ఆర్.యస్.యస్ సిద్ధాంతము, ఆచరణ - RSS theory and practice

Vishwa Bhaarath
0
ఆర్.యస్.యస్ సిద్ధాంతము, ఆచరణ - RSS theory and practice

ఆర్.యస్.యస్ సిద్ధాంతము, ఆచరణ

ప.ఫూ. డాక్టర్‌ హెడ్గెవార్‌, పుణే 1935 !

సాధారణంగా సిద్దాంతానికీ, ఆచరణకూ ఎంతో తేడా ఉన్నదని అనిపిస్తూ ఉంటుంది. “సిద్దాంతము” అనే మాట వినగానే వ్యక్తి మనస్సు ఎక్కడెక్కడికో ఎగురుతూ పోతుంది. సిద్ధాంతం అంటే నిగూఢము, ఉదాత్తము అయిన కల్పన అని అంతా భావిస్తారు. కాని ఆచరణ అనే మాట వినగానే మనచుట్టూ ఉన్న సంఘటనలు, ఎగుడు దిగుళ్ళు, కోలాహలాలు, వికారాలు, విలాపాలు మనోనేత్రాల ముందు వచ్చి నిలుస్తాయి. ఈ రోజుల్లో సిద్దాంతానికీ, ఆచరణకు ఉన్న తేడా మరీ పెరిగిపోయింది. 
   తాత్విక దృష్టి, శాస్త్రీయ దృక్పథం కేవలం కొద్దిమందికి పరిమితములయిన విషయమనీ, సామాన్య ప్రజలు వాటినిగురించి తల బ్రద్దలు కొట్టుకోకూడదనీ పెద్దలు చెప్పుతూ ఉండడం కద్దు. కాని మనం కొంచెం ఆలోచించి చూచినట్లయితే సిద్ధాంతం ఉపన్యాసాలకు, ఊహావిహారాలకు పరిమితమైన విషయం కాదనీ, అది ఆచరించడానికే ఉద్దేశింపబడిందనీ తెలుస్తుంది. మొదట సిద్ధాంతం ఉదయిస్తుంది; ఆ తర్వాత ఆచరణకు మార్గం దొరుకుతుంది. “ఇంతవరకు సిద్దాంతాన్నిగురించి చెప్పారు; ఇక ఆచరణ గురించి చెప్పండి”- అనే ధోరణిలో మాట్లాడేవారికి వాస్తవానికి సిద్ధాంతం విషయం అర్థం కాలేదని చెప్పవలసివస్తుంది. ఎందువల్లనంటే-ఆచరణకు కొరగాని సిద్దాంతానికి ప్రయోజనం ఏమి ఉంటుంది ? క్రియాశూన్యమైన పదజాలం మాత్రమే అయిన సిద్ధాంతం నిరర్ధకమైనది. వ్యక్తుల ఆచరణను ప్రభావితం చేయలేని సిద్ధాంతం గొడ్రాలు లాంటిదని అనవలసి వస్తుంది. సమాజానికి నిర్దుష్టమైన మార్గాన్ని చూపించే శక్తిలేని సిద్ధాంతం గడ్డిపోచ విలువకూడా చేయదు. వాస్తవానికి ఒక సిద్ధాంతం ఎంత ఉత్సాహంతో, ఎంత అజేయమైన ఆత్మవిశ్వాసంతో స్వీకరించ బడితే దానికి అంత గొప్పదనం వస్తుంది. సిద్ధాంతం ఆచరణలోకి తేవడానికే కాని కేవలం ఊసుబోక కబుర్లు చెప్పడం కోసం కాదు. సిద్ధాంతాలను అనుసరించే ఆచరణ జరుగుతుంది. సిద్ధాంతానికి అనుగుణంగా కొనసాగే జీవనమే కష్టసాధ్యమయిన ధ్యేయమార్గంలో బాటసారికి ఆసరాగా నిలుస్తుంది; అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడుతుంది. సిద్దాంతాన్ని ప్రతిపాదించేవారి జీవితాలలో ఎప్పుడైనా ఎగుడు దిగుడులు వచ్చినప్పటికి, సిద్దాంతం మాత్రం చిరంజీవిగా నిలుస్తుంది.

చాలామందికి సిద్దాంతం ఆచరణ సాధ్యంగా కనపడదు. అడుగడుగునా ఇది మనకు అనుభవంలోనికి వస్తుంది. ఒక చక్కని ఉపన్యాసం విన్న తర్వాత ప్రజలు “ఎంత గొప్ప సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు అంటూ దానిని పొగుడుతారు. ఆ ఉపన్యాసకుడు చెప్పిన విషయం ఎంత వినసొంపుగా ఉన్నా ఎంత మనోరంజకంగా ఉన్నా-దానిని ఆచరణలోకి తేవడం అసంభవమనేదే పై మాటలకు అర్థం. అది ఆచరణయోగ్యం కాని విషయం (1%0/2041021) అని దాని అర్థం. ఇలా సిద్ధాంతం, ఆచరణ వేర్వేరనే భావన ప్రపంచంలో ఎంత ప్రబలంగా ఉన్నప్పటికీ అది వాస్తవం కాదు. కనుక రాష్ట్రీయ స్వయంసేవక సంఘం వాటిని వేర్వేరుగా పరిగణింపజాలదు. సంఘంలో ఇవ్వబడే బౌద్దిక్‌లు పనిచేయడానికి ఇవ్వబడే సూచనలు, సంఘ కార్యక్రమాలు -ఇవన్నీ ఆచరణ యోగ్యములు కావని మనం ఎలా చెప్పగలం ? 
     “చెపుతూ ఉన్నదానిని చేసి చూపుతాము” అనేది మన ఆకాంక్ష మన సిద్ధాంతానికీ, ఆచరణకూ సహజమైన సంబంధం ఉన్నదని మనం భావిస్తాం. సిద్దాంతాన్నీ ఆచరణనూ, ఆలోచననూ, ఆచారాన్సీ వచనాన్నీ కృతినీ సుందరంగా మెళవిస్తానని సంఘం ప్రతిన పూనింది. ఆ ప్రతిజ్ఞను పాలించే బాధ్యత స్వయంసేవకులది. మనం మాట్లాడేదంతా ఆచరణయోగ్యమైనది కావాలి. ఆచరణలోనికి తేవడానికే మనం సిద్ధాంతాలను ్రతిపాదిస్తాం. ఇవి ఆచరణయోగ్యములు అయితీరాలనేది మన నిశ్చితాభిప్రాయం. సంఘంయొక్క ఏ సిద్దాంతంకూడా ఎన్నడూ ఆచరణకు అసాధ్యమైనది కాదనే విశ్వాసం మన హృదయంలో ఉండాలి. 'సంఘంలో ఆచరణకు తావులేదు.” 'సంఘకార్యం, కార్యక్రమం ఆచరణయోగ్యములు కావు.” 'సంఘం అవ్యవహారికతలో చరమసీమను చేరుకున్నది” ఇలా సంఘాన్ని వ్రేలెత్తిచూపే అవకాశం ఎవరికీ దొరకదు. సిద్దాంతానికీ, ఆచరణకూ పొత్తు కుదరనప్పుడు ఆ రెంటిలో ఏదో ఒకదానిలో లోపం ఉండడం నిశ్చయం. సిద్ధాంతంలో ఏదో దోషం ఉండవచ్చు. లేదా ఆచరణలో ఎక్కడో లోపం ఉండవచ్చు. సిద్ధాంతం, ఆచరణ ఒకదానిపై మరొకటి ఆధారపడినట్టివి. కనుక లోపం ఎక్కడ ఉన్నదో సరిగా గుర్తించి, దానిని తొలగించి తద్వారా సిద్ధాంతానికి ఆచరణకూ చక్కని సమన్వయాన్ని సాధించడం మనకర్తవ్యం అవుతోంది.
    తన సిద్ధాంతంలోను, ఆచరణలోను సారూప్యం కలిగిఉన్న వ్యక్తికాని, సంస్థకాని, పూజార్హమవుతుంది. ఒక వ్యక్తియొక్క జీవనయాత్రలోని ప్రతి అడుగూ అతడు స్వీకరించిన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటే, ఆ వ్యక్తి వందనీయుడుగాను, అనుకరణీయుడుగాను పరిగణించబడతాడు. ఆచరణలేని సిద్ధాంతనిష్ట కుంటిదే అవుతుంది. అట్టి గాలికబుర్లు, ఆచరణ శూన్యమైన సిద్ధాంతాలు ఎన్నడూ దెనిని సాధించలేదు. ఇకముందూ సాధించ లేవుకూడా, రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ప్రజలు గుర్తించాలంటే, సంఘ కార్యం సువ్యవస్థితంగా ముందుకు సాగాలనే ఆకాంక్ష మనలోఉంటే-సంఘ సిద్దాంతాలకూ, స్వయంసేవకుల ఆచరణకూ సమన్వయం జరిగి తీరవలసిందే. సంఘనిష్ట ఒక సిద్ధాంతం ప్రబలమైన దాని ప్రభావం ఆచరణపై పడితీరవలసిందే. ఇలా సిద్దాంతము-ఆచరణ, ఆలోచన--ఆచారం, మంత్రం-తంత్రం - ఇవన్నీ ఒకే దిశలో ముందుకు సాగిపోగలిగితే సాఫల్యం మనలను వెన్నాడుతుంది.

సంఘం విషయంలో సర్వత్రా చక్కని వాతావరణం నిర్మాణం కావదం సంఘ ప్రయోజనానికి, అనగా జాతి (శ్రేయస్సుకు అవసరం. సంఘ కార్యం ఏడాది, రెండేండ్లకు పరిమితమయిందికాదు. సంఘం సమాజంలో పనిచేయదలచినది. కనుక చుట్టూ ఉన్న ప్రజలయొక్క భావాలు సానుభూతిపూర్వకంగా ఉండేటట్లు చూడడం స్వయంసేవకునికి ప్రముఖ కర్తవ్యం, మనం చేసే పని ఎంత గొప్పదైనా మన చుట్టూ ఉన్న ప్రజలను, వారి ఆలోచనలను, భావనలను మనం నిర్లక్ష్యం చేయలేము. మన పని సులభమైనదికూడ కాదు. ఏండ్లతరబడి కఠోరమైన తపస్సుచేయడం ద్వారానే మన మీ కార్యాన్ని సాధించగలుగుతాము. ఈ స్థితిలో మనం నలుగురితోపాటుగా సమాజంలో మెలగడం, సమాజంలో మొలగుతూ శ్రేష్టము, పవిత్రమునయిన ఈ దైవకార్యాన్ని కొనసాగించడం మరింతగా అవసరమవుతోంది.
   ఈ పనులన్నీ చేయడానికి ప్రజల భావనలను దృష్టిలో ఉంచుకోవడం తప్పనిసరి అవుతోంది. తమచుట్టూ ఉన్న ప్రజలు సంఘంగురించి ఏమనుకుంటున్నారో స్వయంసేవకులు తెలుసుకోవాలి. ఆ దృష్టితో ఆత్మ విమర్శ చేసుకోవాలి. ప్రజలలోని అపోహలు, అనుమానాలు, అభిప్రాయభేదాలు దృష్టిలో ఉంచుకొని వారిలో సదభిప్రాయం సానుభూతి కలిగిఉండాలని ఆశించేటప్పుడు మనం దానికి అనుగుణంగా మారవలసి ఉంటుంది: మన మంచితనంయొక్క ప్రభావాన్ని ఇతరులపై ప్రసరింప చేయవలసి ఉంటుంది. ఎన్నో దోషాలను మనలో ఉంచుకుని, ప్రజల మనస్సులను విరిచేవిధంగా ప్రవర్తిస్తూకూడా ప్రజలు మనయెడ సదభిప్రాయం సానుభూతి కలిగి ఉండాలని ఆశించడం పిచ్చితనం అనిపించుకుంటుంది. సంఘనిష్ట అనే సిద్దాంతం ఆచరణలో కనపదడవలసిఉంది. అందరినీ సంఘానికి సానుభూతిపరులుగా, శ్రేయోభిలాషులుగా చేయాలంటే మనలో సంఘప్రేమ దానికి తగినంత తీవ్రంగా ఉండాలి. సంఘంపైన మనకు నిజమైన ప్రేమవుంటే సంఘ సిద్దాంతాలు నిజంగా హృదయాన్ని ఆవహిస్తే ఈ సంఘనిష్ట ఆచరణలోనికి రావడం తథ్యం. సిద్ధాంతంపై మనకు గల విశ్వాసం ఆచరణలోనికి రావడం ఎలా ? ప్రజలు సంఘంగురించి మంచిగా చెప్పుకోవాలంటే, వారి మనస్సులో సంఘంయెడ ఆదరభావం జనించాలంటే మనం ఏమి చేయాలి ? సంఘంలో ధ్యేయనిష్టతోబాటు వ్యవహారజ్ఞానం కలిగిన వ్యక్తులు ఉండాలి అనేది దీనికి జవాబు. ఒక్కొక్క వ్యక్తి ప్రవర్తన ఒక్కొక్క విధంగా ఉంటుంది. అయినా దానిని ఏదోవిధంగా సిద్ధాంతంతో సమన్వయం చేసి తీరవలసిందే.

సంఘంలో విద్యార్థులు చాలామంది ఉన్నారు. వారి కర్తవ్యం ఏమిటి ? వారు తమ ఆచరణను సిద్ధాంతంతో ఎలా మేళవించాలి ? అనేదాన్ని ఆలోచిద్దాం. స్వయంసేవకుడు ఆదర్శవంతమైన తన ఆచరణద్వారా తన కుటుంబాన్ని తన తల్లిదండ్రులను, వారితోపాటు సమాజాన్ని కూడా సంతోషపెట్టుతూ సంఘంయొడ ఏకైకనిష్ట కలిగిన ఆదర్శ స్వయంసేవకుడు కాగలుగుతాడు. తనకున్న అనేక కర్తవ్యములు అతదు సమన్వయపరచగలుగుతాడు. అట్టి సమన్వయాన్ని సాధించడం అతని కర్తవ్యం కూడాను. విద్యార్థిగాను స్వయంసేవకుడుగాను అతడు ఆదర్శవంతముగా రూపొందాలి. ఒక విద్యార్థికి మొదటిబాధ్యత విద్యాభ్యాసం. తన చదువులో ఏమాత్రం లోటు రాకుండా చూసుకోవటం, పాఠ్యపుస్తకాలే కాక ఇతర సాహిత్యంకూడా చదవడం, తన విజ్ఞానాన్ని విస్తరించుకోవడం, తన భావనలను గట్టిపునాదులపై నిర్మించుకోవడం - ఇవన్నీ విద్యార్థిగా అతని కర్తవ్యములు. తాను విద్యార్థి కనుక అత డీ కర్తవ్యము లన్నిటినీ నిర్వహించవలసి ఉంది. 'సంఘానికి పంపడంవల్ల యువకులు ఇలా ఆదర్శ విద్యార్ధులుగా తయారవుతారు” అనే సంతృప్తికరమైన మాట అందరూ అనేవిధంగా అతడు కృషిచేయాలి. ఇలా విద్యార్థిదశలో విజ్ఞానాన్ని పెంపొందించుకొంటున్న సమయంలో, అతడు తన పరిచయంలోనికి వచ్చిన తోడి విద్యార్థులతోను, మిత్రులతోను, అధ్యాపకులతోను, పొరుగువారితోను సౌజన్యంతో, ఆల్మీయతతో వ్యవహరిస్తూ వారి హృదయాలను చూరగొనాలి. అయితే ఈ పనిలో ఏకారణాన కానీ తన ఆత్మగౌరవానికి నీళ్ళు వదులుకోవలసిన అవసరం ఎంతమాత్రం లేదు. సంఘంలోని విద్యార్థి స్వయంసేవకుడు ఇలా వ్యవహరిస్తే ప్రజల మనస్సులు అప్రయత్నంగానే అతనివైపు ఆకర్షించబడతాయి. అతడు సభ్యుడుగాఉన్న మహాసంఘటనయెడకూడ వారికి ఆదరభావం ఏర్పడుతుంది. స్వయంసేవకుని వ్యవహార కుశలతవల్ల అతని మిత్రబృందానికి, తల్లిదండ్రులకు, బంధువర్గానికి, అధ్యాపకులకు అతనియెద 'స్నేహభావం నిర్మాణమవుతుంది. తోటి స్వయంసేవకులకు అతడు ఆదర్శప్రాయుడవుతాడు; వారు అతనిని ఆదరభావంతో చూస్తారు. అతని సన్నిహిత సంపర్శ్కంలోనికి వచ్చిన వ్యక్తులందరి పైనా అతని సద్దుణాలముద్ర పడుతుంది. వారు అతనిని అభినందిస్తారు. అతడు నివ్టావంతుడైన స్వయంసేవకుడు కనుక సంఘంలో చేరడంవల్లనే అతడు ఇంతటి గుణవంతుడయినాడని ప్రజలు నిశ్చయంగా భావిస్తారు. ఈ విధంగా వారిలో సంఘంయెడ ఆదరాభిమానాలు జనిస్తాయి. విద్యార్ధియొక్క ప్రవర్తన సంఘకార్యంపై ఎంత విస్తృతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుందో దీనివల్ల స్పష్టమవుతోంది. అతని మంచితనంవల్ల సంఘంయొక్క మంచితనం బుజువవుతుంది. అతడు ఆర్జించిన ప్రజల సానుభూతి సంఘకార్య విస్తరణకు ఎంతో సహాయకారి అవుతుంది. 

స్వయంసేవకుని సత్ప్రవర్తన, దుష్ప్రవర్తనల పైన సంఘంయొక్క ప్రగతి, పతనం  ఆధారపడి ఉన్నాయి. స్వయం సేవకునికివచ్చే ప్రశంసలో సంఘ ప్రశంస, అతని శ్రేయస్సులో సంఘ శ్రేయస్సు ఇమిడిఉన్నాయి. అలాగే స్వయంసేవకుని బాధ్యతారహిత్యం, అగౌరవకర ప్రవర్తన సంఘానికికూడా నష్టదాయకంగా పరిణమిస్తాయి. కనుక స్వయంసేవకుడు సంఘాన్ని నిజంగా అర్థం చేసుకుంటే, “సంఘకార్యం పెరగాలి; నేను మరింతగా సంఘకార్యాన్ని నిర్వహించాలి అనే పూనిక అతనిలో ఉంటే- సంఘ సిద్దాంతములకు అనుగుణంగా అతడు ప్రవర్తించడం అవసరం. 
    ప్రభావవంతమైన తేజోరాశివంటి సంఘటనను మనం నిర్మించవలసి ఉంది. సంఘాన్ని సుస్థిరం చేయాలి. విస్తరింపజేయాలి, నిజంగా అలా చేయగోరితేసంఘ స్వయంసేవకులమైన మనం సిద్ధాంతం పై (శ్రద్ధతోపాటు వ్యవహారకుశలతనుకూడ అలవరచుకోవాలి. దీనికై మనం మన విద్యార్థి జీవితాన్ని పూర్తిగా సఫలంచేసి చూపాలి. ఒక విద్యార్థి శ్రద్ధగా చదువుకుంటూ, ప్రేమ సౌజన్యములతో ప్రవర్తిస్తూ, ఇంటి పనులన్నీ చక్కగా సమయానికి చేస్తూ, సంఘ సిద్ధాంతాలను విస్మరించక సంఘం పనికూడా చేస్తే- అతని తల్లిదండ్రులు అతనిపైన ఎందుకు అయిష్టం చూపుతారు ? అతనితో మైత్రిని పెంపొందించుకోవాలని కోరనివారు ఎవరుంటారు ? ఏ అధ్యాపకుడయినా అతనిని అభిమానించకపోవడం సంభవమా ? అతడు అందరికీ ఆదర్శంగా నిలుస్తాడు; అందరికీ ప్రీతిపాత్రుడు, ప్రశంసనీయుడు అవుతాడు; సంఘాన్ని గురించిన స్తుతిపరాగంతో దశదిశలా వాతావరణం సుగంధితమయి తీరుతుంది.

సంఘకార్యంలో అనేకములైన అంశములు ఉన్నాయి. స్వయంసేవకుడు తన బాధ్యతను గుర్తించి దానికి అనుగుణంగా ప్రవర్తించడం కూడ సంఘకార్యమే. మనంచేసే ప్రతిపనీ, మనం ముందుకువేసే ప్రతి అడుగూ సంఘకార్యంపై ఎట్టి ప్రభావాన్ని కలిగి ఉంటుందని ఆలోచించిన తర్వాతనే మనం ఏ పనైనా చేపట్టాలి. ఈ దృష్టితో ఆలోచించి జీవితంలో ప్రతి అడుగూ ముందుకువేస్తే, మనద్వారా సంఘానికి పోషకమయేె పని మాత్రమే జరుగుతుంది; దానికి విరుద్ధమైన పని ఎన్నడూ జరుగదు. ఆలోచనలో ఈ గాంభీర్యాన్ని వ్యవహార కుశలతను సంపాదించడానికి ముఖ్యావసరం “యోగ్యమైన మనఃప్రవృత్తి. ఈ మనః ప్రవృత్తిని నిర్మించడం సులభమే. హృదయంలో సంఘ నిష్టను సదా జాగృతంగా ఉంచుకొని వ్యవహరిస్తే ఈ ప్రవృత్తి మనలో సహజంగా నిర్మాణ మవుతుంది. మన తన మనో ధనాలన్నీ సంఘానివే. కనుక సంఘంలోని ఏ స్వయంసేవకుడూ సంఘకార్యానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదని సంఘం సహజంగా ఆశిస్తుంది. మన పనివల్ల సంఘంపై ఎట్టి ప్రభావం కలుగుతుందని అడుగడుగునా ఆలోచిస్తూ, ధ్యేయనిష్టను 'పెంపొందించుకుంటూ, వ్యవహార కుశలతను అలవరచుకోవలసి ఉంది. దీని ద్వారానే సంఘకార్యం యొక్క సుస్థిర వికాసం జరుగ గలదు.
    '“సంఘంవల్ల పిల్లలు ఇంటి పనులు నిర్లక్ష్యం చేస్తున్నారు; చెప్పిన మాట వినకుండా చెడిపోతున్నారు; చదువుపైన (శ్రద్ధచూపడంలేదు” అని సంరక్షకులు చాలాసార్లు ఫిర్యాదు చేస్తూ ఉంటారు. అలాంటి చెడుపనులు చేయుమని సంఘంలో ఎలా ఆదేశించగలుగుతుంది ? వాస్తవానికి సయంసేవకుడు సంఘంలో ఒక గంటమాత్రమే గడుపుతాడు మిగతా 28 గంటలు బయటనే గడుపుతాడు. ఈ ఒక గంట వ్యవధిలో సంఘం అనేక కార్యక్రమాలద్వారా అతనిని సంస్మరించడానికి ప్రయత్నిస్తుంది. కాని చాలామంది స్వయంసేవకులు తమ బాధ్యతను గుర్తెరుగకుండా ఎంతో సమయాన్ని అనవసరపు కబుర్లతోను, తిరుగుళ్ళతోను వృథా చేస్తారు. ఈ కారణంవల్ల పెద్దలకు సంఘాన్నిగురించి అపోహ కలుగుతుంది. తమ పిల్లవాడు ముప్పాద్దులా సంఘంలోనే ఉంటాడనీ, వాడు చెడిపోతున్నాడనీ, వాదికి సంఘం పిచ్చిపట్టిందనీ వారికి అనిపిస్తుంది. స్వయంసేవకులకు నిజంగా సంఘం పిచ్చి పట్టవలసిందే. అయితే ఆ పిచ్చి మరోవిధంగా ఉంటుంది. ఇట్టి బాధ్యతారహిత ప్రవర్తన సంఘం పిచ్చికాదు. సంఘపిచ్చి ఎంతో ఉదాత్తమైనది. సంఘ పిచ్చి పట్టిన వ్యక్తి సిద్ధాంతానిక్తీ, ఆచరణకూ మధ్య ఎన్నడూ తేడా రానీయడు; తనకు గాని, సంఘానికిగాని చెడ్డపేరు తెచ్చే పని తనద్వారా ఎన్నడూ జరుగనీయడు.

ప్రతి స్వయంసేవకుని ప్రవర్తనా సంఘం శ్రేయస్సు దృషా అత్యంత సమర్థవంతంగా ఉండాలని దీని సారాంశం. ఎంతటి మహావ్యక్తి అయినా ఈ కార్యాన్ని ఒంటరిగా చేయలేడు. సిద్ధాంతాన్ని జీవితంలో ప్రతిబింబించేవారు, బాధ్యతను గుర్తెరిగినవారు, యువకులు, వ్యవహారకుశలురు అయిన వేలాది, లక్షలాది, సహచరులు అండగా నిలిచినప్పుడే ఈ కార్యం పూర్తికావడం సాధ్యం. “ఈ సంఘం నాది; ఉన్నతమైన సిద్ధాంతములు ఆధారంగానే ఇది ప్రగతి పొందుతుంది. లోకసంగ్రహం మన మహత్తర సిద్ధాంతం”- అనే విశ్వాసం రాత్రింబవళ్ళు ఎదలలో పదిలపరచుకొని స్వయంసేవకులు వ్యవహరించవలసి ఉంది.
    సంఘకార్యం తక్కువదనీ, మన చుట్టూ ఉన్న సమాజానికి, సంరక్షకులకు ముఖసుత్తి చేయడమే మన ధర్మమనీ దీనినిబట్టి అర్థం చేసుకోకూడదు. స్వయంసేవకులు ఉత్తమ ప్రవర్తనద్వారా అందరినీ ఆకర్షించాలనేది నిజమే. అయితే ఆ కారణాన సంఘ కార్యానికి ఎన్నడూ ఎట్టి ఆటంకము కలుగనీయకూడదు. తత్వనిష్టకూ, ప్రవర్తనకూ సమన్వయం సాధించేటవ్ప్వుడు “ప్రవాహంలో కొట్టుకొనిపోవడం ఇదంతా మనం సంఘం కోసమే చేస్తున్నాం” అని భ్రమపడడం సంభవం. ఇట్టీ ఆత్మవంచనకు మనం లోను కాకూడదు. “ఇంటి వ్యవహారాలు చూచుకోవడంలో సంఘం పని కొంత నష్టపడినా ఫరవాలేదు 'మన ఆప్తమిత్రులను సంతోష 'పెట్టడానికై తీరిక సమయాలలో మాత్రమే సంఘంపని చేయాలి” ఇలాంటి భ్రమలు కలగడంకూడా సంభవం. కాని “సంఘకార్యమే నా జీవితంలో ప్రప్రథమమైన కార్యము” అనే దృఢవిశ్వాసంతోనే జీవన వ్యాపారమంతటినీ నడపవలసి ఉంది. అనేకములైన ఇతర వ్యవహారములు ఎంత గొప్పవయినా వాటికి సంఘకార్యం కన్న ఎక్కువ విలువ ఇవ్వడం ఎన్నడూ సముచితంకాదు. మనం సంఘంపని చేయాలి దానికి ఎట్టి ఆటంకమూ కలుగని విధంగా మనం అన్ని వ్యవహారములను సర్దుబాటు చేసుకోవాలి. వ్యవహారకుశలత అంటే అర్ధం ఇదే. ఉదాహరణకు:- ఒక విద్యార్థి చక్కగా చదువుకుంటూ ఉంటే, ఇంటిపనులు సకాలంలో చేస్తూ ఉంటే అతనికి సంఘంపని చేయడానికి మరింత స్వేచ్చ లభిస్తుంది. ఏ విధంగానూ సంఘంపని కుంటుపడకూడదు. దానికి ఆటంకం కలుగకూడదు-అనే విషయంపైననే మనం మన దృష్టిని కేంద్రీకరించాలి. మనం సంఘంపనిని చక్కగా చేయగలగడం, ఇతరులుకూడా సంఘంపని చేయడానికి అనువైన పరిస్థితులను నిర్మించగలగడం, ప్రజలలో సాధ్యమైనంతవరకు సంఘాన్ని గురించి మంచి అభిప్రాయాన్ని కలిగించగలగడం-ఇదే మన వ్యవహార కుశలతకు గీటురాయి. సంఘంపని గొప్పదా, కుటుంబంపని గొప్పదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. సాధ్యమైనంతవరకు కుటుంబం పనులకు సంఘంపనికి వైరుధ్యం కలుగనీయకూడదనేది దీనికి జవాబు. 
    ఇంటి పనులకూ, సంఘంపనికి సమయాన్ని వేర్వేరుగా కేటాయించి ఉంచాలి. దీనితోపాటు సంఘంపని కోసం ఇచ్చే సమయాన్ని అధికాధికం చేయడానికి యత్నించాలి. అయితే ఇంటి పనులన్నీ చక్కగా పద్ధతి ప్రకారం చేసిన తర్వాతకూడా పెద్దలు సంఘంపనికి ఆటంకాలు కలిగిస్తే 'ఇతర సమయాలన్నింటిలో ఇంటిపని తప్పకుండా చేస్తాను; కాని సంఘం పనికోసం నాకు ప్రత్యేకంగా సమయం ఉండాలి. ఆ సమయంలో ఇంటిపనులు చేయడం నావల్లకాదు; ఎందువల్లనంటే సంఘంపని మహత్తరమైనది' అని వారితో స్పష్టంగా చెప్పాలి. “ప్రభుత్వోద్యోగం చేయవచ్చా లేదా? అని ప్రశ్నించేవారికి కూడా “తమ ఆత్మగౌరవాన్ని సంఘనిష్టను నిలుపుకుంటూ జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలనేదే సూటి జవాబు. ఒక వ్యక్తి ప్రభుత్వోద్యోగి కావడమంటే అర్ధం అతడు తన ధర్మాన్ని కూడా వదలుకున్నాడని కాదు. ధర్మానికీ, సమాజానికీ సంబంధించిన కర్తవ్యాలకు అతడు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాడు. ప్రభుత్వోద్యోగంలో చేరక పూర్వమూ అతడు హిందువే; చేరిన తర్వాతకూడా అతడు హిందువుగానే ఉంటాడు. హిందువులకు సేవ చేయవలసిన బాధ్యతను అతడు ఎన్నడూ ఉపేక్షించలేడు. అతడుకూడా సంఘంపని చేయాలి దానికై ఎంతటి కష్టనష్టాలకయినా సిద్ధపడాలి. చివరకు ఉద్యోగం వదులుకోవడానికి సైతం వెనుకాదకూదదు. మనం ఆజన్మాంతం నిస్వార్ధబుద్ధితో తను మన ధన పూర్వకంగా సంఘకార్యాన్ని నిర్వహించాలి. మనకు మనది అనేది ఏదీ మిగిలిఉండలేదు. అంతా సంఘానిదే అయిపోయింది. కనుక సంఘకార్యానికి సహాయపడే పనిమాత్రమే మనవల్ల జరగాలి. సంఘకార్యం మహత్తరమైన ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతంపై మనకు అచంచలమైన విశ్వాసం ఉన్నది. కనుక సంఘకార్యంలో సంరక్షకులవల్ల, ఉద్యోగంవల్ల ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని తొలగించడం స్వయంసేవకులమైన మన కర్తవ్యం అవుతోంది.

సంఘంయెడల అభిమానం కలిగిన సంరక్షకులయెడ స్వయంసేవకులు సౌజన్యంతో వ్యవహరించాలి. సంఘ సానుభూతిపరులకూ *మా పిల్లవాడు సంఘకార్యంలో పూర్తిగా మునిగిపోయినా ఫరవాలేదు” అని భావించేవారికీ తమ పిల్లలవలన ఏదైనా కష్టం కలిగితే అది క్షమించరానిదే అవుతుంది. చదువులోను ఇతర ఇంటివిషయాలలోను పెద్దల ఆశలను పూర్తిచేయడంలోనే సంఘశ్రేయస్సు ఉన్నదనే విషయాన్ని స్వయంసేవకులు ఎన్నడూ మరువకూడదు.
   సంఘకార్యం ఒక పవిత్రకార్యం. దానియెడ మనకుగల ్రద్ధాభక్తులు మన ఆలోచనలోనూ ప్రవర్తనలోనూ పూర్తిగా ప్రతిబింబించాలి. మనంచేసే ప్రతిపనీ సంఘకార్యం దృష్టితోనే జరుగుతోందని మనం నిజాయితీతో చెప్పగలగాలి. జీవితమంతా సంఘకార్యం చేయదలచుకున్నవారు కూడ చదువుకోవడం, తద్వారా సంఘంపని చేయడానికి యోగ్యతను, అధికారాన్ని సంపాదించుకోవడం అవసరమే. సంఘంకోసమే చదువు, సంఘానికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడే పద్ధతిలోనే ఇంటిపని, చివరకు సంఘకార్యం చేయడానికి శక్తినీ, ఉత్సాహాన్నీ పొందడానికే ఆహార, నిద్రలు-ఇట్టి మనస్తత్వంతో వ్యవహరించే స్వయంసేవకుడే ఇతరులకు ఆదర్శప్రాయుడు కాగలుగుతాడు. పవిత్రమైన సంఘనిష్ట మన ప్రవర్తన అంతటికీ ఆధారం అయినప్పుడే ఆ ప్రవర్తనకుకూడ పవిత్రత, ఉదాత్తత లభిస్తుంది. మనంచేసే ప్రతిపనీ సంఘకార్యంయొక్క దైవప్రేరణతో తొణికిసలాడడమే మన ప్రత్యేకత. ఈ ప్రేరణ లేనినాడు మనకు పశుపక్ష్యాదులకూ తేడా ఏమీ ఉండదు. ఇంతటి ఉన్నతమైన మనఃప్రవృత్తితో వ్యవహరించడం అలవాటు చేసుకోవాలి. అకారణంగా ఎవరిలోనూ ఎట్టి అపోహలూ కలుగని విధంగా సంఘం పనికోసం తగినంత సమయం దొరికేటట్లు ప్రవర్తించే నిపుణతను నిరంతర ప్రయత్నంద్వారా అలవరచుకోవడం ప్రతి ఒక్కరికీ సాధ్యమే. నిజం చెప్పాలంటే చదువుకాని, సంసార భారంకాని సంఘంపనికి సమయం దొరికనంత ఎక్కువగా ఎన్నడూ ఉండవు. ఒకవేళ అట్టి పరిస్థితే ఏర్పడితే సంఘ కార్యంముందు మిగతా పనులన్నీ తీసికట్టే అనేది తుదినిర్ణయం. ఇంటిపని, చదువు, ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక ప్రయోజనం ఇత్యాది విషయాలు సంఘంకన్న ఎక్కువైనవి కావు. ఇట్టి విషయాలపై వ్యామోహం కలిగించే పరిస్థితి ఎన్నడైనా ఏర్పడితే దానిని ప్రక్కకు నెట్టగలిగేటంత దృఢంగా మనలో ఈ విశ్వాసం పాదుకోవాలి. సంఘంపైన అకుంఠితమైన విశ్వాసంద్వారాను, భావనైర్మల్యంద్వారాను ఎంతటి వ్యామోహమయినా, వికారమయినా భస్మీపటల మయేంటంత సుదృథంగాను, సమర్థవంతంగాను మన అంతఃకరణ రూపొందాలి. ఇది అంత తేలికైన విషయంకాదు. దీనిని సంపాదించడానికి కలోరమైన తపశ్చర్య అవసరం. ఇట్టి తపశ్చర్య విద్యార్థి దశలోనే సులభం. సంఘకార్యం జీవితంలోని ప్రముఖ కార్యమని భావించి, ప్రవర్తన అంతటినీ విద్యార్ధిదశనుండీ ఆ విశ్వాసానికి అనుగుణంగా మలచడం నేర్చుకోవాలి.

స్వయంసేవకుడు సంఘానికి పోషకమయే పనులు మాత్రమే చేయాలి. సంఘకార్యం మరింతగా ముందుకు సాగిపోయే పనులు మాత్రమే చేయాలి. “జాకే ప్రియ న రామ వైదేహీ, తజియే తాహి కోటి బైరి సమ జద్యపి పరమ ననేహీ” అనే గోస్వామి తులసీదాసు సూక్తి స్వయంసేవకుని ఆదర్శ మనః ప్రవృత్తిని సూచిస్తోంది. సంఘకార్యానికి ఆటంకం కలిగించే ప్రతి విషయానికి తిలాంజలి ఇచ్చే గుందడెనిబ్బరం స్వయంసేవకునిలో ఉందాలి. 
   సంఘంలో సిద్దాంతం పైన ్రద్ధ, వ్యవహార కుశలత కలిగిన వ్యక్తుల సంఖ్య పెరగాలి. సిద్ధాంతానికీ, ఆచరణకూగల సంబంధంలోనే ప్రగతిబీజం ఇమిడి ఉన్నది. సంఘనిష్ట్ర లోకసం[గ్రహం ఇవి రెండూ సంఘంలోని ప్రముఖ సిద్ధాంతాలు. కనుక ఈ రెండు సిద్ధాంతాలనూ అనుసరించి తీరాలి. దీనికై మనం ఎంత కష్టపడవలసివచ్చినా, ఎన్ని క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనవలసివచ్చినా- అట్టి త్యాగానికి మనం సిద్ధపడాలి. త్యాగమే సాఫల్యానికి కీలకం. ప్రగతికి త్యాగం వినా మరో మార్గంలేదు. మన త్యాగముపైననే సంఘంయొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. ఎట్టి త్యాగము చేయకుండా కార్యసాఫల్యాన్ని ఆశించడం అవివేకం; అది అసంభవమైన విషయం. త్యాగము జరుగనిదే ఎన్నడూ ఫలితం లభించదు. త్యాగంలోనే నిజమైన సుఖం ఉన్నది. త్యాగంద్వారానే అమృతత్వం సిద్ధిస్తుంది. త్యాగంలేకుండా ఉట్టిపుణ్యానికి గొప్పదనాన్ని సంపాదించే మార్గమేదో సంఘంవద్దలేదు. త్యాగమార్గంలో మనం వెనుకంజవేసి, ఆ కారణాన సంఘకార్యం వెనుకపడితే-మనం మహాపరాధంచేసినవాళ్ళమవుతాము.
(full-width)

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top