హిందువులను ఏదో ఒక విధంగా మతమార్పిడి చేసేందుకు అన్య మతాల వారు ఎన్ని విధాలుగా అక్రమాలకు పాల్పడతారనేదానికి ఘట్కేసర్లో రవికుమార్, శిరీషల ఆత్మహత్య కేసు పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. స్నేహం ముసుగులో పరిచయం పెంచుకుని తమ మతంలోకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తారు. అది వ్యాపారం కావచ్చు, రోగాలు నయం చేయడమనే సాకు కావచ్చు, ఇతరత్రా ఇంకేవైనా కావచ్చు. ఈ కేసును సమగ్రంగా పరిశీలిస్తే...
ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో రవికుమార్, శిరీష దంపతులు జులై 02, గురువారం రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన ఉదంతంలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు పిల్లలతో బియ్యం వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న ఆ కుటుంబాన్ని.. పక్కింటి వెంకట్, ప్రమీల దంపతులే ఆర్థికంగా, మానసికంగా వేధించి ఆత్మహత్యకు పురిగొల్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మతం మారాలంటూ నిందితులు చేసిన తీవ్ర ఒత్తిడి, ఆపై వ్యాపారం పేరుతో రెడీ మిక్స్ వాహనం కొనేందుకు రూ. 20 లక్షలు వసూలు చేసి మోసగించడమే రవికుమార్, శిరీషల మరణానికి కారణమని పోలీసులు తమ దర్యాప్తులో నిర్ధారించారు. మృతుల కుమారులు సుశాంత్, విద్వాన్స్ సహా శిరీష తల్లిదండ్రుల నుంచి సేకరించిన వివరాలతో ఈ ఘాతుకం బయటపడింది.
మతమార్పిడి కోసం తీవ్రంగా ఒత్తిళ్ళు
ఆత్మహత్య చేసుకున్న రవికుమార్, శిరీషలకు తమ పొరుగున ఉండే వెంకట్, ప్రమీల దంపతులతో మంచి స్నేహం ఉండేది. అయితే, ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని వెంకట్ దంపతులు వీరిపై మత మార్పిడి కోసం ఒత్తిడి తేవడం ప్రారంభించారు. ప్రతి ఆదివారం చర్చికి రావాలంటూ బలవంతం చేసేవారు. వారిని కాదనలేని రవికుమార్ భార్య శిరీషతో కలిసి కొన్నిసార్లు ప్రార్థనలకు వెళ్లినప్పటికీ.. మొత్తంగా మతం మారడం తమకు ఇష్టం లేదని శిరీష ఖచ్చితంగా చెప్పేసింది. ఈ విషయమై రవికుమార్, శిరీషల మధ్య కొన్నిసార్లు గొడవలు కూడా జరిగాయి.
కొత్త స్కీమ్‌తో నమ్మించి ముంచిన తీరు
క్రైస్తవంలోకి మతం మారేందుకు శిరీష అంగీకరించకపోవడంతో వెంకట్, ప్రమీల దంపతులు మరో స్కీమ్ వేశారు. రెడీమిక్స్ కాంక్రీట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయని రవికుమార్ దంపతులను నమ్మించారు. మతం మారకపోయినా వ్యాపారంలోనైనా వారితో కలుద్దామని భావించిన రవికుమార్.. భార్య బంగారు నగలను బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 20 లక్షల నగదు తెచ్చి వెంకట్‌కు ఇచ్చారు. ఆ డబ్బుతో ఒక రెడీమిక్స్ వాహనం కొన్నారు. వ్యాపార ఒప్పందం ప్రకారం నెలకు రూ. 20 వేలు రవికుమార్కి ఇస్తామని చెప్పి, రెండు మూడు నెలలు మాత్రమే ఇచ్చి ఆ తర్వాత వెంకట్ నిలిపివేశాడు. ఒకవైపు బ్యాంకు వడ్డీలు పెరిగిపోతుండటం, మరోవైపు ఇస్తామన్న పైసలు వెంకట్ నుంచి రాకపోవడంతో రవికుమార్ దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
ఆగని వేధింపులు.. చివరకు ఆత్మహత్య!
అన్ని విధాలుగా వెంటాడి వేధించిన వెంకట్, ప్రమీల ఒత్తిళ్ళు, వేధింపులు తట్టుకోలేక రవికుమార్, శిరీష దంపతులు తమ సొంత ఇల్లు ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లాలని నిశ్చయించుకుని, సామాన్లు కూడా సర్దుకున్నారు. అయితే, జూలై 2వ తేదీ సాయంత్రం ఘట్కేసర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న దంపతులు.. ఆత్మహత్యకు ముందు కూడా నిందితుడు వెంకట్‌తో ఫోన్లో ఎంతోసేపు మాట్లాడినట్లు పోలీసుల కాల్ డేటా ద్వారా తెలిసింది. ఆ ఫోన్ కాల్ ముగిసిన వెంటనే తీవ్ర మనస్తాపానికి గురైన రవికుమార్, శిరీష పరస్పరం హత్తుకుని రైలు కింద పడి ప్రాణాలు విడిచారు. కాగా, దంపతుల మరణవార్త తెలియగానే నిందితులు వెంకట్, ప్రమీల తమ ఇంటికి తాళం వేసి పారిపోయారు. పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు తీవ్రం చేశారు.

