ‌మధ్య పోరుగా కొన్ని టీవీ చానళ్లు, ప్రతిపక్ష నాయకులు అభివర్ణిస్తున్నారు. ఇది  అసంబద్ధం. మోదీని అభిమానించవచ్చు. లేదా విమర్శించవచ్చు. రాహుల్‌ ‌విషయమూ అంతే. ఆ ఇద్దరి మధ్య పోలిక అంటే ప్రజామోదం, దేశం కోసం కష్టపడే తత్త్వం, దేశం పట్ల, భారతీయత పట్ల ఆ ఇద్దరికీ ఉన్న దృష్టిని ఆవిష్కరించాలి. దానికి వాస్తవికత కావాలి. లేకపోతే, కష్టించే తత్త్వం, దేశం పట్ల ఉన్న దృక్పథం విషయంలో మోదీ పట్ల జాతీయంగా అంతర్జాతీయంగా స్థిరపడిన అభిప్రా యంతో  పలచనైపోయేది రాహులే. మోదీ మీద ప్రజలలో ఉన్న అభిప్రాయం ఏమిటి? వారంలో ఏడు రోజులు, 24 గంటలు కష్టించే నేత. కొన్నిచోట్ల ఆయన విఫలమైనట్టు విమర్శలు రావచ్చు. కానీ సమస్యను పరిష్కరించాలన్న సంకల్పం కనిపిస్తుంది. రాహుల్‌, ‌సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, అలాంటి ప్రయత్నాన్ని ఎద్దేవా చేస్తారని పేరు. మోదీ స్థాయికి రాహుల్‌ ఎదగవలసి ఉంది. ఇది నిజం.

మోదీ ఈ దేశానికి రక్ష అని సాధారణ ప్రజలు అంటున్నారు. మోదీ ఈజ్‌ ‌బాస్‌ అని ఒక విదేశ నేత పెద్ద సభలోనే అన్నారు. అయోధ్య ఆలయ నిర్మాణం తన కీర్తికీ, పార్టీ ప్రతిష్ఠకీ ఎంత ఉపయో గమో తూకం వేసినట్టు ఊహించారాయన. కరోనాలో మోదీ ఏమీ చేయలేదు అంది విపక్షం. కానీ అంతటి కల్లోలంలోను మోదీ వల్లనే దేశం నిలబడిందని సాధారణ ప్రజలు అన్నారు. ఒక్క పేలుడు కూడా దేశంలో జరగలేదంటే మోదీ వల్లనే అనేవారు ఎందరో! ఒక వ్యక్తి ఘనతని కుటుంబంతో వచ్చిన కీర్తి, ప్లాటినమ్‌ ‌చెమ్చా నోట్లో పెట్టుకుని పుట్టడం వంటి కొలమానాలతో అంచనా వేయడం ప్రజా స్వామ్యంలో కుదరని పని.

 నిజానికి ఇది ఇండీ కూటమికీ, బీజేపీకి మధ్య పోటీ అనడమే అసంబద్ధం. ఇండీ కూటమి అవినీతిపరులుకు చిరునామా. కుటుంబ పాలకుల అడ్డా. మెజారిటీ ప్రజల మనోభావాలను నిరంతరం కించపరిచే ప్రజాస్వామ్య  ద్వేషుల కూటమి. వీరికైనా రాహుల్‌ ‌మీద నమ్మకం ఉందా? చెప్పలేం! ఏదో ఒకనాడు మోదీ భారత రాజకీయ యవనిక నుంచి నిష్క్రమించడం అనివార్యం కాబట్టి ఆ క్రమంలో మోదీ స్థానంలో రాహుల్‌ను నిలబెట్టే దింపుడు కల్లం ఆశ కాంగ్రెస్‌లో మాత్రమే నిండుగా ఉంది. బీజేపీ బలహీనపడితే ఆ స్థానం కాంగ్రెస్‌కే దక్కడం, అప్పుడు రాహుల్‌ ‌మాత్రమే ప్రధాని కావడం సహజ పరిణామాలని ఆ పార్టీ నమ్ముతున్నది.

నెహ్రూ, ఇందిర, రాజీవ్‌, ‌మన్మోహన్‌సింగ్‌ ‌ప్రభుత్వాల మీద అనేక ఘోర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కానీ 23 ఏళ్లుగా అటు గుజరాత్‌ ‌ముఖ్య మంత్రిగా, ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మోదీ మీద ఏ ఒక్క విపక్షం అవినీతి ఆరోపణలు చేయలేక పోయింది. దేశంలో బీజేపీ ప్రభుత్వం సృష్టించిన చరిత్ర ఇది. అటల్‌ ‌బిహారీ వాజపేయి నాయకత్వంలో ఏర్పడిన తొలి బీజేపీ ప్రభుత్వాల మీద కూడా ఎవరూ ఆరోపణలు చేయలేకపోయారు. కొన్ని ఆరోపణలు వచ్చినా ఎన్‌డీఏ భాగస్వాముల మీద వచ్చాయి. కాంగ్రెస్‌ ‌హయాంలో జరిగిన స్కామ్‌ల గురించి చర్చించాలంటే మహాగ్రంథం కావాలి. నెహ్రూ హయాం నాటి జీపుల కొనుగోలు అవకతవకలు మొదలు, నగర్వాలా, బొఫోర్స్, ‌టూజీ, ఆసియాడ్‌ ‌క్రీడోత్సవం అవకతవకలు ఎన్నో! ఒక్క సోనియా- మన్మోహన్‌ ‌సింగ్‌ ‌హయాంలోనే 12 లక్షల కోట్లు యూపీఏ దోచేసిందని అమిత్‌ ‌షా ఆరోపించారు. ఇండీ కూటమిలోని డీఎంకే పెద్ద అవినీతి అనకొండ. లాలూ ప్రసాద్‌ అం‌తకంటే తక్కువేమీ కాదు. సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఆప్‌-ఏ ‌భాగస్వామిని చూసినా అవినీతిలో రికార్డులు సృష్టించినదే. వీళ్లంతా జైలులో లేదా స్టే మీద ఉంటారు.

2013లో గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడే బీజేపీ మోదీని ప్రధాని అభ్యర్థిగా తెర మీదకు తెచ్చింది. ఆ సమయంలోనే సీమా ముస్తాఫా అనే ప్రముఖ జర్నలిస్ట్, ‌రాహుల్‌ను మోదీకి ప్రత్యర్థి స్థానంలో నిలపడం తెలివైన కుట్రగానే వర్ణించారు. మోదీ మంచి వక్త. సాధారణ ప్రజలకు విషయం చేరవేయడంలో దిట్ట. అమోఘమైన విషయపరిజ్ఞానం. మాస్‌ ‌రాజకీయవేత్త. కానీ రాహుల్‌ను ఈ విధంగా చెప్పలేమని, తనను తాను నాయకునిగా జాతీయ అంతర్జాతీయ సమాజాల చేత గుర్తింపు తెచ్చుకోవలసిన అవసరం రాహుల్‌కు ఉందనే సీమ అభిప్రాయపడ్డారు. మోదీ కింది స్థాయి నుంచి ఎదగడం ఒక అంశమైతే, వంశపారంపర్యంగా, కుటుంబ కీర్తి అనే సోపానాలు ఎక్కి రాహుల్‌ ‌పైకి వచ్చారు. మోదీ ప్రధాని కావడా నికి ముందే ఇదే అంశం మీద జరిగిన టీవీ చర్చలో ఒక విద్యార్థి కుండబద్దలు కొట్టి చెప్పిన విషయం ఉంది. మోదీ జనం నుంచి వచ్చిన వారు. ఆయనకు ప్రజల సమస్యలు తెలుసు. వాటికి పరిష్కారాలు తెలుసు. పరిష్కరించడానికి నిర్ణయాలు తీసుకోగలరు. ఆ సామర్ధ్యం ఆయనకు ఉంది. ఎందుకంటే మోదీ నాయకుడు. కానీ రాహుల్‌లో వీటిని ఆశించలేం అన్నాడతడు. ఇదంతా కాంగ్రెస్‌ ‌పార్టీకి ఎప్పుడో అర్ధమైపోయింది కాబట్టే రాహుల్‌ను ఏనాడూ మోదీకి ప్రత్యామ్నాయంగా నిలబెట్టే సాహసం చేయదన్న అభిప్రాయం ఉంది.

మోదీ ఉత్తరాది పార్టీ నేత అని ఒక పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేశారు. కానీ 2018 జనవరిలో లోక్‌నీతి, సీఎస్‌డీఎస్‌ ‌నిర్వహించిన సర్వేలో దక్షిణ భారతదేశంలో కూడా మోదీ హవాయే కనిపించింది. మోదీని ప్రధానిగా మరొకసారి చూడాలన్నవారు భారతదేశం మొత్తం మీద 37 శాతం ఉన్నారు. అదే రాహుల్‌ ‌ప్రధాని కావాలన్నవారు 20 శాతం. మోదీ, రాహుల్‌ ‌పట్ల ఉత్తర భారతం 44 శాతం/ 15 శాతం, దక్షిణ భారతం 24శాతం/ 27 శాతం, తూర్పు భారతం 39 శాతం/15 శాతం, పశ్చిమ భారతం 42 శాతం/27 శాతం కనిపించారు. ఒక్క దక్షిణ భారతంలో మూడు శాతం మినహా మిగిలిన ఎక్కడా రాహుల్‌కు ఆధిక్యం కనపడలేదు. పదేళ్ల క్రితమే ది గార్డియన్‌ ‌పత్రిక కూడా ‘హిందూ జాతీయ వాద పక్షం’ బీజేపీ చేతిలో రాహుల్‌ ‌పరాజయం పాలవుతున్నాడనే జోస్యం చెప్పింది. మోదీని ఓడించా లంటూ సల్మాన్‌ ‌రష్డీ, మరో ఇద్దరు అంతర్జాతీయ ప్రముఖులు ఒక బ్రిటిష్‌ ‌పత్రికలో లేఖ రాశారు.

2013 జనవరిలో అట్టహాసంగా రాహుల్‌ ‌కు ఉపాధ్యక్షపట్టాభిషేకం జరిగింది. అప్పటి నుంచి 2018 వరకు 39 శాసనసభ ఎన్నికలు జరిగాయి. వాటిలో కాంగ్రెస్‌ ‌గెలిచినవి కేవలం 8. 2014 లోక్‌సభ ఎన్నికలలో కేంద్రంలో అధికారం కోల్పో యింది. 282 స్థానాలు బీజేపీ వచ్చాయి. కాంగ్రెస్‌ ‌స్థానాలు 59కి పడిపోయాయి. అలాగే అసెంబ్లీ సమరాలలో కమలం పార్టీ ఘన విజయాలు మూట గట్టుకుంది. 2017లో ఆరు అసెంబ్లీలు కమలం ఖాతాలో చేరాయి.

ఇటలీ మూలాలు ఉన్న సోనియా, ఆమె కుమారుడు రాహుల్‌ ‌కాంగ్రెస్‌లో కీలకంగా మారడం, ఆ పార్టీ ప్రాభవం శరవేగంతో పడిపోవడం ఏకకాలంలో జరిగాయి. 1998 మార్చిలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు సీతారాం కేసరిని అత్యంత అప్రజాస్వామిక పంథాలో పదవి నుంచి తొలగిం చింది. ఆయన చాంబర్‌ ‌వద్ద నేమ్‌ప్లేట్‌ను తొలగించి ‘సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు’ అన్న కంప్యూటర్‌ ‌ప్రింటవుట్‌ను ఆదరాబాదరా అతికించారు. తరువాత 20 ఏళ్లు కాంగ్రెస్‌ ‌పగ్గాలు సోనియా చేతిలో ఉన్నాయి. ఆ శతాధిక సంవత్సరాల రాజకీయ పక్షానికి అత్యధిక కాలం అధ్యక్ష పదవిని నిర్వహించిన వ్యక్తిగా చరిత్రకెక్కారామె. పదేళ్లు కాంగ్రెస్‌ ‌కేంద్రంలో అధికారంలో ఉంది.

2004లో రాహుల్‌ ‌తమ వంశపారంపర్య రాజకీయ వేదిక కాంగ్రెస్‌లో ప్రవేశించారు. ఆ సంవత్సరమే అమేఠీ నుంచి నెగ్గారు. 2007లో పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 2013లో ఉపాధ్యక్షుడు. సోనియా క్రమంగా వెనక్కి తగ్గడం కాంగ్రెస్‌కు రాహుల్‌ ‌పెద్దదిక్కు కావడం అప్పుడే. అనతికాలంలోనే పార్టీకి అధ్యక్షుడయ్యారు. అంతకు ముందు ఆ పదవిలో ఉన్న గాంధీజీ, నెహ్రూ, ఇందిర వంటివారితో చూసుకుంటే రాహుల్‌ అతి పెద్ద వైఫల్యం. ఆఖరికి తమ కుటుంబ రాజకీయాలకు ఆలవాలంగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌ను కూడా కాపాడు కోలేకపోయారు. అమేఠీలో ఓడిపోయారు. ఆయన ఉపాధ్యక్షుడు కావడంతోనే లోక్‌సభలో పార్టీ బలం 44కు పడిపోయింది. ప్రాంతీయ పార్టీలను దేబరించి కొన్ని సీట్లలో పోటీ చేసే దుస్థితికి తెచ్చినది ఆయనే. ఆయన నాయకత్వం కాంగ్రెస్‌కి అస్తిత్వ సమస్యను తెచ్చిపెట్టింది.

రాహుల్‌ ‌పార్లమెంట్‌ ‌సభ్యునిగా 2004 నుంచి పొదుపుగానే బాధ్యతలు నిర్వహించారు. సాధారణ హాజరు ఆయన హాజరును చూసి సిగ్గుపడేది. దీనితోనే బీజేపీయే కాకుండా, ఒక వర్గం మీడియా కూడా ఆయన రాజకీయాలను పట్టించుకోవలసి నంతగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాన్ని ప్రకటించాయి. సభ బయట కూడా ప్రజా సమస్యల కంటే తన కుటుంబ త్యాగాల గురించి ఊదరగొట్టడా నికే ప్రాధాన్యం ఇస్తారు. లేదంటే విదేశాలకు వెళ్లి, అక్కడి విశ్వవిద్యాలయాలలో భారతీయ ముస్లింలకు రక్షణ లేదని, దళితులకు గౌరవం లేదని భారత వ్యతిరేక ప్రచారం చేస్తారు. ఇక్కడేమో పార్టీ సీనియర్లు మోదీ గుజరాత్‌ ‌వెళ్లి టీ అమ్ముకుంటే మంచిదని ప్రకటనలు ఇచ్చి బీజేపీ గెలుపునకు దోహదం చేస్తారు.

ఈ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ ‌దానికి తగ్గ స్థాయిలో విజయాలు సాధించలేకపోతే రాహుల్‌ ఇక పార్టీ వ్యవహారాల నుంచి నిష్క్రమించడం గురించి గట్టిగా ఆలోచించాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిశోర్‌ (‌పీకే) చక్కని సలహా ఇచ్చారు. ఏప్రిల్‌ 8‌న పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ కిశోర్‌, ఈ ‌పదేళ్ల పని తీరును ఆయనే సమీక్షించుకుని స్వయంగా పక్కకి తప్పుకోవడం, వేరొకరికి పగ్గాలు అప్పగించడం గురించి యోచించాలని అన్నారు. లేకపోతే వేరే వారే ఆ పని చేస్తారన్న హెచ్చరిక కూడా ఇందులో లేకపోలేదు. పదేళ్లుగా అదే పని చేస్తూ ఒక్క విజయం కూడా నమోదు చేయకపోతే విశ్రాంతి తీసుకోవడం వల్ల భారత రాజకీయాలకి ఎలాంటి ప్రమాదం రాదని పీకే తేల్చి చెప్పారు. 1991లో రాజీవ్‌ ‌హత్య తరువాత తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుని సోనియా గాంధీ పీవీ నరసింహారావుకు పార్టీ పగ్గాలు అప్పగించిన సంగతిని పీకే గుర్తు చేశారు. 2019 ఎన్నికలలో పార్టీ ఓటమి దృష్ట్యా తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించి, ఆ బాధ్యతలు కుటుంబానికి అవతలి వారు ఎవరు నిర్వహించినా తాను వెనక ఉంటానని ప్రకటించారు కానీ, అది ఆచరణలో  చూపించలేదు. ఈ పరిణామం తరువాత కూడా పార్టీ నాయకులు చెబుతున్నది ఒక్కటే. తాము ఏ ఒక్క నిర్ణయం తీసుకోలేం. ఒక సీటు లేదా పొత్తు అయినా అంతే. దేనికైనా ఎక్స్‌వైజడ్‌ అనుమతి పొందవలసిందే అంటున్నారు. ఆ ఎక్స్‌వైజడ్‌ ఎవరో తెలియనిది కాదు. ప్రధాన ప్రతిపక్షం నిర్మాణ లేదా వ్యవస్థాపరమైన లోపాలతో బాధపడుతోందనే కిశోర్‌ ‌చెబుతున్నారు. అలా అని ఆ పార్టీ కాలగర్భంలో కలసి పోతుందన్న అభిప్రాయంతో కూడా కిశోర్‌ ఏకీభవించడం లేదు. భారత్‌లో ప్రతిపక్షం అన్న స్థానాన్ని భర్తీ చేయవలసి వస్తే అది కాంగ్రెస్‌ ‌ద్వారానే సాధ్యమని అంటారు. కిశోర్‌ ఇం‌త నిశితంగా చెప్పడానికి కారణం ఉంది. పోనీ విపక్షంగా కాంగ్రెస్‌ ‌భర్తీ చేయలేకపోతున్న స్థానాన్ని ఆమ్‌ ఆద్మీ పార్టీ భర్తీ చేస్తుందనుకున్నా, ముఖ్యంగా జాతీయ స్థాయి విపక్షం కాగలదని ఊహించినా  పప్పులో కాలేసినట్టే నని ఆయన చెబుతున్నారు. ఆప్‌కు అటు సైద్ధాంతిక మూలాలు కానీ, ఇటు సంస్థాగతమైన మూలాలు గాని లేనేలేవని, ఇదే ఆ పార్టీకి పెద్ద బలహీనత అని తాను అభిప్రాయపడుతున్నానని ఆయన చెప్పారు. ఇంటిపేరును బట్టి రాజకీయాలలో చెలా మణి కావడం స్వాతంత్య్రం తొలి రోజులలో సాధ్య మైంది తప్ప, ఇప్పుడు ఇంటిపేరే వారికి భారంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఒక్క రాహుల్‌ అనే కాదు, ఇంటి పేరు విషయంలో అఖిలేశ్‌, ‌తేజస్వీ యాదవ్‌ ‌వంటివారిది కూడా ఇదే సమస్య అని, ఆ ఇంటి పేరును, వారసత్వాన్ని పార్టీ శ్రేణులు శిరోధా ర్యంగా భావిస్తున్నా, సాధారణ ప్రజానీకం ఆమోదిం చడం లేదనే ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌స్పష్టం చేశారు.

ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ ‌నేతలు, శ్రేణులు మౌనంగాను, ప్రజాస్వామ్య ప్రియులు చిదంబర రహస్యం మాదిరిగాను కాంగ్రెస్‌ను పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య ఏమిటో వ్యక్తీకరిస్తున్నారు. ఆ సమస్య రాహుల్‌ ‌గాంధీయే. ఆయన నరేంద్ర మోదీ వంటి ప్రత్యర్థితో పోరాడడానికి కావలసిన ప్రణాళి కను సిద్ధం చేయగలిగిన స్థితిలో లేరు. రాహుల్‌కు కాంగ్రెస్‌ ‌పగ్గాలు అప్పగించినప్పటి నుంచి ఆయన దేశంలో ఒక కీలకనేత, భారతీయ సమాజం అనివార్యంగా మోయవలసిన నాయకుడు అని చిత్రించడానికి కాంగ్రెస్‌ అవకాశం కోసం ఎదురు చూస్తున్నది. అది జరగడం లేదు, జరగదు. కేవలం సెక్యులరిజం గురించి, హిందూత్వకు వ్యతిరేకం గాను, సామాజిక న్యాయం అంటూ గొంతు చించుకుంటే మోదీని ఇంటికి పంపవచ్చునన్న చిలిపి ఊహతో మాత్రమే రాహుల్‌ ‌రాజకీయాలు నడుపుతు న్నారు. రాహుల్‌  ‌నాయకత్వంలో కాంగ్రెస్‌లో ప్రతిపక్ష పాత్ర  నిర్వర్తించే లక్షణం కూడా చచ్చిపోయింది. పార్లమెంట్‌ ‌సమావేశాలు, రాష్ట్రాల ఎన్నికలు, దేశంలో కనిపిస్తున్న అలజడి, సొంత పార్టీలో సంక్షోభం ఇవేమీ ఆయన విదేశీ యాత్రలకీ, పుట్టిన రోజు వేడుకలకీ, విహారయాత్రలకీ అడ్డురావు.

రాహుల్‌ ‌నాయకత్వ లక్షణాలు ఇప్పటికీ సందేహాస్పదమేనని ప్రముఖ ఆర్థికవేత్త సుర్జిత్‌ ‌భల్లా (ఆర్థిక సలహామండలి మాజీ సభ్యుడు) అంటారు. సంపద పంపిణీ అన్న విషయాన్ని సమర్ధిస్తూనే రాహుల్‌ ‌నాయకత్వం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు భల్లా. నాయకత్వమంటే చాలా పెద్ద విషయం. కానీ 2013లో తన పార్టీ ప్రధాని ఎదుటే ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను పరపరా చింపేసిన ఘనత రాహుల్‌కు ఉందని గుర్తు చేశారు. నాయకత్వ లక్షణాలు ఉన్నవారు అలాంటి పనిచేయరనే భల్లా అన్నారు. ఇప్పటి ఎన్నికలు 2014 ముందు జరిగిన ఎన్నికల మాదిరిగా కాకుండా ప్రతిభ ఆధారంగా జరుగుతున్నాయని అన్నారు. ప్రతిపక్షంలో (ప్రధానిగా) చెప్పుకోదగిన వ్యక్తి ఎవరు? నాకు మాత్రం ఎవరూ కనిపించడం లేదనే అన్నారు భల్లా. కానీ బీజేపీ వారు మోదీని చూపుతున్నారు. కాబట్టి ఆ పార్టీ విజయం సాధిస్తుంది అన్నారు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు ఎగ్జికూటివ్‌ ‌డైరెక్టర్‌గా కూడా పనిచేసిన భల్లా.

jagruti

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top