"హిందుత్వమనేది ఒక పూజాపద్ధతి కాదు": డా. మోహన్ భాగవత్ జీ - రెండవ రోజు ఉపన్యాసము - Hindutva is not a ritual

Vishwa Bhaarath
డా. మోహన్ భాగవత్ జీ
డా. మోహన్ భాగవత్ జీ
హిందుత్వమనేది ఒక పూజాపద్ధతి కాదు!
హిందూ పరంపరలో ఇలా ఎన్నో మార్పులు వచ్చాయి. దేవీదేవతలను కూడా మార్చుకున్నారు. కొత్తకొత్త సంప్రదాయాలు, పూజాపద్దతులు వచ్చాయి. హిందుత్వం కేవలం ఒకే ఒక పూజాపద్ధతిని మాత్రమే సమర్థించేదికాడు. అన్నింటినీ మన్నిస్తుంది. 
   హిందుత్వంలో ఒక ప్రత్యేక భాష, ప్రత్యేక ప్రాంతం అంటూ ప్రత్యేక గుర్తింపు ఉండదు. వ్యక్తి సుఖసంతోషాలతోపాటు సమాజపు బాగోగులు ఒకేసారి సాధించడానికి ఇక్కడ ప్రయత్నం జరిగింది. అందుకనే అర్ధ, కామాలకు కూడా తగిన ప్రాధాన్యం లభించింది. మనకు అనేక కోరికలు ఉంటాయి. అవి తీరితే సుఖం, ఆనందం కలుగుతాయి. అలా కోరికలను. తీర్చుకునేందుకు అర్ధం (డబ్బు) సాధనం అవుతుంది. అందుకనే అది పురుషార్ణం అయింది. అయితే వీటిని అందరితో కలిసి సాధించాలి. నేను బాగుపడితే చాలునని అనుకోకుడదు. నేను బాగుపడడంతోపాటు అందరూ బాగుండాలని ఆకాంక్షించాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగడమే అనుశాసనం. ఈ అనుశాసనాన్నే ధర్మం అన్నాడు.  నిన్న నేను తథాగతుని వాక్యాలు కొన్ని ఉదాహరించాను. 'సబ్బ పాపస్య అకరణం'  (ఇతరులకు కీడు చేయకు)-ఎందుకని ? పాపం ఎందుకు చేయకూడదు ? ఇతరులకు కష్టం ఎందుకు కలిగించకూడదు ? అంటే వాళ్ళు ఇతరులు కారు. వాళ్ళు, నువ్వు ఒకటే కనుక. అందరి మంచిలో నా మేలు, అందరి కోసం నేను అనే సంతులిత ఆలోచన.భావనే హిందుత్వం, భారతదేశంలో పుట్టిన అన్ని మతాల మౌలిక, సామూహిక విలువలే హిందుత్వం, వివిధత్వాన్ని ఇక్కడ మన్నించారు. గౌరవించారు. అదే భారతదేశపు గుర్తింపు  ప్రత్యేకత అయింది. ఇది వైశ్విక ధర్మం. కేవలం భారతదేశానికే పరిమితమైనది కాదు కానీ ఇది భారతదేశంలోనే రూపుదిద్దుకుంది, ఆచరణలోకి వచ్చింది. ప్రవంచానికి ఈ జ్ఞానాన్ని అందించింది కూడా భారతదేశమే.
    వైదిక ఋషుల కాలంలో ఇది జరిగింది. ఈ ఆధ్యాత్మికత సర్వ ప్రపంచానికి  వ్యాపించింది. తథాగతుని తరువాత ప్రపంచమంతటా ధమ్మ ప్రచారం సాగింది. ఇప్పటికీ అనేకమంది సాధుసంతులు, మహానుభావుల ద్వారా ప్రపంచంలో ఈ ధర్మప్రచారం జరుగుతూనే ఉంది. అంతేకానీ వాళ్ళు మతమార్పిడులు చేయరు. ఒకసారి రమణమహర్షి దగరకి పాల్ బ్రంటన్ అనే విదేశస్తుడు వచ్చి తనకు హిందూమతం ఇవ్వవలసిందిగా కోరాడు. "నువ్వు మంచి క్రైస్తవుడిగా ఉండు, అదే అందరికీ మంచిది. నీవు ఉన్న మతంలోనే మంచివానిగా ఉండటంలో జీవన సార్ధక్యముంది". అని రమణమహర్షి సమాధానమిచ్చారు. నువ్వు హిందువుగా మారాల్సిన అవసరం లేదు. ఈ వివిధత్వం గురించి, తత్వజ్ఞానాన్ని గురించి నాకు తెలుసు అని అతనిని సముదాయించారు. రామకృష్ణపరమహంస కూడా ఈ పంథాలన్నింటినీ ఆచరించి, వాటిలోని అంతిమ సత్యాన్ని దర్శించారు. అదే హిందుత్వమని ఆయన ప్రకటించారు. 
    ఈ వివిధత్వం ఉంటుంది. ఈ ప్రత్యేకతలు ఉంటాయి. వాటిని అంగీకరించి, మన్నించాలి. ఈ వివిధత్వం మనమధ్య భేదభావాలకు శత్రుత్వానికి దారితీయకూడదని చెప్పే ఏకైకదేశం భారతదేశం. అలాంటి భారతభూమి సంతానం మనం. మనం హిందుత్వమని దేనిని అంటున్నామో అందులో మౌలిక విలువలు, వాటి నుంచి ఏర్పడిన సంస్కృతి, వీనితోపాటు దేశభక్తిభావన కూడా భాగం. ఇవి భారతదేశపు గుర్తింపు. ఈ దేశం వీటికోసమే ఉన్నది. అందువల్లనే వీటి ఆచరణ ఇక్కడ ప్రాచీనకాలం నుండి సాగుతోంది. అన్ని రకాల పరిస్థితుల్లో అది సాగింది. విదేశీ దురాక్రమణదారుల పదఘట్టనల కింద ఈ భూమి నలిగిపోతున్నప్పుడు కూడా హిందుత్వ విలువల ఆచరణ అలాగే కొనసాగింది. కొద్దిమంది ఇక్కడివారే ఆ విలువలకు నష్టం కలిగించేవిధంగా ప్రవర్తించినప్పుడు మహాపురుషులు ఉద్భవించి ధర్మాచరణను తిరిగి అలవాటు చేశారు. కనుక లక్ష్యం అందరిదీ ఒకటే.

   దేశకాల పరిస్థితులను బట్టి దర్శనాలు, ఆచరణ వేరువేరుగా ఉన్నప్పటికీ మౌలికమైన ఏకత్వాన్ని గుర్తించి కలసి ముందుకు వెళ్ళే స్వభావాన్నే హిందుత్వం అంటున్నాం. ఎవరూ తక్కువకాదు. అందరికీ మంచి జరగాలి. 'మాగ్జిమమ్ గుడ్ ఫర్ మాగ్జిమమ్ పీపుల్'. అనే కల్పన కంటే ముందుకు వెళ్ళి మన పూర్వీకులు 'సర్వే సంతు నిరామయాః' అన్నారు. ఈశ్వరుడు అందరికీ మేలు చేయాలి. భారతదేశంలో ఏ సంప్రదాయం, మతాన్ని చూసినా మనకు ఈ భావనలే కనిపిస్తాయి. దుష్టులు, దుర్మార్గులగురించి కూడా మంచినే కోరుకున్నారు. దుష్టుల్లో దుష్టత్వం తొలగిపోవాలని కోరుకున్నారు. ధర్మం జయించాలి. అని నినదిస్తారు. కానీ ధర్మం జయించాలి, అధర్మం నశించాలి అంటూనే ప్రాణుల్లో సద్భావన ఉండాలని కూడా ఆశిస్తారు. ఈ ఆలోచనా విధానం నేటి ప్రపంచానికి చాలా అవసరం. దీనినే ప్రపంచం కోరుకుంటోంది. ఈ ఆలోచనా విధానాన్ని ఆచరణలో పెట్టే సమాజం ఈ దేశంలో రూపొందాలి. అలాంటి సమాజమే మనందరినీ కలుపుతుంది.  ఏదో ఒక భాష మనల్ని కలుపుతుందా? లేదు. అలాగే ఒకే దేవుడు లేదా దేవత మనను ఏకం చేయగలుగుతారా? లేదు. ఆహారవిహారాలు, ఆచారవ్యవహారాలు మనల్ని ఒకటిగా నిలుపగలుగుతాయా? ఇక్కడ కూడా అనేక జాతులు, ఉపజాతులు, అనేక భాషలు ఉన్నాయి. అయినా మనమంతా ఒకే భారతమాత సంతానం, ఒక వైశ్విక సంస్కృతికి చెందినవారం. ఇలాగే మనం నడుచుకున్నాం.

- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:

రెండవ రోజు ఉపన్యాసం:

మూడవ రోజు ఉపన్యాసం:

భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top